ముచ్చటగా మూడక్షరాల పదం... సంతోషం. ఇది మనసులో కలిగే ఒక భావన. ఇది జీవితంలో కలిగిన సంతృప్తికి చిహ్నం. మనం కోరుకున్న విధంగా జరిగితే సంతోషం కలుగుతుంది. ఒకరికి పువ్వులను చూస్తే సంతోషం. ఇంకొకరికి పుస్తకాలను చదివితే సంతోషం. కొంతమందికి 'సంతోషం' అంటే డబ్బు సంపాదించడం, అందినంత దోచుకోవడం, ఆస్తులు కూడబెట్టుకోవడం. మరికొందరికి ఎదుటివారికి సహాయం చేస్తే సంతోషం. తోటివారికి సాధ్యమైనమేరకు సేవ చేస్తూ... వారి పెదవులపై చిరునవ్వులను చూడాలనుకుంటారు. అది వారికి సంతోషం. కొందరికి... మాటలతో చేతలతో ఎదుటివారిని బాధపెట్టడంలోనే సంతోషం వుంటుంది. మరికొందరు తమ మాటల గారడితో మభ్యపెడుతూ... నక్కజిత్తులతో మోసం చేస్తూ... తోటివారు పడే ఇబ్బందులను, కష్టాలను చూసి పైశాచిక ఆనందం పొందుతుంటారు. అది వారి సంతోషం. మన సంతోషాన్ని ఎదుటివారితో పంచుకోవచ్చు. కానీ ఎదుటివారి సంతోషాన్ని, ఆనందాన్ని బలవంతంగా లాక్కోవడం... అదికూడా వేరొకరికి మేలు చేయడం కోసం... సంతోష పెట్టడం కోసం కట్టు బానిసగా వ్యవహరించడం మాత్రం అరుదైన విషయం.
2020 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో జిడిపి 0.4 శాతం పెరిగిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అలవోకగా అబద్ధాలు చెప్పడం కూడా ఒక కళ. మరి ఆర్థిక వృద్ధి బాగుంటే... దేశంలో సామాన్య ప్రజలు ఎందుకు సంతోషంగా లేరు? మూడు నెలలుగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు పోరాటం ఎందుకు చేస్తున్నారు? 246 మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? కూలీలు రాష్ట్రాలు దాటి ఎందుకు వలసపోతున్నారు? ప్రభుత్వరంగ సంస్థ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఎవరి ప్రయోజనం కోసం ప్రైవేటీకరించాలనుకుంటున్నారు? ప్లాంట్ నిర్మాణానికి భూములిచ్చిన రైతులు, ఇంకా ఉద్యోగాలు రాని నిర్వాసితులు ఎందుకు పోరాటాలకు దిగుతున్నారు? వృద్ధి రేటు అమాంతంగా పెరిగిపోతుంటే... గతేడాది మన దేశ సంతోష సూచి... 156 దేశాలతో పోల్చి చూస్తే... 144వ స్థానంలోనే ఎందుకు వుంది? నిజంగానే జిడిపి పెరిగితే... దేశంలో సామాన్య ప్రజలు ఎందుకు సంతోషంగా లేరు? వంటి అనేక ప్రశ్నలకు సమాధానం దొరకదు. వాస్తవానికి బడాపెట్టుబడిదారులు గతేడాది కంటే ఈ ఏడాది భారీగా లాభాలు పొందారు. 'దేశభక్తి గుత్తకు తీసుకున్నవారు... బ్లాకున తప్ప అమ్మరు' అని ఓ కవి చెప్పినట్టుగా... లాక్‌డౌన్ సమయంలోనూ ఏకంగా రూ.1.6 లక్షల కోట్ల లాభాలను ఆర్జించారు. అనేక మంది ఉద్యోగులు నిరుద్యోగులై రోడ్డున పడ్డారు. కరోనాకు ముందు 4.5 కోట్ల మంది నిరుద్యోగులుంటే... కరోనా వచ్చాక, ఆ సంఖ్య 7.41 కోట్లకు పెరిగింది. కోట్లాది మంది ప్రజలు ఆకలితో మాడుతున్నా... పట్టించుకోని ప్రభుత్వం... కార్పొరేట్లకు మాత్రం రాయితీల మీద రాయితీలిస్తూ వారి వృద్ధిని, సంతోష సూచిని అమాంతం పెంచేస్తోంది. చివరకు న్యాయ వ్యవస్థ సహా అనేక సంస్థలు బలహీనపడ్డాయి. 'ఏది లేకపోతే ప్రజలు ఉండనే ఉండలేరో... ఆ సరుకుతో వ్యాపారం చెయ్యాలి' అంటాడు రావిశాస్త్రి తన 'సబ్బుబిళ్ల' కథలో. అలాంటి వ్యాపారం కోసమే వ్యవసాయ వ్యతిరేక చట్టాలను తెచ్చారు. పంట భూములను వ్యవసాయ క్షేత్రాలుగా మార్చి... వ్యాపార పంటలను పండించడానికి రైతులను దగా చేస్తున్నారు. రైతులు, శ్రామికులు దేశవ్యాప్తంగా ఆందోళనకు గురవుతున్నారు. నిరసనలకు దిగుతున్నారు. దీన్ని సంతోష వృద్ధి అనగలమా?
'దొంగిలించేంత దొరతనం ఉండగా... అడిగేటంత అన్యాయానికి లోబడతానా..?' అని ఓ రచయిత అంటాడు. నోట్ల రద్దు దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వరకూ ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా కార్పొరేట్లకు దోచిపెట్టడమే పాలకులు తమ పనిగా పెట్టుకున్నారు. 'బలవంతులు దుర్భల జాతిని/ బానిసలను కావించారు / నరహంతలు ధరాధిపతులై/ చరిత్రమున ప్రసిద్ధి కెక్కిరి' అంటాడు మహాకవి శ్రీశ్రీ. నల్లధనం పునాదులపై సామ్రాజ్యవాదుల కోటలను కడుతూ... ధనవంతుల జాబితాను ఏడాదికేడాది పెంచేస్తున్నారు. కొద్ది మంది లాభాలతో వెలిగిపోతుంటే... సామాన్యుడి సంతోష సూచి వృద్ధి చెందుతోందని బుకాయింపులకు దిగుతున్నారు. ఇకనైనా సామాజిక, ఆర్థిక అభివృద్ధిని సాధించడంలో ప్రజా శ్రేయస్సుకు, సామాన్య ప్రజల సంతోషానికి ప్రాధాన్యతనివ్వాలి. వారి జీవన ప్రమాణాన్ని పెంచాలి. అలా చేయకుంటే... దేశవ్యాప్తంగా వినిపిస్తోన్న నిరసన గళాలన్నీ ఉప్పెనై లేస్తే... పాలకుల కోటలు పేక మేడల్లా కూలిపోతాయని గ్రహించాలి.










