రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ కంపెనీ(డిస్కాము)లు సమర్పించిన వార్షిక ఆదాయ అవసర నివేదిక (ఎఆర్‌ఆర్)లు, 2021-22 సంవత్సరానికి విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై జనవరి 18 నుండి 20 వరకు ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ (ఎపిఇఆర్‌సి) పబ్లిక్ హియరింగ్ నిర్వహించనుంది. మూడు డిస్కాములకు 2021-22 సంవత్సరానికి రూ.44,030 కోట్లు అవసరమనీ, చార్జీలు, ఇతర వనరుల ద్వారా రూ.32,119 కోట్లు సమకూరుతుందనీ, ఆదాయ లోటు రూ.11,911 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. అదనంగా రూ.1,285 కోట్లు చార్జీల పెంపు ప్రతిపాదించారు. ఇది కాక 2014-15 నుండి 2018-19వరకు గత ప్రభుత్వ కాలం నాటి ట్రుఅప్ చార్జీలు రూ.3,013 కోట్ల భారపు కత్తి వినియోగదార్ల నెత్తి మీద వేలాడుతోంది. అంటే మొత్తం కనీస భారం రూ.4,298 కోట్లన్నమాట. రాష్ట్రంలోని సుమారు 1 కోటి 85 లక్షల మంది వినియోగదార్లు సగటున ఏడాదికి రూ. 2,300 అదనంగా చెల్లించాలన్నమాట. ప్రతి నెలా దాదాపు రూ.200 కరెంటు బిల్లుపై అదనపు వడ్డన. ఇందులో కొందరికి ఎక్కువ, ఇంకొందరికి తక్కువా ఉండొచ్చు. నేరుగా వేస్తున్న భారాలు కొన్ని కాగా దొంగ దెబ్బ తీస్తున్నవి ఇంకొన్ని! గత ప్రభుత్వం కావాలనే రిటర్నుల సమర్పణ, ట్రుఅప్ చార్జీల ప్రతిపాదనలను జాప్యం చేసింది. పాలనా పరమైన జాప్యం కారణం కనుక రాష్ట్ర ప్రభుత్వం ('గవర్నమెంట్ ఈజ్ కంటిన్యువస్' అన్న సూత్రం మేరకు) ఆ మొత్తాన్ని భరించడం సబబు. అంతే తప్ప విద్యుత్ వినియోగదార్లపై వేయరాదు.
గృహ వినియోగదార్లందరిపై బాదుడే
రాష్ట్రంలో ఇంతకు ముందెన్నడూ లేనిది, కొత్తగా గృహ వినియోగదార్లకు ఫిక్స్‌డ్ చార్జీలను డిస్కాములు ప్రతిపాదించాయి. సాధారణంగా ఫిక్స్‌డ్ / డిమాండ్ చార్జీలు గృహేతర మరియు హెచ్‌టి వినియోగదార్ల నుండి మాత్రమే వసూలు చేస్తారు. పేద, మధ్యతరగతి గృహ వినియోగదార్ల నుండి కూడా వసూలు చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల ప్రతి గృహ వినియోగదారుపై ఏడాదికి కనీసం రూ. 120 అదనపు భారం పడుతుంది. ఒక్క బల్బు వాడే వారైనా నెలకు అదనంగా పది రూపాయలు కట్టాలి. ఇక, ఫ్రిజ్, వెట్ గ్రైండర్ తదితర గృహోపకరణాలుంటే వారిపై ఫిక్స్‌డ్ ఛార్జీల భారం ఇంకా ఎక్కువగా పడుతుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు జీవనం మరింత కష్టతరమవుతుంది. అంతేగాక కనెక్టెడ్ లోడ్ ఎక్కువగా ఉందన్న సాకుతో వినియోగదారులపై వేధింపులు పెరిగేందుకూ అవకాశం ఉంది. విద్యుత్ అధికారులు 2019లో ఇళ్లలో చొరబడి 'మీ ఇంట్లో ఫ్రిజ్ వుంది. ఎ.సి వుంది. అదనపు కనెక్టెడ్ లోడ్‌కు ఫీజు, డిపాజిట్ కట్టాల'ని అధికార్లు వేధింపులకు పాల్పడడం, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన తరువాత వెనక్కు తగ్గిన విషయం చాలామందికి గుర్తుండే ఉంటుంది.
