ప్రజాశక్తి-రేపల్లె
సామాజిక వికాసానికి జర్నలిస్టులు చేస్తున్న కృషి అభినందనీయం అని బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ దేవినేని మల్లిఖార్జునరావు అన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ మార్కెట్ కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్‌క్లబ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా జర్నలిస్టులు పనిచేస్తున్నారని అన్నారు. విలేకరులు సమయపాలన లేకుండా నిరంతరం వార్తల సేకరణ కోసం అనేక సమస్యలు ఎదుర్కొంటూ జీవితాలను త్యాగం చేసే ధీరులని కొనియాడారు. సిపిఎం నాయకులు మణిలాల్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రజా సంఘాలకు, దూరప్రాంతాల నుంచి వివిధ సమస్యలపై వచ్చే సామాన్య ప్రజలకు ప్రెస్‌క్లబ్ అవసరం ఉందన్నారు. జర్నలిస్టులు ఆత్మ విశ్వాసంతో సామాజిక సమస్యలను వెలికితీసి, ప్రభుత్వం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ తునుగుంట్ల విశ్వనాథగుప్తా మాట్లాడుతూ విలేకరులు ఏకపక్ష వార్తలు కాకుండా సమాజంలో ఉన్న అన్ని అంశాలను పార్టీలకు అతీతంగా ప్రజాల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ బ్లడ్ బాంక్ జిల్లా ఉపాధ్యక్షులు, డాక్టర్ వసంతం వీర రాఘవయ్య, చైర్ పర్సన్ కట్టా మంగ, మీడియా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సుఖవాసి సతీష్ బాబు, అధ్యక్షులు నాగేశ్వరరావు, ప్రవీణ్, రమేష్, మీరా వైసీపీ నాయకులు ఓబెదు, బాలాజీ పాల్గొన్నారు.










