
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : పేదల ప్రయాణానికి కీలకమైన, ఎంతో ఉపయోగపడే రైల్వే వ్యవస్థ క్రమంగా సామాన్యులకు దూరమవుతోంది. నరసరావుపేట మార్గంలో ప్రస్తుతం పగటి వేళ ఒక్కరైలే నడుస్తోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి 10.30 గంటలకు మచిలీపట్నం-ధర్మవరం ఎక్స్‌ప్రెస్ వెళ్లిన తరువాత మళ్లీ ఈ మార్గంలో తిరిగి మరుసటి రోజు సాయంత్రం 4.30 గంటల వరకు రైళ్లు లేవు. సాయంత్రం 4.30 గంటలకు గుంటూరు-తిరుపతి రైలువచ్చే వరకు మినహా మరొకటి లేదు. గత నెలవరకు ఈ మార్గంలో పగటి సమయంలో ఆరు రైళ్లు నడిచేవి. తొలుత వారంపాటు రద్దు చేశామని చెబుతూ తరువాత క్రమంగా పొడిగిస్తున్నారు.
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహణపనుల పేరుతో 14 రైళ్లను వారం పాటు రద్దుచేశారు. కొన్నింటిని ఈనెల 2 నుంచి 8వ తేదీ వరకు, మరికొన్నింటిని 3 నుంచి 9వ తేదీ వరకు నిలపేశారు. ఇందులో కాచిగూడ-గుంటూరు, గుంటూరు-విజయవాడ, కాచిగూడ-నడికుడి, గుంటూరు-డోన్, విజయవాడ-హుబ్లీ, రేపల్లె మార్కాపురం రోడ్డు, గుంటూరు-మార్కాపురం రోడ్డు, తెనాలి-మార్కపురం రోడ్డు మధ్య రైళ్లను సోమవారం నుంచి ఈనెల 8వ వరకు రద్దు చేశారు. దీంతో గుంటూరు నుంచి నర్సరావుపేట, వినుకొండ-మార్కపురం వరకు మధ్యలోని అనేక గ్రామాలకు వెళ్లే ప్రయాణికులంతా ఆర్‌టిసి బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయించక తప్పడంలేదు.
పెరుగుతున్న ఎసి బోగిలు...
సూపర్‌ఫాస్టు ఎక్స్‌ప్రెస్‌లో సాధారణ బోగిలు తగ్గించి ఏసీ బోగిలు పెంచుతున్నారు. ఏసీల పేరుతో భారీ వసూలు చేయడం పరిపాటైంది. స్లీపర్, సాధారణ బోగిలు సంఖ్య తగ్గించి ఎసి బోగిలు పెంచుతున్నారు. దీంతో 60 శాతం అధిక ఛార్జీలతో ఏసీ బోగీలను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రధానంగా సికింద్రాబాద్-భువనేశ్వర్, హౌరా మధ్య నడిచే విశాఖ, ఫలక్‌నూమా, భువనేశ్వర్-బెంగుళూరు, సికింద్రాబాద్-తిరుపతి నారాయణాద్రి సూపర్‌ఫాస్టులో ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ బోగిలు రెండు తగ్గింగి ఏసీ బోగిలు పెంచడం వల్ల మధ్యతరగతి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందేభారత్ పేరుతో నడుపుతున్న సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్‌లలో ఛార్జీల మోత మోగుతోంది. తాజాగా సికింద్రాబాద్ నుంచి చెన్నై సెంట్రల్‌కు (వయా రేణిగుంట) వందే భారత్‌రైలు ప్రారంభమైంది. సికింద్రాబాద్ తిరుపతి మధ్య వందేభారత్‌కు సాధారణ టిక్కెట్టు రూ.1625, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రూ.3080 చెల్లించాల్సి ఉంది. ఇంతమొత్తం సామాన్యుడు చెల్లించలేని స్థితి నెలకొంటోంది. గతంలో ఉన్న ప్యాసింజర్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్పు చేసి ఛార్జీల భారం మోపారు. గుంటూరు-రాయగడ, రేపల్లే-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లు మార్పు చేసి ఏసీ బోగీలు పెంచారు.
ప్రత్యేకం అంటూ బాదుడు...
సాధారణ రైళ్లను రద్దు చేస్తూ అదనపు ఛార్జీల వసూలుకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ప్రయాణికుల నుంచి ఎక్కువ ఛార్జీల కోసం ఈ విధంగా ప్రణాళికలు మారుస్తున్నారు. రద్దీ మార్గాల్లో నవంబరు 15 వరకు ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. సహజంగా వేసవిలో రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేక రైళ్లను నడుపుతారు. ఇటీవల కాలంలో ఏడాదికి 9 నెలల పాటు నడుపుతున్నారు. తాజాగా రెండు నెలలపాటు ప్రత్యేక రైళ్లను నడపటం ద్వారా అదనపు ఛార్జీల రూపంలో ప్రత్యేక బాదుడు కొనసాగించేందుకేనని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.