* వచ్చే నెలలో ఉండవచ్చంటూ ప్రచారం
* ఈనెల 31 నాటికి 35,195 ఇళ్లు పూర్తి చేయాలని నిర్దేశం
* ఇప్పటివరకు పూర్తయినవి 29,347 గృహాలు
* ఇళ్లు పూర్తవుతున్నా మౌలిక వసతుల్లో తీవ్ర వెనుకబాటు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: జగనన్న కాలనీల్లో సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టాలని ప్రభుత్వం పలుమార్లు ప్రయత్నించినా నెరవేరలేదు. ఈసారి ఎలాగైనా ఆ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో గృహ ప్రవేశాలు ఉండవచ్చనే సూచాయగా అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. అందుకనుగుణంగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇళ్ల నిర్మాణ ప్రగతిపై జెడ్‌పిలో గృహనిర్మాణ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో గృహనిర్మాణ శాఖ ప్రభుత్వ కార్యదర్శి దివాన్ గురువారం సమీక్షించనున్నారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నా కాలనీల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యాల కల్పనలో తీవ్ర వెనుకబాటు కనిపిస్తోంది. లేఅవుట్లలో మౌలిక వసతులను కల్పించగలితే, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని అధికార యంత్రాంగం భావిస్తోంది.
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు (ఎన్‌పిఐ) పథకంలో భాగంగా 74,811 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 35,195 ఇళ్లను ఈ నెలాఖరు నాటికి సిద్ధం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించింది. ఇళ్ల నిర్మాణాలతో పాటు ఇళ్లకు విద్యుత్, తాగునీటి సరఫరా కల్పించాలని సూచించింది. ఇందులో ఇప్పటివరకు 28,935 ఇళ్లు (83.40 శాతం) పూర్తయ్యాయి. మరో 5,841 ఇళ్లు పూర్తి చేయాల్సి ఉంది. మండలాల వారీగా ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తే, ఆమదాలవలస అర్బన్‌లో అత్యధిక నిర్మాణాలు పూర్తయ్యాయి. ఆమదాలవలస అర్బన్ ప్రాంతానికి 755 ఇళ్లను లక్ష్యంగా నిర్ధేశించగా 729 ఇళ్లు (96.56 శాతం) పూర్తయ్యాయి. ఆమదాలవలస మండలంలో 862 ఇళ్లను నిర్మించాల్సి ఉండగా, ఇప్పటివరకు 815 (94.55 శాతం) గృహాలను నిర్మించారు. ఇచ్ఛాపురం అర్బన్ ప్రాంతానికి 1032 గృహాలను కేటాయించగా 863 ఇళ్లను (93.31 శాతం) నిర్మించారు. సరుబుజ్జిలి మండలానికి 732 ఇళ్లను కేటాయించగా 678 గృహాలను (92.62 శాతం) పూర్తి చేశారు. పోలాకి మండలంలో 1320 ఇళ్లను నిర్మించాల్సి ఉండగా 1222 గృహాల నిర్మాణం (92.58 శాతం) జరిగింది. లావేరు మండలానికి 1875 ఇళ్లు లక్ష్యంగా నిర్ధేశించగా 1682 ఇళ్లు (89.71 శాతం) పూర్తయ్యాయి. పలాస-కాశీబుగ్గ అర్బన్ ప్రాంతంలో 1875 ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, ఇప్పటివరకు 1682 గృహాలను (88.80 శాతం) పూర్తి చేశారు. జలుమూరు మండలానికి 1,290 ఇళ్లు లక్ష్యం కాగా, 1140 ఇళ్లు (88.37 శాతం) నిర్మించారు. శ్రీకాకుళం అర్బన్ ప్రాంతంలో ఇప్పటికీ కనీసం 50 శాతం గృహాలూ పూర్తి కాలేదు. ఇక్కడ 2,968 ఇళ్లను కేటాయించగా, ఇప్పటివరకు 1474 నిర్మాణాలు (49.80 శాతం) మాత్రమే పూర్తయ్యాయి.
లేఅవుట్లలో నామమాత్రంగా విద్యుత్ కనెక్షన్లు
జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనలోనూ వెనుకబాటు కనిపిస్తోంది. ప్రధానంగా తాగునీరు, విద్యుత్, రహదారుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకు 28,935 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వాటిలో సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుంటున్న వారు 23,679 మంది, జగనన్న లేఅవుట్లలో ఇళ్లు నిర్మించుకుంటున్న వారు 5,256 మంది ఉన్నారు. వీటిలో ఇప్పటివరకు 24,197 ఇళ్లకు (83.63 శాతం) విద్యుత్ సరఫరాను అందించగలిగారు. ఇందులో సొంత స్థలాల్లో నిర్మాణం చేపడుతున్న 21,820 ఇళ్లకు, లేఅవుట్లలో ఉన్న 2,377 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లను ఇచ్చారు. లే అవుట్లలో విద్యుద్దీకరణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. కవిటిలో ఐదు ఇళ్లకు, ఇచ్ఛాపురం అర్బన్‌లో ఏడు, మందసలో తొమ్మిది ఇళ్లకు మాత్రమే విద్యుత్ సరఫరా అందించగలిగారు.
తాగునీటి సౌకర్యమూ అంతంతమాత్రమే
ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు అంతంతమాత్రంగానే తాగునీటి సౌకర్యం అందించారు. జిల్లాలో 28,935 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా 23,988 ఇళ్లకు (82.90 శాతం) తాగునీటి కనెక్షన్లు ఇచ్చారు. వీటిలో లేఅవుట్లలో కేవలం 2,185 ఇళ్లకు మాత్రమే తాగునీటిని అందించగలిగారు. మిగిలిన 21,807 కనెక్షన్లు సొంతంగా ఇళ్ల నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఇచ్చారు. లేఅవుట్లలో తాగునీటి సరఫరా పనులు నత్తనడకన సాగుతున్నాయి. కవిటిలో ఐదు ఇళ్లకు, మందసలో తొమ్మిది, ఆమదాలవలస అర్బన్‌లో పది ఇళ్లకు, ఇచ్ఛాపురం అర్బన్‌లో 12 ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇచ్చారు.










