Dec 19,2020 07:40

      ఉత్తరప్రదేశ్‌లో అత్యున్నత స్థాయిలో ఘనీభవించిన కుల చట్రంలో మనుగడ సాగించడం పెద్ద సాహసమే. ఇక్కడ కుల పక్షపాతం, పితృస్వామిక శక్తుల ప్రాబల్యం బలంగా వ్యాపించి ఉంది. కులాలకు రాజకీయ ప్రతినిధుల అండదండలుంటాయి.
ఉన్నావో మొదలుకొని హత్రాస్‌ వరకు హింస పునరావృతం కావడం చూశాం. మృగప్రాయమైన అంశాలకు ప్రాధాన్యతనిస్తూ, గొప్పగా చెప్పుకోవడం పరిపాటి.

        నలుగురు ఠాకూర్లచే హత్యాచారానికి గురైన బాధితురాలిని, ఆమె తల్లిదండ్రుల అభీష్టానికి భిన్నంగా, ఆ రాత్రికి రాత్రే అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె కుటుంబాన్ని నిఘా నీడలో ఉంచి మరీ ఆ దుశ్చర్యకు పాల్పడ్డారు. పట్టణంలో 144వ సెక్షన్‌ విధించడం, వారి కుటుంబ సభ్యులను పత్రికల వారితో మాట్లాడడానికి అనుమతించకపోవడం, బాధితురాలి సోదరుడి మొబైల్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయించడం, వారి కుటుంబాన్ని ఇంటికే పరిమితం చేయడం వంటివన్నీ జరిగాయి. ఠాకూర్‌ కుటుంబీకులు బహిరంగంగా నిరసన తెలియచేయడానికి అనుమతించారు. బాధితురాలి కుటుంబాన్ని మాత్రం బహిరంగంగా బెదిరించారు. వారిని పరామర్శించడానికి వెళ్లిన చంద్రశేఖర్‌ రావణ్‌ లాంటి వారికి కూడా హెచ్చరికలు చేశారు. బాధిత కుటుంబం భయంతో వణికి పోయింది.
        హత్రాస్‌ అనేది కులాధిక్యత గల పట్టణం. వారిలో ముఖ్యంగా బ్రాహ్మణులు, వైశ్యులు వున్నారు. మురికి కాల్వలు బహిరంగంగా పారే ప్రాంతంలో వాల్మీకులు నివసిస్తారు. వారు ప్రధానంగా పారిశుధ్య కార్మికులుగా వుంటూ ఠాకూర్ల పంటపొలాల్లో వ్యవసాయ పనులు చేస్తారు. ఠాకూర్లకు వారితో పని పడినప్పుడు ఒక మధ్యవర్తిని వారి వద్దకు పంపుతారు. దళితవాడలకు వెళ్లి పనికి రమ్మని అడగడం తమ గౌరవానికి భంగకరమని భావిస్తారు. దళితులు మార్కెట్‌ నుంచి కొనాలనుకున్నా, షాపు యజమానులు దూరాన్ని పాటిస్తూనే సరుకులు ఇస్తారు. కరోనా మహమ్మారి వల్ల వాడుకలోకి వచ్చిన 'సామాజిక దూరం' అనే పదం అంతకు ముందే ఆ ప్రాంతంలో పాటించబడుతున్నది.
       ఉత్తరప్రదేశ్‌ లో కులాల ఆధారంగా అసమానతలనేవి స్పష్టంగా కన్పిస్తుంటాయి. హత్రాస్‌ దీనికి మినహాయింపు కాదు. దళితులు అగ్రవర్ణాల కాలనీల్లోకి వెళ్లినట్లయితే సామాజిక దూరాన్ని పాటించవలసిన ఉంటుంది. కుల కట్టుబాట్లకు అనుగుణంగా మసులుకోవాల్సి వుంటుంది. కులాంతర చర్చగాని, సామాజిక ఐక్యత గాని లేదు.
       జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ వివేక్‌ కుమార్‌ ఇలా అంటారు. ''కుల ఆధిపత్య హిందూ సమాజంలో దళితులు ఎప్పుడూ బహిష్కృతులుగానే ఉన్నారు. నేటికీ వారు అగ్ర కులస్తుల పొలాల్లో పని చేస్తున్నప్పటికీ...వారి దగ్గరకు వెళ్ళడానికి కూడా అనుమతించరు. వారి పశువులను కూడా అగ్ర కులస్తుల పొలాల్లో మేత మేయడానికి అనుమతించరు. ఉదయం బహిర్భూమికి కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళ వలసి ఉంటుంది''.
       ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త అవిజిత్‌ పాఠక్‌ ఇలా అంటారు. ''నీవు ముస్లిమైనా, దళితుడవైనా, ఆధిపత్య శక్తులు పరిమితులు విధిస్తారు. భారతీయ సమాజంలో ఆధునికత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, కొన్ని సంవత్సరాలుగా భారతీయ సమాజం రోజురోజుకు తిరోగమన దిశలో పయనిస్తోంది. వినిమయతత్వం పట్ల విపరీతమైన మోజుతో పాటు, తిరోగమన భావాలు వ్యాపిస్తున్నాయి. మతమనేది ప్రధానమైనదిగా మారింది. ఉత్తరప్రదేశ్‌లో అత్యున్నత స్థాయిలో ఘనీభవించిన కుల చట్రంలో మనుగడ సాగించడం పెద్ద సాహసమే. ఇక్కడ కుల పక్షపాతం, పితృస్వామిక శక్తుల ప్రాబల్యం బలంగా వ్యాపించి ఉంది. కులాలకు రాజకీయ ప్రతినిధుల అండదండలుంటాయి. ఉన్నావో మొదలుకొని హత్రాస్‌ వరకు హింస పునరావృతం కావడం చూశాం. మృగప్రాయమైన అంశాలకు ప్రాధాన్యతనిస్తూ, గొప్పగా చెప్పుకోవడం పరిపాటి''.
       ''ఈ పరిస్థితి ఎప్పుడూ ఉన్నదే. అయినా, హత్రాస్‌ విషాదం తరువాత మీడియా దృష్టికి వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఫ్‌ు ప్రారంభం నుంచి క్షత్రియులను సమర్థిస్తూ, వారిపై నమ్మకం వుంచుతున్నాయి. దేశ విభజన తరువాత ఈనాడు భారతీయ జనతా పార్టీ అధికారంలో వున్నది కాబట్టి వారు అధికార కులంగానే భావిస్తారు. యు.పి లో కాంగ్రెస్‌ పలుకుబడి ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలో, మాయావతితో లేని దళిత కులాలను తమ సామాజిక కూటమిగా ఎన్నుకున్నారు. వెనుకబడిన తరగతులలో మౌర్యాలను మొదలుకొని, మల్లాలు, పాసీల వరకు నూతన కూటమిని ఏర్పరుచుకున్నారు. కళ్యాణ్‌ సింగ్‌, ఉమాభారతి అధికారంలో ఉన్నంత కాలం లోథాలు వారితోనే వున్నారు. మల్లాలు రామునితో తమకు ఉన్న అనుబంధాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. పరుశురాముని శ్వేదం నుంచి తాము ఉద్భవించినట్టు పాసీలు చెప్తారు. ఒకవైపున యు.పి లో 9 శాతం ఠాకూర్లు, పూర్తిగా వెనుకబడిన తరగతుల నుంచి 32 శాతం ఓటర్లు బిజెపి వైపు ఉన్నారు. ప్రధాన మంత్రిని కూడా వెనుకబడిన తరగతుల వాడిగా చెప్పుకోవడానికి ఇష్టపడతారు! 2017 విధానసభ ఎన్నికల్లో 200 చిన్న సమావేశాలు కుల ప్రాతిపదికన జరిగాయి. ఈరోజున కుల సమీకరణలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, పై స్థాయిలో ఉన్న పోలీసు అధికారుల్లో, జిల్లా మెజిస్ట్రేట్‌ కోవిడ్‌ పునరావాస కేంద్రాలలో కూడా ఈ సామాజిక గ్రూపుల ప్రాబల్యాన్ని గమనిస్తాం. ఈ నలభై ఒక్క శాతమే రాష్ట్రంలో ఆధిపత్య శక్తిగా కనబడుతుంది'' అంటారు ప్రొఫెసర్‌ పాఠక్‌.
