Sep 12,2021 06:31

     విలువైన ఆస్తులను మానిటైజ్‌ చేస్తే దాని పర్యవసానాలు ఏవిధంగా వుండబోతున్నాయో సామాన్య ప్రజానీకానికి తెలియజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. వీటిని ప్రైవేటు రంగానికి అప్పజెప్తే వాళ్ళు వీటిని తమ లాభాల కోసం నడుపుతారే తప్ప ప్రజల ప్రయోజనాల కోసం కాదు. అంటే వీటి చార్జీలు గణనీయంగా పెరుగుతాయి. ఈ ఆస్తులను నిర్మించడం కోసం గతంలో ప్రజలు పన్నుల రూపంలో అదనపు భారం మోశారు. ఇకముందు ప్రైవేటు వ్యక్తుల లాభాల కోసం మరోసారి అదనపు భారాన్ని మోయవలసి వస్తుంది.
     మానిటైజేషన్‌ అనే పదాన్ని వాడడం ప్రభుత్వానికి ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో ఎయిర్‌ ఇండియా, తదితర ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులను ఉపసంహరించే ప్రతిపాదనలను చేసినప్పుడు కూడా ఈ పదాన్ని ఉపయోగించారు. అందుచేత ఆస్తుల మానిటైజేషన్‌ అంటే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించడానికి పెట్టిన మరో పేరు మాత్రమే.
     ''పని చేస్తున్న'' (పెర్‌ఫార్మింగ్‌) ఆస్తులను బదలాయించడం ద్వారా ''నిరర్ధకంగా'' (ఐడిల్‌) వున్న పెట్టుబడిని విడుదల చేసి ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించి ''అదనపు ప్రయోజనాలను పొందుతాం'' - ఇది నీతి ఆయోగ్‌ నివేదిక మానిటైజేషన్‌ గురించి ఇచ్చిన వివరణ.
 

ఇక్కడ మొదటి సందేహం : పని చేస్తున్న ఆస్తులైతే నిరర్ధకంగా ఎలా ఉంటాయి? ఒకవేళ నిరర్ధకంగా ఉంటే పని చేస్తున్నట్టు ఎలా ఔతుంది? ఈ రెండింట్లో ఏదో ఒకటే సాధ్యం.
రెండు పరస్పర విరుద్ధమైన పదాలను- ''పని చేస్తున్న'', ''నిరర్ధక'' ఒకే వాక్యంలో కలిపి చెప్పడం తప్పుదోవ పట్టించడం కాదా?

రెండో సందేహం : ఈ ''అదనపు ప్రయోజనాలు'' సామాన్య ప్రజలకు అందుతాయని ఆశించగలమా?

మూడవది : ఇలా టాక్స్‌ పేయర్ల సొమ్ముతో సమకూరిన ఆస్తులను ప్రైవేటువారికి అప్పజెప్పే బదులు ఇతర మార్గాల ద్వారా వనరులను సమీకరించడం సాధ్యం కాదా ?
మానిటైజేషన్‌ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ''పని చేస్తున్న'' ఆస్తులలో 26,700 కి.మీ. జాతీయ రహదారులు, 400 రైల్వే స్టేషన్లు, 90 పాసింజర్‌ రైళ్ళు, డార్జిలింగ్‌ హిమాలయన్‌ రైల్వే తో సహా నాలుగు పర్వత ప్రాంత రైల్వేలు ఉన్నాయి. ఇవిగాక ప్రభుత్వ రంగంలోని టెలికాం, విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌, పెట్రోలియం, పెట్రో ఉత్పత్తులు, సహజవాయువు పైప్‌ లైన్లు ఉన్నాయి. ఇటువంటి అత్యంత విలువైన జాతి సంపదను ఆ జాబితాలో చేర్చకుంటే ప్రైవేటు కార్పొరేట్లు మానిటైజేషన్‌ వైపు కన్నెత్తి కూడా చూడరు.
 

                                                    ఇవన్నీ ''నిరర్ధక ఆస్తులు'' కానే కావు.

     ఇటువంటి విలువైన ఆస్తులను మానిటైజ్‌ చేస్తే దాని పర్యవసానాలు ఏవిధంగా వుండబోతున్నాయో సామాన్య ప్రజానీకానికి తెలియజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా చెల్లిస్తున్న పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఈ ఆస్తులను ప్రభుత్వం సమకూర్చింది. వీటి నిర్వహణలో ప్రజల ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇక ఇంతవరకూ వీటిని ప్రభుత్వం నిర్వహించింది గనుక ప్రజల ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని వీటిని నిర్వహించింది. అందుకే వీటి ద్వారా వసూలు చేసే చార్జీలు ప్రజలకు అందుబాటులో వుండేటట్లున్నాయి. ఇక ముందు వీటిని ప్రైవేటు రంగానికి అప్పజెప్తే వాళ్ళు వీటిని తమ లాభాల కోసం నడుపుతారే తప్ప ప్రజల ప్రయోజనాల కోసం కాదు. అంటే వీటి చార్జీలు గణనీయంగా పెరుగుతాయి. ఈ ఆస్తులను నిర్మించడం కోసం గతంలో ప్రజలు పన్నుల రూపంలో అదనపు భారం మోశారు. ఇకముందు ప్రైవేటు వ్యక్తుల లాభాల కోసం మరోసారి అదనపు భారాన్ని మోయవలసి వస్తుంది. ఒకసారి ప్రైవేటు పరం అయ్యాక వీటి ధరలను నియంత్రించే అధికారాన్ని ప్రభుత్వం కోల్పోతుంది. అలా కాకుండా వీటి ధరలను ప్రభుత్వం అప్పుడు కూడా నియంత్రించాలనుకుంటే ఆ మేరకు ప్రభుత్వమే ఆ కంపెనీలకు సబ్సిడీ రూపంలో ముట్టజెప్పవలసి వుంటుంది.
 

