Dec 13,2022 00:01

నమూనాలను గురించి అడిగి తెలుసుకుంటున్న హరిబాబు

ప్రజాశక్తి-అనకాపల్లి
నానాటికీ పెరుగుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మిజోరం రాష్ట్ర గవర్నర్‌ కంభంపాటి హరిబాబు సూచించారు. స్థానిక డైట్‌ కళాశాలలో సోమవారం కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వైబ్రంట్‌ 2022 వార్షికోత్సవ వేడుకలను హరిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్‌ కళాశాలల్లో డైటుకు నాలుగవ స్థానం రావడం అభినందనీయమన్నారు. మొబైల్‌ ద్వారా ప్రపంచంలో అనేక సాంకేతిక అంశాలను సులువుగా తెలుసుకోవచ్చని చెప్పారు. మాజీ మంత్రి, కళాశాల వ్యవస్థాపక చైర్మన్‌ దాడి వీరభద్రరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్ర గవర్నర్‌గా ఎదిగిన మంచి వ్యక్తి కంభంపాటి హరిబాబు అని, ఆయనతో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. జెఎన్‌టియు కాకినాడ వైస్‌ ఛాన్సలర్‌ జివిఆర్‌.ప్రసాద్‌ రాజు మాట్లాడుతూ విద్యలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో విప్లవాత్మక మార్పులు చేపట్టాయని తెలిపారు. కళాశాల చైర్మన్‌ దాడి రత్నాకర్‌ మాట్లాడుతూ 2006లో ప్రారంభమైన కళాశాల నేడు 2,500 మంది విద్యార్థులతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ నమూనాలను పరిశీలించారు. విద్యార్థులకు సిల్వర్‌ మెడల్స్‌, ప్లేస్మెంట్స్‌ పొందిన విద్యార్థుల తల్లిదండ్రులను సత్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పీలా లక్ష్మి సౌజన్య రాంబాబు, కొణతాల నీలిమ భాస్కరరావు, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చెల్లా నరసింహం, వైస్‌ ప్రిన్సిపల్‌, ప్రోగ్రాం కన్వీనర్‌ వైకుంఠరావు, వివిధ శాఖల అధిపతులు, బోధన బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.