       ఈ కుల సమీకరణలు...2017 నుంచి ఎన్‌కౌంటర్‌ పేరుతో దళితులను, ముస్లింలను ఏరిపారేస్తున్నారనే వాదనకు మినహాయింపు లేని సాక్ష్యంగా వున్నాయి. యు.పి లో హత్రాస్‌ ఒక చిన్ని ప్రాంతం. హత్రాస్‌ ఢిల్లీకి అత్యంత సమీపంలో వున్నదనే విషయం మన దృష్టిలో వుండాలి. కాబట్టి హత్రాస్‌లో బిజెపి జరిపే ప్రతి చర్యా ఢిల్లీ, రాజస్థాన్‌, బీహార్‌పై ప్రభావం చూపుతుంది.
కుల, వర్గ అసమానతలు, ఆధిక్యతలతో కూడిన చైతన్యం మధ్యతరగతిలో గమనిస్తామని ప్రొఫెసర్‌ పాఠక్‌ చెప్తారు. తన మాటల్లోనే చూద్దాం. ''వలస కార్మికుల సంక్షోభ సమయంలో, మధ్యతరగతి ఉన్నత వర్గాలు ఏ విధంగా ప్రవర్తించాయో మనం గమనించాం. అప్పుడు కూడా వారు అమెజాన్‌ సరుకులు, ఆహారం, చేపలు, చికెన్‌ అందుతాయో లేదో అనే దానిపైనే దృష్టి పెట్టారు. అత్యంత నీచమైన అంటరానితనం పాటించారు. పనివారు లిఫ్ట్‌ ఎక్కవచ్చా, కూరగాయలు అమ్మేవారు కాలనీ లోకి ప్రవేశించవచ్చా అనే అంశాలు ముందుకొచ్చాయి. కొన్ని సందర్భాలలో బిజెపి శాసనసభ్యులు అమ్మకందారులను అవమానించటం, వారి ఆధార్‌ కార్డు అడగటం గమనిస్తాం''.
       గత కొన్ని సంవత్సరాలుగా కుల విభేదాలు బాగా పెరిగాయి. కేవలం సాధారణమైన కులాధిపత్యమే కాదు, దళిత సమాజంలో కూడా కరుడుగట్టిన కుల విభేదాలు పొడచూపాయి. ప్రతి విషయం తమ రాజకీయ అవసరాలను బట్టి అంచనా వేయబడుతుంది. అధికార యంత్రాంగం లేక రాజకీయ విభాగం చాలా చురుగ్గా కుల, ఉపకుల అస్తిత్వ మంటలను, రాజకీయాలను ఏ స్థాయికి తెచ్చిందంటే ద్విజులు (బ్రాహ్మణులు) కానివారు, బిఎస్‌పి తో కానీ, ఎస్‌పి తో గాని కలవడానికి వీలులేనంతగా జాగ్రత్త పడింది. ఈ పరిస్థితుల్లో చిన్న కులాలు అవినీతిపై, ఆధిపత్య కులానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయడం చాలా కష్టం అవుతుంది. ''వీటి ప్రభావాలను గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం వాడే భాషనే బిజెపి యేతర ప్రభుత్వాలు కూడా అనుసరించే ప్రయత్నం చేస్తున్నాయి.'' అంటారు ప్రొఫెసర్‌ పాఠక్‌.