ఒకసారి ఫిక్స్‌డ్ చార్జీలను అనుమతిస్తే అది తదనంతర కాలంలో పెరుగుతూ పోయే ప్రమాదం కూడా ఉంది. సర్వీసు చార్జీల పేరిట కేంద్ర ప్రభుత్వం 1994లో ప్రారంభించినపుడు టెలిఫోన్ బిల్లు, జీవిత బీమా మినహా ఇతరబీమా ప్రీమియం, స్టాక్ మార్కెట్ బ్రోకరేజి- ఈ మూడిటిపైనే నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్ ప్రతిపాదించారు. ఆ ఏడాది దేశమంతటా కలిపి సేవా పన్నును 3,943 మంది నుండి కేవలం రూ. 407 కోట్లు మాత్రమే సమకూరింది. ఆనాటి పన్ను ఆదాయంలో అది ఒక్క శాతం కూడా లేదు. ఆ పన్ను సకల సేవలకూ విస్తరించడమేగాక 5 శాతంతో ప్రారంభమైన పన్ను రేటు 15 శాతానికి ఎగబాకింది. 2016-17లో రూ. 2,54,498 కోట్లు వసూలయింది. ఆనాటి పన్నుల ద్వారా కేంద్ర ఖజానాకు సమకూరిన దాంట్లో అది ఏడో వంతుగా వుండడం గమనార్హం. ఇప్పుడు జిఎస్‌టి రూపంలో 18 శాతం వరకు వసూలు చేస్తున్నారు. కాబట్టి ఏలినవారు ఓ కొత్త భారాన్ని ప్రవేశపెడితే అది అలా అలా ఆంజనేయడి తోకలా పెరుగుతూ జనం నడ్డి విరుస్తుంది. నయా ఉదారవాద ఆర్థిక విధానాల్లో భారాలు వేయడానికి ఇలాంటి కొత్త కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. ఇప్పటి వరకు పట్టణాలు, నగరాల్లో ఆస్తి పన్ను నిర్ణయానికి అద్దె ప్రాతిపదికగా ఉండగా ఇప్పుడు దాన్ని ఆస్తి విలువ ప్రాతిపదికగా చేస్తున్నారు. చూడడానికి ఇది చిన్న మార్పులా అనిపించినా జనంపై పెనుభారం పడుతుంది.
రాష్ట్రంలోని సుమారు కోటిన్నర మంది గృహ వినియోగదారులు అందరిపైనా ఫిక్స్‌డ్ ఛార్జీల కొత్త భారం పడబోతుంది. టిడిపి ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఇదే మాదిరి వినియోగదారులందరిపై విద్యుత్ చార్జీలు పెంచడం మూలంగా వచ్చిన మహోద్యమాన్ని, ముగ్గురు యువ కిశోరాల బలిదానాన్ని అందరూ గుర్తు చేసుకోవడం అవసరం. ఆ ఉద్యమ పర్యవసానంగానే ఆ పార్టీ దాదాపు రెండు దశాబ్దాలపాటు అధికారానికి దూరమైన విషయం మరువరాదు.
మధ్యతరగతిపై కొత్త భారాలు
అపార్ట్‌మెంట్లు, గ్రూప్ హౌసింగ్ మరియు హౌసింగ్ సొసైటీల ఇళ్లనూ గేటెడ్ కమ్యూనిటీ/ విల్లాల మాదిరిగా పరిగణించి హెచ్‌టి-1 గృహ వినియోగదారుల కేటగిరీ ఛార్జీలు వసూలు చేస్తామని డిస్కాములు ప్రతిపాదించాయి. అంటే మామూలు ఇళ్లలో వుండేవారికన్నా అపార్ట్‌మెంట్లలో వుండేవారు నాలుగైదు రెట్లు అదనంగా విద్యుత్ చార్జీలు చెల్లించాలి. మధ్యతరగతి వారికి ఇది మోయలేని భారం అవుతుంది. కొన్ని అపార్ట్‌మెంట్లు పది పన్నెండు ఇళ్లతోనూ, గ్రూప్ హౌసెస్ అయితే ఇంకా తక్కువగా కూడా ఉంటాయి. ఇళ్లన్నీ 750 నుండి వెయ్యి అడుగులలోపే ఉండే అపార్ట్‌మెంట్లు చాలా ఉంటాయి. ఇలాంటి ఇళ్లను విల్లాలతో సమానంగా పరిగణించడం ఎంత మాత్రమూ తగదు. పెద్ద పట్టణాల్లో కాదు సరి కదా చిన్న మండల కేంద్రంలో కూడా స్థలం కొనుక్కోలేని స్థితిలో మధ్యతరగతి ప్రజలు అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు కొంటున్నారు. అదీ బ్యాంకు అప్పులతోనే. ఇలాంటివారి నుండి విలాసవంతమైన విల్లాల్లో వుండే వారితో సమానంగా విద్యుత్ చార్జీలు వసూలు చేస్తామంటే ఎలా? అంతేగాక ఐదు, పది సెంట్ల స్థలాలలను డెవలప్‌మెంటుకు తీసుకొని అపార్ట్‌మెంట్లు నిర్మించే అతి చిన్న బిల్డర్లకు సైతం ఈ ప్రతిపాదన నష్టదాయకం. తద్వారా పట్టణాల్లోని చిన్నచిన్న స్థలాల యజమానులూ నష్టపోతారు.
