Apr 18,2023 23:38

ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్న సిపిఎం, సిపిఐ నాయకులు

ప్రజాశక్తి -ఎటపాక
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌తో పాటు అన్ని రకాల నిత్యావసరాల ధరలను భారీగా పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తుందని సిపిఎం, సిపిఐ నాయకులు విమర్శించారు. సిపిఎం, సిపిఐ కేంద్ర కమిటీల పిలుపు మేరకు మండలంలోని కన్నాపురం గ్రామంలో మంగళవారం ప్రచార భేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి కూలీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం ఎటపాక మండల కార్యదర్శి వర్గ సభ్యులు డేగల మాధవరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కందుకూరి స్వర్ణ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి నిధులు సగానికి సగం కోత పెట్టిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కులాల మధ్య, మతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొడుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆకిశెట్టి రాము, నక్కా సూరిబాబు, సిపిఐ మండల కార్యదర్శి ఎలిశాల నాగరాజు, వరదా బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
విఆర్‌ పురం : సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు ఆధ్వర్యంలో మండలంలోని కుంజవారిగూడెం నుండి బోరుగుంపు వరకు నాలుగో రోజు ప్రచార భేరి నిర్వహించారు. ప్రతి ఇంటికి కరపత్రం పంచుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రచార భేరి సాగింది. ఈ సందర్భంగా చిన్నబాబు మాట్లాడుతూ మండలంలోని పెద్దమటపల్లి నుండి కుందులూరు వరకు 15 కిలోమీటర్లు రహదారులు శిథిలమయ్యాయని, రోడ్డు నిర్మాణానికి మూడేళ్ల క్రితం ఎమ్మెల్యే ధనలక్ష్మి శంకుస్థాపన చేశారని తెలిపారు. ఈ సమయంలో రహదారులను తవ్వి వదిలేశారని, నేటికి రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదన్నారు. దీంతో ప్రజలు ఆసుపత్రికి, కార్యాలయాలకు, బ్యాంకులకు వెళ్లడానికి, నిత్యవసర సరుకులకు తెచ్చుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం పోడు వ్యవసాయం చేయకుండా చట్టాలను సవరణ చేస్తూ ఆదివాసీలను అడవుల నుండి తరిమే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు తక్షణమే పట్టాలివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు వడ్లాది రమేష్‌, కుంజ నాగిరెడ్డి, సర్పంచ్‌ సవలం మారయ్య, రాజయ్య, పెద్దయ్య పాల్గొన్నారు.
విఆర్‌.పురం : మండలంలోని ఉమ్మడివరం గ్రామాల్లో మంగళవారం ప్రచార భేరి సాగింది. ఉపాధి హామీ పనులను సందర్శించి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేసవి దృష్ట్యా కూలీలకు మజ్జిగ, మంచినీళ్లు, మెడికల్‌ కిట్టు అందుబాటులో ఉంచాలన్నారు. రోజు వేతనం రూ.600 ఇవ్వాలని, ఏడాదికి 200 రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, నాయకులు పంకు సత్తిబాబు, జి.లక్ష్మణరావు, హజరత్‌, చిక్కాల రామారావు పాల్గొన్నారు
కూనవరం : పేద బడుగు వర్గాల ప్రజలు ఆధార పడే ఉపాధి హామీ చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసి కూలీలకు సరైన వేతనం ఇవ్వటం లేదని సీపీఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, వైస్‌ ఎంపిపి కొమరం పెంటయ్య విమర్శించారు. మంగవారం నిర్వహించిన ప్రచార భేరిలో వారు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ముంపు వల్ల వ్యవసాయ భూముల్లో పంటలు పండక పేద రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని తెలిపారు. తక్షణమే పోలవరం ప్రాజెక్టు ముంపు భూములకు సంబంధించిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు సర్పంచ్‌ బి.రామారావు బి.సుబ్బయ్య గుండం బాబూరావు పాల్గొన్నారు.



బిజెపిని గద్దె దించడమే లక్ష్యం
ప్రజాశక్తి - అరకులోయ రూరల్‌
ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడమే సిపిఎం, సిపిఐ ప్రచారభేరి లక్ష్యమని పలువురు నేతలు స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా ఈనెల 25 న అరకులోయలో నిర్వహించే బహిరంగ సభ విజయవంతం చేయాలని కోరారు. మంగళవారం మండలంలోని పెదలబుడు, చినలబుడు, మాడగడ పంచాయతీ గ్రామాల్లో సిపిఎం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆ పార్టీ మండల కార్యదర్శి కె రామారావు, నాయకులు పి.బాలదేవ్‌ మాట్లాడుతూ మత విద్వేషాలను రెచ్చగొట్టి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, ఎల్‌ఐసి, రోడ్డురవాణా, ఓడరేవులు, స్టీల్‌ప్లాంట్‌, బ్యాంకింగ్‌ రంగాలను ఆదానీ అంబానీలకు కారుచౌకగా అమ్మేయాలని చూస్తోందని, నూతన అటవీ చట్టం పేరుతో అడవులను ప్రైవేటు కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేయాలని చూస్తోందన్నారు. చింతపల్లి, అనంతగిరి మందలాల్లో హైడ్రోపవర్‌ ప్రాజెక్టులను ఆపాలని కోరాఉ. ప్రచార కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు కె మగ్గన్న, టి.హరి, కె మొద్దు, రత్నకుమారి, సీత, పెదలబుడు పంచాయతీ వార్డు మెంబర్‌ అప్పలమ్మ, చంప, లైచన్‌ పాల్గొన్నారు.
20న సమగిరిలో హైడ్రోపై బహిరంగ సభ
పాడేరు :కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగావామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర మంగళవారం సాయంత్రం చింతపల్లి మండలం చిట్రాలగుప్పు వద్దకు చేరుకుంది. యాత్రలో సిపిఐ జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ సిపిఎం, సిపిఐ మండల కార్యదర్శులు పాంగి ధనుంజరు, మాట్లాడుతూ ఈ పాదయాత్ర గొందిపాకలు మీదుగా సమగిరి, ఎర్రవరం చేరుకుని ఈ నెల 20న సమగిరిలో హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ సమస్యపై బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పాడేరు జిల్లా కేంద్రం వరకు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. పాదయాత్రలో వామపక్ష నాయకులు పెట్ల పోతురాజు అమర్‌ పాల్గొన్నారు.