Oct 03,2023 22:03

గుంకలాంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు

 ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  జిల్లాలో సామూహిక గృహప్రవేశాలకు అధికార యంత్రాంగం సన్నద్ధమౌతోంది. ఈనెల 5న బొబ్బిలి కేంద్రంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కలసి లాంఛనంగా ఇళ్లను ప్రారంభించనున్నారు. అదే రోజు సామర్లకోటలో నిర్మించిన జగనన్న కాలనీని సిఎం జగన్మోహన్‌రెడ్డి కూడా ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వర్చువల్‌ పద్ధతిలో జరిగే సభకు బొబ్బిలిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి వి.శ్రీనివాసరావు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 649 లేవుట్లలో 34,675 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. సొంత స్థలాల్లో 43,452 ఇళ్లను మంజూరు చేశారు. మొత్తంగా 78,127 ఇళ్లకుగాను 3,994 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభానికి నోచుకోలేదు. 36,506 ఇళ్లు పూర్తయ్యాయినట్టు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. పునాదుల తవ్వకాలు, నిర్మాణ దశలో 18,819 ఇళ్లు ఉన్నాయి. 13,509 ఇళ్ల పూనాదులు పూర్తయ్యాయి. ఇంటి పైకప్పువేసే దశలో 3,811 ఇళ్లు, ఇంటిపైకప్పు వేసినవి 1,488 ఉన్నాయి. 71శాతం ఇంటి నిర్మాణాలు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లోనూ, ముఖ్యంగా సొంత స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లే ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వం మంజూరు చేసిన జగనన్న కాలనీల్లో చాలా వరకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోవడం, నిర్మాణాలు వివిధ దశల్లో నిలిచిపోవడం వంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్‌గా ప్రభుత్వం భావిస్తున్న గుంకలాం లేఅవుట్‌లో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఈ లేఅవుట్‌లో సుమారు 11వేల ఇళ్ల స్థలాలకు గాను 10,154 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో లబ్ధిదారులు సొంతంగా నిర్మించుకోవడం, ప్రభుత్వం తరపున ఇసుక, సిమెంట్‌, ఐరెన్‌ వంటి నిర్మాణ సామగ్రిని పంపిణీ చేయడం, పూర్తిగా ప్రభుత్వమే నిర్మించి లబ్ధిదారులకు అప్పగించి ఇవ్వడం వంటి మూడు పద్ధతుల్లో ఇక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ లేఅవుట్‌లో కేవలం 352 ఇళ్లు మాత్రమే పూర్తికావడం గమనార్హం. 114 ఇళ్ల నిర్మాణ పనులు నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. ఇక్కడ మంజూరైన మొత్తం ఇళ్లలో సుమారు 8వేల వరకు ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాల్సివుంది. కానీ, వీటిలో 3వేల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. మిగిలిన ఐదు వేల ఇళ్లు కూడా స్థలాల్లో పునాదులు మాత్రమే పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు పడకపోవడంతో సుమారు ఏడాది క్రితమే సంబంధిత కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేశాడు. తాజాగా నిధుల సమస్య లేదని అధికారులు చెబుతున్నారు. పనులు కూడా ప్రారంభమైనప్పటికీ అంత చురుకుగా సాగడం లేదు. గతంలో ఇక్కడ ఇళ్ల నిర్మాణ పనులకు కాంట్రాక్టర్‌ వద్ద రోజూ సుమారు 500 నుంచి 600మంది పనిచేసేవారు. ప్రస్తుతం 100మందికి మించి కనిపించడం లేదు. దీంతో, పనులు అత్యంత మందకొడిగా సాగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి ప్రభుత్వం తరపున చేపట్టిన ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తిచేయాలని ఆదేశాలు జారీచేసింది. గుంకలాం కాలనీలోని ఇళ్ల నిర్మాణాలకు ఇప్పటి వరకు రూ.44.2కోట్ల మేర గృహ నిర్మాణ బిల్లులు లబ్ధిదారులకు విడుదల చేసినట్టు స్థానిక డిఇ శ్రీనివాసరావు ప్రజాశక్తికి స్పష్టం చేశారు.