ఇదిలా వుండగా విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ వాసులకు ప్రస్తుతం యూనిట్‌కు రూ.7.00గా వున్న చార్జీని రూ.5.95కి తగ్గిస్తామన్నారు. ఆ తగ్గింపు ఎందుకో ఎక్కడా వివరించలేదు. మధ్యతరగతి వారిపై కొత్త భారాలు మోపి, సంపన్నులు ఇప్పటికే చెల్లిస్తున్న చార్జీలను కూడా తగ్గించడం ద్వారా ఈ ప్రభుత్వం ఎవరి తరఫున పని చేస్తుందో బోధపడుతోంది. మధ్యతరగతి వారికి పెనుభారమేగాక చిన్న బిల్డర్లకు, స్థల యజమానులకూ నష్టకరమైన ఈ ప్రతిపాదనను విరమించుకోవడం మంచిది.
సహకార విద్యుత్ సంస్థలు దివాలా!
అనకాపల్లి, చీపురుపల్లి, కుప్పం కేంద్రాలుగా వున్న గ్రామీణ విద్యుత్ సహకార సొసైటీ (ఆర్‌ఇసిఎస్)ల నుండి యూనిట్‌కు రూ.7.15 చొప్పున వసూలు చేస్తామని డిస్కాములు ప్రతిపాదించాయి. వాటిపై అమాంతంగా రూ.620 కోట్ల అదనపు భారాన్ని వేయనున్నారు. ప్రధానంగా వ్యవసాయ పంప్‌సెట్లకు, గృహ వినియోగానికీ (కుప్పం 326/370 మియూ, అనకాపల్లి 190/242 మియూ., చీపురుపల్లి 80/91 మియూ) విద్యుత్ సరఫరా చేస్తున్న ఆర్‌ఇసిఎస్ లకు ఇది మోయలేని భారమై అవి మూత పడతాయి. వ్యవసాయ ప్రధానమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి వ్యవసాయ వ్యతిరేక ప్రతిపాదనలు హానికరం. అంతేగాక ఈ మూడు ఆర్‌ఇసిఎస్‌లు వెనుకబడిన ప్రాంతాల్లోనే పని చేస్తున్నాయి. ప్రధానంగా చెరకు (బెల్లం గానుగలు), మామిడి, కూరగాయలు ఇతర ఉద్యానవన పంటలపై ఆధారపడి జీవిస్తున్న రైతాంగానికి, ఆ ప్రాంతాల్లోని చిన్న ప్రాసెసింగ్ పరిశ్రమలకూ డిస్కాముల ప్రతిపాదనవల్ల తీవ్ర నష్టం కలుగుతుంది.
