May 22,2023 22:28

మినీ మహానాడు సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు


- మినీ మహానాడులో వక్తలు
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి
రాజకీయ, సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి నిస్వార్ధంగా పరిపాలన చేసిన మహనీయుడు ఎన్‌టిఆర్‌ అని పలువురు వక్తలు అన్నారు. నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కాకినాడ సూర్య కళామందిరంలో సోమవారం తెలుగువారి ఆత్మగౌరవానికి వందేళ్లు పేరుతో మినీ మహానాడు కార్యక్రమం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఎన్‌టిఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్‌టిఆర్‌ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తు న్నామన్నారు. రాజకీయాల్లో చదువుకున్న యువతకు ఆయన పెద్దపీఠ వేశారన్నారు. పేదలకు తిండి, బట్ట, ఇల్లు ఇచ్చి రూ.2 కిలో బియ్యం ఇచ్చి ఆదుకున్నా రన్నారు. నిరుపేదలకు పెన్షన్‌ విధానం తీసుకొచ్చింది ఆయనే అన్నారు. విజన్‌ 2020 పేరుతో రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి చేశారన్నారు. ఈ సందర్భంగా అధికార వైసిపిపై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. పెద్దాపురం ఎంఎల్‌ఎ చినరాజప్ప, మాజీ మంత్రి బండారు సత్య నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు విలువ తెలుసుకున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు చిక్కాల రామచంద్రరావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, ఎస్‌విఎస్‌ఎన్‌ వర్మ, పిల్లి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.