                                                           ఢిల్లీ అనుభవం ఏమిటి ?

    దేశ రాజధాని ఢిల్లీ లో విద్యుత్‌ పంపిణీని గతంలో కాంగ్రెస్‌ హయాంలో ప్రైవేటీకరించారు. ఆ తర్వాత పెరిగిన విద్యుత్‌ చార్జీలు పేదలే కాకుండా మధ్య తరగతి సైతం మోయలేనంతగా గుదిబండగా మారాయి. అప్పుడు ప్రజలకు చౌకగా విద్యుత్‌ అందిస్తామని హామీ ఇచ్చి ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారం లోకి వచ్చింది. విద్యుత్‌ చార్జీలను తగ్గించింది. ఆ తగ్గించిన మేరకు ప్రైవేటు విద్యుత పంపిణీ సంస్థలకు సబ్సిడీ ఇస్తోంది. ఆ సబ్సిడీని ప్రజల నుండి వసూలు చేసిన పన్నుల ద్వారా చెల్లిస్తోంది. ఢిల్లీ ప్రజలు పెరిగిన విద్యుత్‌ చార్జీల రూపంలోనో, కాకుంటే అదనపు పన్నుల రూపంలోనో భారాం అదనంగా మోయక తప్పడం లేదు. ప్రైవేటు కంపెనీలు మాత్రం దర్జాగా లాభాలు పోగేసుకుంటున్నాయి.
 

                                               ఆదాయం సమకూర్చుకునే మార్గాలు వేరే లేవా ?

     మన దేశ జిడిపి కి, వసూలు చేసే పన్నులకు మధ్య నిష్పత్తి 2019-20 లో 17.4 శాతంగా ఉంది. ఇది ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే చాలా తక్కువ. అందుచేత అదనంగా సంపన్నుల మీద పన్ను పెంచవచ్చు.
      అంతే కాదు, ఈ ప్రైవేటు కంపెనీలు ఎగవేస్తున్న పన్నుల మాటేమిటి ? కంపెనీలకు వస్తున్న లాభాలను, అవి చెల్లిస్తున్న పన్నులను ప్రభుత్వం ప్రచురిస్తున్న గణాంకాల ద్వారా తెలుసుకోవచ్చు. 2005-2006 లో 40 శాతం ప్రైవేటు కంపెనీలు తమకు ఎటువంటి లాభాలూ రాలేదని ప్రకటించాయి. అదే 2018-19 నాటికి ఏకంగా 51 శాతం కంపెనీలు తమకు ఏ లాభాలూ రావడం లేదని ప్రకటించాయి. ఒక కోటి రూ., లేదా అంతకన్నా తక్కువ లాభాలు వచ్చే కంపెనీల శాతం 2005-2006లో 55గా ఉంది. అది కాస్తా 2018-19 నాటికి 43 శాతానికి పడిపోయింది. అంటే దేశంలోని బడా ప్రైవేటు కంపెనీలు చట్టాలలోని లొసుగులను ఉపయోగించుకుని తక్కువ లాభాలను చూపిస్తూ పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటున్నాయి. ప్రభుత్వం పక్కాగా చట్టాలను రూపొందించి పన్నులను వసూలు చేస్తే అదనపు ఆదాయం సమకూరుతుంది. ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు ?
     అంతే కాదు, ప్రభుత్వ రంగ సంస్థల అసమర్ధత గురించి నీతి ఆయోగ్‌ పదే పదే మాట్లాడుతూ వుంటుంది. కాని వాస్తవం వేరు. బడా ప్రైవేటు కంపెనీల్లో నష్టాల్లో నడుస్తున్నవి 51 శాతం. అదే ప్రభుత్వ రంగ సంస్థల్లో నష్టాల్లో నడుస్తున్నవి 28 శాతం. ఎవరి సామర్ధ్యం ఎక్కువ? ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తే పెరిగేవి లాభాలా? లేక నష్టాలా? ఈ మాత్రం ఆలోచించలేకపోతోందా ఈ ప్రభుత్వం?

( వ్యాసకర్త - జెఎన్‌ యు
'సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ స్టడీస్‌' లో ప్రొఫెసర్‌)
/ 'ది హిందూ' సౌజన్యంతో /
ప్రొ|| బిశ్వజిత్‌ ధర్‌

ప్రొ|| బిశ్వజిత్‌ ధర్‌