Apr 11,2023 23:56

మండుటెండలో దీక్ష చేస్తున్న వి.శ్రీనివాసరావు, పాశం రామారావు, బషీర్‌ అహ్మద్‌ తదితరులు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా 150 ఏళ్ల క్రితమే సామాజిక విప్లవాన్ని తెచ్చిన ఘనత మహాత్మా జ్యోతిరావు ఫూలేకు దక్కుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో గుంటూరు లాడ్జి సెంటర్లో మండుటెండలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మంగళవారం దీక్ష చేపట్టారు. దీక్షకు మద్దతుగా సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, కార్యకర్తలు, ముస్లిమ్‌ లీగ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బషీర్‌ అహ్మద్‌ పాల్గొన్నారు. మహాత్మ జ్యోతిరావుఫూలే జయంతి సందర్భంగా చేపట్టిన ఈ దీక్షలో వివిధ రాజకీయ పార్టీలు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత హిందూ కళాశాల సెంటర్‌లోని జ్యోతిరావు విగ్రహం నుంచి ర్యాలీగా దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. దీక్షా శిబిరం జరిగిన సభకు సిపిఎం నగర్‌ కార్యదర్శి కె.నళినికాంత్‌ అధ్యక్షత వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు పూలే అనేక ఉద్యమాలు చేశారని అన్నారు. పెత్తందారుల నుంచి ఆయన వివక్ష ఎదుర్కొన్నారని, తన భార్యకు తానే చదువు చెప్పి ఆమెను దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారని కొనియాడారు. బడుగువర్గాలకు రిజర్వేషన్లు కావాలని ఆనాడే ఫూలే పోరాడారని, ఆయన స్ఫూర్తితోనే రిజర్వేసన్ల అమలుకు డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కృషి చేశారని చెప్పారు. గుంటూరు హిందూ కళాశాల సెంటర్‌లో పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 9 ఏళ్లుగా మనువాదుల ఆలోచన ధోరణులను పక్కాగా అమలు చేస్తున్నారని మండిపడ్డారు. 1998 డిఎస్‌సిలో రిజర్వేషన్లు అమలుకు నోచుకోకపోవడం విచారకరమన్నారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మోకాలడ్డుతోందని, దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్నా పాలకులకు ఏమాత్రం పట్టడం లేదని విమర్శించారు. కుల, మతాల పేరుతో వివిధ తరగతుల ప్రజల మధ్య బిజెపి చిచ్చుపెడుతోందని, ఆ పార్టీ అవలంబిస్తున్న విధానాలను సిఎం జగన్‌ సమర్థిస్తూ ప్రధాని మోడీకి భజన చేస్తున్నారని దుయ్యబట్టారు. అవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎంఎ.చిష్టి మాట్లాడుతూ బిజెపి పాలనలో విద్వేషపూరిత రాజకీయాలు ఎక్కువగా చేస్తున్నారని అన్నారు. ఫూలే, అంబేద్కర్‌ ఆశయాలకు భిన్నంగా పాలన సాగుతోందన్నారు. పాశం రామారావు మాట్లాడుతూ మహిళలు చదువుకోకుండా అడ్డుపడ్డ పెత్తందారులను దిక్కరించి జ్యోతిరావు ఫూలే తన భార్య సావిత్రి భారు పూలేకు చదువు నేర్పారని అన్నారు. ఫూలే, అంబేద్కర్‌ ఆశయాలకు భిన్నంగా దేశంలో, రాష్ట్రంలో పాలన సాగుతోందని అన్నారు. వైసిపి పాలనలో సంక్షేమ పథకాల పేరుతో రూ.10 ఇచ్చి పన్నుల రూపంలో పేదల నుంచి రూ.20 వసూలు చేస్తున్నారని అన్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి ఎల్‌.అరుణ మాట్లాడుతూ ప్రతి 45 నిమిషాలకు ఒక దళితపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని, వాకపల్లిలో గిరిజన మహిళలపై గ్రే హౌండ్స్‌ పోలీసులు లైంగికదాడికి పాల్పడిన ఘటనను కోర్టు నిర్ధారించినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని అన్నారు. కార్యక్రమంలో ఇండియన్‌ ముస్లిం లీగ్‌ రాష్ట్ర అధ్యక్షులు బషీర్‌ అహ్మద్‌, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్‌ కుమార్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎల్‌.ఈశ్వరరావు, టిడిపి నాయకులు కె.శివరామయ్య, ఎఐటియుసి గౌరవాధ్యక్షులు వి.రాధాకృష్ణ, సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి, సిపిఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ నాయకులు వి.నరసింహారావు, సిపిఐ (ఎంఎల్‌) ప్రజాపోరు నాయకులు పి.కోటేశ్వరరావు, పోస్టల్‌ ఉద్యోగుల ఫెడరేషన్‌ నాయకులు హనుమంతరెడ్డి, కెవిపిఎస్‌ నాయకులు జి.మరియదాస్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్‌, అవాజ్‌ జిల్లా అధ్యక్షులు ఎస్‌కె బాష, కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.శ్రీనివాసరావు, రంగస్వామి, టి.రాధ, గోరంట్ల వెంకటరావు, జి.మరియదాసు, మస్తాన్‌వలి, బి.కొండలరావు, కె.రూఫస్‌, బి.ముత్యాలరావు, ఎ.నికల్‌సన్‌, ఎన్‌.మస్తాన్‌రావు, పి.ఎన్‌.ఎం.రాంబాబు, సిహెచ్‌.కుమార్‌, సలీమ్‌, ఎల్‌.ఎస్‌.భారవి, ఎస్‌.కార్తీక్‌, పిఎన్‌ఎం రాంబాబు, ఖాజావలి, ఆర్‌.సాంబశివరావు, బి.లక్ష్మణరావు పాల్గొన్నారు.