       సామాజిక పునర్నిర్మాణం ఎజెండాగా పని చేయవలసిన అవసరం ఉంది. అన్నిటికంటే అభివృద్ధికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంది. మనం ఇప్పుడు నేరం ఎవరు చేశారనే దాని ఆధారంగా తీర్పులు ఇచ్చే కాలంలో జీవిస్తున్నామంటారు బరేలి కి చెందిన విశ్రాంత విద్యావేత్త, సామాజిక కార్యకర్త ఇనుమూర్‌ రెహమాన్‌. ఒకవేళ దళిత లేక ముస్లిం యువతిపై అఘాయిత్యం జరిగినట్టయితే మీడియా గాని, అధికార యంత్రాంగం లోని అన్ని విభాగాలు గాని కేసు నుంచి పక్కదారి పట్టించడానికే ప్రయత్నిస్తాయి. ముంబైలో రాజ్‌పుట్‌ హీరో ఆత్మహత్య చేసుకున్నప్పుడు యు.పి లోని చానళ్లన్నీ నిరంతరాయంగా ప్రసారం చేశాయి. కానీ గోండా జిల్లాలో ముగ్గురు దళిత యువతులపై యాసిడ్‌ దాడి జరిగినప్పుడు అదే మీడియావారికి వార్తగా కనబడలేదు. హత్రాస్‌లో జరిగింది కుల దురహంకార హత్యగా నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర ప్రదేశాలలో వారి ఆత్మగౌరవంపై, విలువలపై దూషణలతో దాడిచేయడం జరుగుతుంది. సెక్స్‌ వర్కర్‌పై అఘాయిత్యం జరిగినా అది అత్యాచారం కిందికే వస్తుంది కదా? కొన్ని శక్తులకు స్వేచ్ఛగా వ్యవహరించే హక్కును కల్పించినట్టుగా కనిపిస్తుంది. వారి కోసం ప్రత్యేకమైన నియమాలు రూపొందించబడ్డాయి.
       హత్రాస్‌, ఉన్నావో ఇతర ప్రదేశాల్లో జరిగే సంఘటనలు కలతపరిచే విధంగా ఉన్నాయి. ఇది అధికారాన్ని దుర్వినియోగ పరచడమే. ఇవన్నీ అనాగరికమైన, ఆధిపత్యంతో కూడిన పురుషాధిక్య లక్షణాలే. విషపూరిత భావాలను, మనుషుల మధ్య నిర్మితమైన అడ్డుగోడలను, తొలగించటానికి మనకు అనేక సంవత్సరాలు పట్టవచ్చు. ఈ విధానాలు భారతీయ సంస్కృతికి ఎంతో హాని చేస్తాయి. ఈ గాయాన్ని మాన్పడానికి సుదీర్ఘకాలం పట్టవచ్చు. ఈ సామాజిక క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడాల్సి వుంది. ఎందువల్లనంటే హిందూత్వ శక్తుల దూకుడు వల్ల నిన్నటి స్నేహితులే నేటి శత్రువులుగా మారిన పరిస్థితిని చూస్తున్నాం. చరిత్ర అదే మార్గం చూపుతుంది. కానీ, చరిత్రే అద్భుతాలు సృష్టిస్తుందని, మనం నిస్తేజంగా నిరీక్షించలేం. యు.పి లో గానీ, మరెక్కడైనా గానీ ఇలాంటి విషపూరిత పరిస్థితిని ఎదుర్కోవడానికి మనం చేయగలిగినంత చేయాలి. మనం ఎక్కడో ఒకచోట నుంచి ప్రారంభించాలి. హత్రాస్‌ బాధితురాలికి న్యాయం జరగడమనేది మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. అది యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వానికి తీవ్రమైన హెచ్చరిక కావాలి. కుల సంబంధమైన తప్పుడు మార్గాలను తొలగించే కార్యక్రమాలకు ప్రాముఖ్యతను పెంచాలి.
 

(వ్యాసకర్త 'ఫ్రంట్‌లైన్‌' అసోసియేట్‌ ఎడిటర్‌)

జియా-ఉస్‌-సలామ్‌

సామాజిక వివక్షే కట్టుబాటుగా...