Sep 25,2023 00:10

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం సామూహిక మరుగుదొడ్లు అవసరమని భావించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లో సామూహిక మరుగుదొడ్లను నిర్మించారు. గ్రామాలు స్వచ్ఛందంగా ఉండాలనే లక్ష్యంతో స్వచ్ఛభారత్‌ పథకంలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో పలు గ్రామాల్లో వీటి నిర్మాణం చేపట్టారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా సుమారు రూ.40 కోట్ల నిధులతో 3 లక్షల సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టినా ఎక్కడా వీటిని వినియోగించడం లేదు. గ్రామాల శివారు ప్రాంతాల్లో కొన్నిచోట్ల, సామాజిక స్థలాల్లో కొన్నిచోట్ల 10 నుంచి 15 మరుగుదొడ్లను కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నిర్మించి వదిలేశారు. కొన్నింటికి తలుపులు వేయలేదు. నాసిరకంగా నిర్మాణాలు చేపట్టడం వల్ల ప్రజలు వాటిని వినియోగించలేకపోయారు. చాలాచోట్ల నీటి సౌకర్యం కూడా కల్పించకపోవడంతో ప్రజలు అటువైపు కన్నెత్తి చూడడం మానేశారు. ప్రధానంగా నీటి సౌకర్యం, విద్యుత్తు సౌకర్యం, స్థలం ఎంపిక చేసిన ప్రదేశాలు పట్టించుకోకుండానే నిర్మాణాలు చేయడంతో ప్రజలు వీటిని విస్మరించారు. సుమారు 10 ఏళ్ల క్రితం వీటిని నిర్మించి అలా వదిలేయడంతో తుప్పలు, డొంకలు పేరుకుపోయి శిథిలావస్థకు చేరాయి. గ్రామాలకు శివారు ప్రాంతంలో ఉండటం వల్ల ప్రజలు వినియోగించడానికి ఆసక్తిని చూపలేకపోయారు. మరోవైపు వీటిని నిర్మాణ సమయంలో అధికారులు కనీస పర్యవేక్షణ కూడా చేయలేదు. దీంతో రూ. కోట్ల నిధులు వథాగా పోయాయని గ్రామీణ ప్రాంత ప్రజలు విమర్శిస్తున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి నిర్వహణను గాలికి వదిలేసింది. వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నప్పటికీ నేటికీ అనేక గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన యేథేచ్ఛగా సాగుతోంది. ఈ మరుగుదొడ్లను వినియోగంలో తీసుకువస్తే బహిరంగ మలవిసర్జనను అరికట్టవచ్చు. గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు వీలు కలుగుతుంది. ప్రజలు ఆరోగ్యాలను కాపాడే అవకాశం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో పంచాయతీ అధికారులు స్పందించి సామూహిక మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకు రావాల్సి ఉంది.