Jul 31,2023 18:32

ప్రజాశక్తి - చింతలపూడి
          పేదవారికి ఉపయోగకరంగా రూ.కోట్లు ఖర్చు చేసి మృతదేహాలను తరలించేందుకు తీసుకువచ్చిన మహాప్రస్థానం అంబులెన్సులు చింతలపూడిలో నిరుపయోగంగా ఉన్నాయి. ఉచితంగా సేవలు అందించే మహాప్రస్థానంను సామాన్య ప్రజలు ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో అంబులెన్స్‌ సేవలను ఉపయోగించుకోకుండా ప్రెయివేట్‌ అంబులెన్సులను ఆశ్రయిస్తున్నారు.
మహాప్రస్థానం అంబులెన్సులో చింతలపూడి హాస్పిటల్‌ నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే ముడుపులు లేనిదే వెళ్లలేని పరిస్థితని ఆరోపణలున్నాయి. మహాప్రస్థానం డ్రయివర్‌కి రూ.500, డీజిల్‌కి రూ.1,000 ఇవ్వకపోతే తీసుకెళ్లమని ఖరాకండిగా చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు. పేద ప్రజలకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం కోట్లు ఖర్చుపెట్టి మహాప్రస్థానం అందుబాటులోకి తీసుకువస్తే అది అమలు కావడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేదలు రూ.15,00 ఖర్చు పెడితే గాని అంబులెన్సు సేవలు ఉపయోగించుకోలేక పోతున్నారు. ఉచితంగా సేవలు అందించాల్సిన అంబులెన్సులను అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ సామాన్యుకి అందని రీతిలో చేస్తున్నారు. ప్రెయివేటు అంబులెన్సులో మృతదేహం తరలించాలంటే రూ.15,00 ఖర్చు అవుతుంది. దానితో సమానంగా ప్రభుత్వ మహాప్రస్థానం అంబులెన్సులు కూడా అదే రీతిలో వసూలు చేయడంలో సామాన్యుని పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. డబ్బులు వసూలు చేస్తున్నారని గతంలో ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా, అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో మరలా అటువంటి పరిస్థితిలు పునరావృతం అవుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.