ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్
సామాజిక సాధికారిత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి, సిఎం జగన్మోహన్‌రెడ్డికే సాధ్యమని డిప్యూటీ సిఎంలు నారాయణస్వామి, అంజాద్‌బాషా వెల్లడించారు. చిత్తూరు నగరంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సామాజిక సాధికారత బస్సు యాత్ర విజయవంతమైంది. గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు నగరంలోని సూర్యప్రతాప్ కళ్యాణమండపానికి చేరుకుంది. సామాజిక సాధికార యాత్రలో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రులు నారాయణస్వామి, అంజాద్ భాష, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వేణుగోపాలకష్ణ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు, విజయనగరం ఎంపీ చంద్రశేఖర్, చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు పాల్గొన్నారు. కొలుత సూరి ప్రతాప్ కళ్యాణ మండపంలో గంటపాటు చిత్తూరు నగరంలోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నగరవాసులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ క్రమంలో చిత్తూరు నగరంలో చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలను నగరవాసులు మంత్రుల దష్టికి తీసుకెళ్లారు. అనంతరం సూర్య ప్రతాప్ కళ్యాణ మండపం నుంచి స్థానిక నాగ కళాక్షేత్రం వరకు బస్సు యాత్ర సాగింది. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో చిత్తూరు ఎమ్మెల్యేగా ఆరని శ్రీనివాసులు, చిత్తూరు ఎంపీగా రెడ్డప్ప తిరిగి అభ్యర్థులుగా పోటీ చేస్తారని, తప్పకుండా వాళ్ళను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నియోజకవర్గ పరిధి నుంచి పెద్ద ఎత్తున వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
అలిగి వెళ్లిన విజయానందరెడ్డి
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం నిర్వహించిన సామాజిక సాధికారత యాత్రలో భాగంగా చిత్తూరు నగరం నాగయ్య కళాక్షేత్రం వద్ద నిర్వహించిన బహిరంగ సభ ప్రారంభానికి ముందు ఏపీఎస్‌ఆర్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంసీ విజయానందరెడ్డి సభకు హాజరు కాకుండానే తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. సభ ప్రారంభానికి ముందు విజయానందరెడ్డి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మున్సిపల్ కార్పొరేటర్లు, సభా వేదిక పైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు సమీప బంధువు, లోకేష్ విజయానందరెడ్డిని వేదిక పైకి రాకుండా అడ్డుకోవడంతో అలజడి ప్రారంభమైంది. దీంతో కోపోద్రికుడైన విజయానంద రెడ్డి, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి కార్పొరేటర్లు లోకేష్ పై చేయి చేసుకున్నారు. అనంతరం పోలీసులు వచ్చి ఇరు గ్రూపులను విడదీశారు. వేదిక పైకి అనుమతించక పోవడంతో మన స్థాపం చెందిన చెందిన విజయానంద రెడ్డి తమ అనుచరులతో సామాజిక సాధికార బస్సుయాత్ర సభ నుండి మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో చిత్తూరు నియోజకవర్గంలో వైకాపా పార్టీ నాయకుల మధ్య వర్గ విభేదాలు సామాజిక సాధికార బస్సుయాత్ర సభలో మరోసారి బయటపడ్డాయి.ఇదిలా ఉండగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రులు, నాయకులకు విలువ ఇస్తూ సామాజిక న్యాయం పాటిస్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేదిక పైకి వెళ్లకుండా కిందనే కుర్చీలో కూర్చొని కాసేపు మంత్రుల ప్రసంగాన్ని విన్నారు. అనంతరం మంత్రి రోజాతో కలిసి తిరుపతికి వెళ్లిపోయారు.










