ప్రజాశక్తి-తెనాలి : సామాన్య కుటుంబంలో పుట్టి అసమాన స్థాయికి ఎదిగిన కవి, నటుడు మోదుకూరి జాన్సన్ అని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జియాలజి విభాగాధిపతి డాక్టర్ పి.జోసఫ్ రత్నాకర్ అన్నారు. స్థానిక కొత్తపేట పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో జాన్సన్ జయంతిని మంగళవారం నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ రత్నాకర్ మాట్లాడుతూ తెనాలి మండలం కొలకలూరుకు చెందిన జాన్సన్ నటనాలయం నాటకం రచనతో రచయితగా, నటుడుగా ప్రసిద్ధి చెందారన్నారు. సినీ మాటల రచయితగా, నటుడిగానూ వెండితెరకు పరిచయమయ్యారన్నారు. అగ్ర నటులు శోభన్‌బాబు, కృష్ణ, ఎఎన్‌ఆర్, ఎన్టీఆర్ వంటి మహా నటులు నటించిన దేవాలయం, పాడిపంటలు, డుబ్బకు లోకం దాసోహం వంటి చిత్రాలతో అయన సినీ రంగ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగిందన్నారు. కరుణామయుడు చిత్రంలో రాసిన మాటలు, పాటలు ఆయన సాహిత్య పటిమకు అద్దం పట్టాయని కొనియాడారు. డాక్టర్ వల్లూరి రామారావు మాట్లాడుతూ సాహితీ రంగంలో ఓ దిగ్గజంగా జాన్సన్ వెలుగొందారని అన్నారు. అనతరం సీనియర్ ఎపిపి ఎస్.సుకుమార్, సీనియర్ న్యాయవాది ఇందుపల్లి రాజారామ్, పినపాటి రవికుమార్ మాట్లాడారు. తొలుత జాన్సన్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. విద్యుత్ రిటైర్డ్ ఎస్‌ఇ పి.బి.కరుణాకర్, డాక్టర్ కె.రాజ్‌కుమార్, ఎస్.మురళీధర్, డి.అనిల్‌కుమార్, కె.రమేష్, ఎం.లీలాకుమార్, గురుదేవ్, శైలేంద్ర పాల్గొన్నారు.










