Oct 20,2023 20:26

ఉపాధి ప్రజావేదికలో మాట్లాడుతున్న పీడీ అమర్‌నాథ్‌ రెడ్డి

ప్రజాశక్తి - చిప్పగిరి
ఉపాధి హామీ చట్టం మండలంలో 12 జిపిలలో రూ.6,662 రికవరీ చేసినట్లు ఉపాధి హామీ పీడీ అమర్‌నాథ్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎపిఒ మాధవ శంకర్‌ ఆధ్వర్యంలో ఉపాధి హామీ చట్టం సామాజిక తనిఖీ చేపట్టారు. మండలంలోని అధికారులు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, తనిఖీ అధికారులతో కలిసి బహిరంగ వేదిక నిర్వహించారు. ఈ బహిరంగ వేదికలో 12 జిపిలలో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి పనులు జరిగిన ప్రదేశాల్లో అవినీతి, అక్రమాలు ఏమైనా జరిగాయా అని వారం రోజుల నుంచి గ్రామాల్లో రికార్డులు పరిశీలించారు. బహిరంగ వేదిక నిర్వహించగా రూ.6,662 రికవరీ చేసినట్లు, రూ.6,178 జరిమానా విధించినట్లు పీడీ అమర్‌నాథ్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రామదుర్గం, కాజీపురం గ్రామాల్లో కొంతవరకు అవకతవకలు జరగగా విచారణలో వెల్లడైన మొత్తాన్ని రికవరీ చేశామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ బహిరంగ వేదిక నిర్వహించినట్లు తెలిపారు. వలసల నివారణ ధ్యేయంగా ప్రతి కూలీకీ పని కల్పించాల్సిన బాధ్యత ఉపాధి అధికారులపై ఉందన్నారు. ఎంపిడిఒ కొండయ్య, ఏపీడీ పకీరప్ప, ఎస్‌ఆర్‌పి మల్లికార్జున పాల్గొన్నారు.