ప్రజాశక్తి - గుంటూరు : మంగళగిరిలో 11 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కఠిన శిక్షలు పడేలా చూస్తామని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ అన్నారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. ఈ ఘటనలో వివరాలు, బాధిత కుటుంబానికి అందుతున్న సహాయంపై గిరిజన సంక్షేమ శాఖ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంగళవారం ఆయన సమీక్షించారు. అనంతరం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్)లో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికపై ఈనెల 21వ తేదీన సామూహిక అత్యాచారం జరిగినట్లు తమకు ఫిర్యాదు వచ్చిందని, నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. వారికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చూస్తుందన్నారు. బాధిత బాలికకు చికిత్స అనంతరం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంరక్షణలో వసతి కల్పించి, పాఠశాలలో చేర్పించాలని అధికారులకు సూచించామని చెప్పారు. బాలిక తల్లిదండ్రులకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదని, సత్వరం జారీ చేసి పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా ఇంటి స్థలం, ఇళ్లు నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమం శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. బాధిత బాలికకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా కింద రూ.లక్ష ఆర్థిక సాయాన్ని దశల వారీగా అందిస్తుందని, మొదటి దశలో రూ.25 వేలు ఇచ్చేలా ఐసిడిఎస్ అధికారులకు సూచించామని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి, సంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు మధుసూదనరావు, డీఎస్పీ కెసిహెచ్ రామా రావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, తూర్పు మండల తహశీల్దారు నగేష్, మంగళగిరి సిఐ అంకమ్మరావు, కొత్తపేట సిఐ ఎస్‌కె.అన్వర్‌బాషా, దిశ లాయర్ విజయలక్ష్మీ, గిరిజన నాయకులు పాల్గొన్నారు.










