Oct 30,2023 21:24

మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు

ప్రజాశక్తి -కురుపాం, పార్వతీపురం : జిల్లాలో సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా రక్షణ బేరి బస్సుయాత్ర ఉత్సాహాన్ని నింపింది. గిరిజన, రైతాంగ, ఉద్యోగ, కార్మిక వర్గాలను ఆలోచింప చేసింది సీతంపేటలో ప్రారంభమైన బస్సుయాత్ర పాలకొండ, కురుపాం మీదుగా పార్వతీపురం వరకు సాగింది. కురుపాం పార్వతీపురం కేంద్రాల్లో యాత్ర బృందానికి ఘన స్వాగతం లభించింది. కురుపాంలో గిరిజన సాంప్రదాయ నృత్యం డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. పార్వతీపురంలో కోలాటంతో స్వాగతం పలుకుతూ నాయకులకు తిలకం దిద్దారు. ఈ రెండు చోట్ల సాగిన ప్రదర్శనలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక నినాదాలు మారు మోగాయి. ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా కార్మిక గిరిజన రైతాంగ వ్యతిరేక విధానాలపై ప్రజానాట్యమండలి కళాకారులు నృత్యాలు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా కురుపాం, పార్వతీపురంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రెడ్డివేణు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె. అవినాష్‌ అధ్యక్షతన జరగిన బహిరంగ సభల్లో వక్తలు మాట్లాడారు. తొలుత సిపిఎం పోలీస్‌ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి చేపడుతున్నది సామాజిక సాధికార యాత్ర కాదని సామాజిక సంహార యాత్ర అంటే సరిపోతుందని కితాబు ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని తరగతులనూ మోసం చేస్తున్న బిజెపికి వంతపాడి తిరిగి అదే ప్రజలకు సాధికారత కల్పిస్తున్నామన్నడం సిగ్గుచేటు అన్నారు. సిఎం జగన్‌ వైఖరి వల్ల రాష్ట్రం మునుపెన్నడూ లేనంత నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. టిడిపి కూడా రాజకీయంగా ఎదుర్కోవడం తప్ప ప్రజల సమస్యలు పట్టలేదని విమర్శించారు. ఈ విషయాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రజారక్షణ బేరి పేరిట తమ పార్టీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపడుతున్నామని తెలిపారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు. తోటపల్లి ,జంఝావతి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పినా, వాటికి అందుకు అనుగుణంగా నిధులు కేటాయించలేదన్నారు. 14 ఏళ్ల క్రితం సిపిఎం ఒత్తిడితో తలపెట్టిన పూర్ణపాడు లాబేసు వంతెన నిర్మాణాన్ని కూడా చేపట్టలేదని, దీంతో గిరిజనులు ఎంతో ప్రయాస పడుతున్నారని అన్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వారు నివాసం ఉంటున్న మేరంగి రోడ్లు కూడా దారుణంగా ఉండడం సిగ్గుచేటు అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల నిర్లక్ష్యం వల్ల సీతానగరం బ్రిడ్జి నిర్మాణం కూడా అసంపూర్తిగానే మిగిలిపోయిందని విమర్శించారు.
ఏజెన్సీలు ఏనుగుల విధ్వంసంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నా పట్టించుకోలేదన్నారు ఏజెన్సీలో జీడి పిక్కల ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు పార్వతీపురంలో తాగునీరు, ట్రాఫిక్‌ సమస్య పై ఇచ్చిన హామీలు నెరవేరలేదని గుర్తు చేశారు. సీతానగరంలో ఎన్‌సిఎస్‌ సుగర్స్‌ ను సహకార రంగంలోకి తీసుకొస్తామని చెప్పినప్పటికీ రైతులు బకాయిల తీర్చేందుకు ఏకంగా పరిశ్రమ భూమినే విక్రయించారని అన్నారు. సిపిఎం సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక్క అభివద్ధి కార్యక్రమం కూడా చేపట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులుగా మారిపోయారని విమర్శించారు. జిల్లాలో సమస్యలపైన, అభివద్ధి కోసం సిపిఎం నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రజల ముందుకు సాగుతుందని అన్నారు. ఇందుకు ప్రజలు తోడైతే మేలు జరుగుతుందని అన్నారు. ఐద్వా నాయకులు హైమావతి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘం రాష్ట్రఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 420 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఆయా ప్రాంతాల రైతులు ఆందోళనతో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా గుర్తించేందుకు మినామీషాలు లెక్కిస్తుందనిిి అన్నారు.
సాగునీటి రంగంపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్ల ఎటువంటి దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కిల్లో సురేంద్ర, కె.సుబ్బరావమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.అశోక్‌, దడాల సుబ్బారావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం. తిరుపతిరావు వై .మన్మధరావు, కె. గంగునాయుడు, జిల్లా కమిటీ సభ్యులు ఎం.శ్రీనివాసరావు, కోరాడ ఈశ్వరరావు, ఎంపిటిసిలు ఎం.రమణ, బి.ఎర్రమ్మ తదితరులు పాల్గొన్నారు.