గత ఏడాది కూడా డిస్కాములు ఆర్‌ఇసిఎస్‌లకు రూ.3.50 చొప్పున వసూలు చేస్తామని ప్రతిపాదించగా సహేతుకమైన (జస్టిఫయబుల్) కారణాలు లేవని ఇఆర్‌సి తిరస్కరించింది. అయినా, ఈ ఏడాది అంతకు రెట్టింపు ఛార్జీని ఆర్‌ఇసిఎస్‌ల నుండి వసూలు చేస్తామని డిస్కాములు ప్రతిపాదించడం విడ్డూరంగా వుంది. ప్రభుత్వం నుండి సబ్సిడీని నేరుగా రెస్కోలే పొందవచ్చునని డిస్కాములు పేర్కొన్నది విధానపరమైన విషయం. కనుక రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం ముఖ్యం. కాబట్టి ఇలాంటి విధానపరమైన మార్పు చేయడానికి ముందుగా సంబంధిత సంస్థలు, వ్యక్తుల (స్టేకహేోల్డర్స్)తో గౌరవ కమిషన్ వారు విడిగా పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలి. అలాంటిదేమీ లేకుండా డిస్కాములు ఏకపక్షంగా ప్రతిపాదనలు చేయడం వెనుక ఇంకేవైనా కారణాలున్నాయేమో పరిశీలించాలి. వెనుకబడిన ప్రాంతాల రైతుల ప్రయోజనాలకు, ఆర్‌ఇసిఎస్‌ల మనుగడకు ముప్పు కలిగించే డిస్కాముల ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి.
వ్యవసాయ ఉచిత విద్యుత్‌కూ తిరకాసు
వ్యవసాయ పంప్‌సెట్లకు రోజుకు 9 గంటలు (ఉచిత) విద్యుత్ సరఫరా కొనసాగిస్తామని డిస్కాములు పేర్కొన్నాయి. ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా రోజుకు 11 గంటల పాటు సరఫరా చేయాలి. పొరుగు రాష్ట్రంలో రోజంతా ఉచితంగా ఇస్తున్న విషయం గమనార్హం. అలాగే పంప్‌సెట్లకు మీటర్లు బిగించే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి. అంతేగాక డిస్కాముల ఎఆర్‌ఆర్‌లలో కొన్ని అసంగతాలు (అనామలీస్) ఉన్నాయి. వ్యవసాయ పంప్‌సెట్లకు నగదు బదిలీ ద్వారా డిస్కాములకు రాష్ట్ర ప్రభుత్వమే బిల్లులు చెల్లిస్తుందని జిఓ 22 జారీ చేసింది. కాని, సిపిడిసిఎల్ వారి ఎఆర్‌ఆర్‌లో వ్యవసాయ పంప్‌సెట్లు (ఎల్‌టి-5) ద్వారా ఫుల్ ఇయర్ రెవెన్యూ ఎక్స్‌క్లూడింగ్ సబ్సిడీ కింద కస్టమర్ ఛార్జెస్ మొత్తాన్ని (రూ.15.15 కోట్లు) పేర్కొన్నారు. మరి నగదు బదిలీ మాటేమిటి? ఎనర్జీ ఛార్జెస్ మాత్రమే ప్రభుత్వం భరించి, కస్టమర్ ఛార్జెస్‌ను రైతు నుండి వసూలు చేస్తారా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
గృహ వినియోగదార్లపై అదనంగా ఫిక్స్‌డ్ ఛార్జీలు వేయనున్నారు. వినియోగదార్ల సంఖ్య కూడా పెద్దఎత్తున పెరుగుతుందని పేర్కొన్నారు. కాని ఆదాయంలో మాత్రం ఆ విధమైన పెరుగుదల చూపలేదు. ఇందులో డిస్కాముల మధ్య తీవ్ర తేడాలుండడం గమనార్హం. కనిష్ట చార్జీలు నిబంధన ఎత్తివేసి, ఫిక్స్‌డ్ చార్జీలు వసూలు చేయడం ద్వారా ఇపిడిసిఎల్‌కు రూ.24.34 కోట్లు అదనంగా సమకూరుతాయని పేర్కొంది. కాని గృహ వినియోగదార్లు అధికంగాగల సిపిడిసిఎల్, ఎస్‌పిడిసిఎల్ మాత్రం కనిష్ట చార్జీల రద్దు మూలంగా తగ్గే ఆదాయం ఫిక్స్‌డ్ చార్జీల విధింపుతో భర్తీ అవుతాయని అంటున్నాయి. అసలు ఒకే ప్రభుత్వం కింద పని చేసే డిస్కాముల మధ్య మరీ ఇంత వ్యత్యాసమా? లేక బాధ్యతా రాహిత్యమా? ఏమైనా గాని వినియోగదార్లకు మాత్రం వడ్డనే!
* బి. తులసీదాస్










