Dec 16,2022 22:24

నేడు సంస్మరణ సందర్భంగా
1948 నుంచి 1952 వరకు సాగిన వీర తెలంగాణ ప్రజా పోరాటం సందర్భంగా ఎందరో యువకిశోరాలు కమ్యూనిస్టు పార్టీ కోసం కొరియర్‌గా పని చేసి నేతలను కాపాడుకున్నారు. వారిలో ఒకరు పాలకొల్లు మండలం కాపవరానికి చెందిన కొత్తలంక రామబ్రహ్మం. చిన్న వయస్సులోనే కమ్యూనిస్టు పార్టీ సేవలకు, ఆశయాలకు ఆకర్షితులై అత్యంత గడ్డు రోజుల్లో ప్రాణాలకు తెగించి, పార్టీ కోసం చురుగ్గా పని చేశారు.
            నరసాపురం తాలుకా బ్రిటీష్‌ కాలంలోనే సాతంత్రోద్యమం బలంగా సాగిన ప్రాంతం. పాలకొల్లు, జిన్నూరు, పోడూరు, కవిటం, కాపవరం, వాలమర్రు, కొమ్ముచిక్కాల, పోలవరం, అరటకట్ల, భగ్గేశ్వరం, లంకలకోడేరు, చింతపర్రు, దగ్గులూరు తదితర గ్రామాలన్నీ స్వాతంత్ర సాధనకు సాగిన పోరాటంలో ముందున్నాయి. అనంతరం సమ సమాజం, శ్రమజీవుల హక్కుల కోసం పోరు సల్పాయి. ఆ ప్రాంత నాయకునిగా పార్టీ అభివృద్ధే తన జీవిత పరమార్ధంగా అత్యున్నత చైతన్యంతో రామబ్రహ్మం ముందుకు సాగారు. శ్రామికజనావాళికి ఆత్మబంధువు.. రామబ్రహ్మం. ఆయన జీవిత యానం నేటి తరానికి మార్గదర్శకం. వెయ్యి కళ్లతో ఎక్కడ, ఎవరికి ఏ కష్టమొచ్చినా కని పెట్టుకుని ఉంటూ వారిని ఆదుకునేవారు. విరామం, విశ్రాంతి ఎరుగని జీవితంతో ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఇంటి దగ్గర స్వర్ణకారునిగా ఆగ్రామంలోని ప్రజలకు చిన్న చిన్న బంగారు నగలు చేస్తూ కుటుంబ పోషణ సాగించే వారు. మరోపక్క పార్టీ కార్యక్రమాల బాధ్యత. వెన్నుకు సంబంధించి తీవ్ర సమస్యతో పార్టీ జోక్యంతో శస్త్రచికిత్స చేయించుకుని కోలుకున్నారు. అనంతరం భార్య రామాయమ్మ సహాయంతో చిన్నచిన్న బంగారపు నగలు చేసేవారు. కొన్నాళ్లకు నెమ్మదిగా సైకిల్‌పై పాలకొల్లు పార్టీ ఆఫీసుకు వచ్చి కార్యక్రమాలు తెలుసుకునేవారు. ఈ నెల ఏడో తేదీన వయోభారంతో కన్నుమూశారు.
రామబ్రహ్మం రామాయమ్మ దంపతులకు ఐదుగురు బిడ్డలు. ముగ్గురు కుమారులు. ఇద్దరు కుమార్తెలు. కుటుంబమంతా తల్లిదండ్రుల వారసత్వంతో ప్రజా ఉద్యమాలను అభిమానిస్తూ అభ్యుదయవాదులుగా, ఆదర్శ శ్రామికులుగా జీవిస్తున్నారు. శ్రామికరాజ్యం, సమసమాజం స్థాపనకు శ్రమజీవుల సౌభాగ్యం కోసం నిరంతర కృషే రామబ్రహ్మం, రామాయమ్మలకు ఘన నివాళి.
- అల్లూరి మన్మోహిని
ఆదర్శ ప్రజా నాయకుడు రామబ్రహ్మం
పార్టీపై నిర్బంధకాలంలో నాయకులను, పార్టీ రహస్యాలను కాపాడటంలో, పార్టీ నిర్ణయాలను, సమాచారాన్ని ఇతర ప్రాంతాలకు క్షేమంగా చేరవేయడానికి ప్రాణాలకు తెగించి ధైర్యంగా కొరియర్‌గా పని చేసిన ధీరుడు రామబ్రహ్మం. వ్యవసాయ కార్మిక ఉద్యమ నాయకునిగా, సిపిఎం నాయకునిగా ప్రజల మన్ననలు పొందిన ఆదర్శ ప్రజా నాయకులు. సాధారణ కుటుంబమైనా తనకు వస్తున్నా వృద్ధాప్య పెన్షన్‌ నుంచి ప్రతినెలా పార్టీకి రూ.500 విరాళంగా అందించి అంకితభావం ప్రదర్శించిన త్యాగశీలి. భార్య రామాయమ్మ కూడా పార్టీ సభ్యురాలిగా, మహిళా సంఘం కార్యకర్తగా పార్టీ కార్యకర్తలను, నాయకులను ఎంతగానో అభిమానించి ఆదరించేవారు. రామబ్రహ్మంకు విప్లవ జోహర్లు.
- బి.బలరాం,
సిపిఎం పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి
ఏ కార్యక్రమానికైనా సైకిల్‌పైనే..
రామబ్రహ్మం స్వగ్రామం కాపవరం నుండి పాలకొల్లు ఏకార్యక్రమానికైనా సైకిల్‌పైనే రాకపోకలు సాగించేవారు. మహిళాసంఘం కార్యక్రమాలకు ఆయన భార్య రామాయమ్మ రావాలంటే తనకున్న చిన్న మోపెడ్‌పై తీసుకొచ్చేవారు. చాలా సందర్భాల్లో ఒంటరిగానే పార్టీ, సంఘం ఇచ్చిన బాధ్యతలను పట్టుదలగా సైనికునిలా పని చేసేవారు. కూలిరేట్ల ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించారు. అప్పుడు ఆయన ఆనందం పట్టలేకపోయారు. జిల్లా ఉద్యమ నిర్మాత ఉద్దరాజు రామం స్వగ్రామం వాలమర్రు, ఈయన గ్రామం కాపవరం పక్కపక్కనే కావడం విశేషం. గ్రామంలో ఈయన సామాజిక తరగతి ప్రజలు తక్కువ మందైనా కమ్యూనిస్టుగా, వ్యవసాయకార్మిక సంఘం నాయకునిగా ప్రజా సమస్యలపై పనిచేసే నాయకునిగా అందరి హృదయాల్లోనూ నిలిచారు. అత్యంతసౌమ్యునిగా మృదుభాషిగా పేరొందారు. ఎంతటి వారికైనా మరణం అనివార్యం.. అయితే ఆశయాలు మాత్రం అజరామరం. రామబ్రహ్మం జీవితం అందుకు తార్కాణం.
- ఎ.రవి,
సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి