
హిందూపురం : సామాజిక రుగ్మతలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజ సూచించారు. శనివారం స్థానిక జిల్లా జడ్జి కోర్టు ఆవరణలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్బంగా న్యాయమూర్తి మాట్లాడుతూ మహిళల విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బాలికల పాఠశాలల్లో సదస్సులను ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సహకారం అందించాలన్నారు. పని ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను తెలుసుకుని సంబంధిత అధికారుల దష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. దీనికి తోడు పనిచేసే ప్రాంతాల్లో కార్మికులకు అందుతున్న సౌకర్యాలు, పనిగంటలు, దిన కూలి తదితర అంశాలపై ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ విషయాల్లో తమ వంతు సహకారం కూడా అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యతతో మెలిగి సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు ఐకమత్యంతో కషి చేయాలన్నారు. అనంతరం జరిగిన లోక్ అదాలత్‌లో పలు కేసులను పరిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో ఏజీపీ శ్రీనివాసరెడ్డి, న్యాయవాదులు కృష్ణారెడ్డి, సుదర్శన్, నవేరా, పార్వతి, ఆంజనేయులు, నాగేంద్ర, రకీబ్, నవీన్, సుధాకర్, లోక్ అదాలత్ శారద, హేమావతి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.