Feb 12,2023 22:27

అక్షరం ఆర్ట్స్‌ రజతోత్సవ వేడుకల్లో ప్రముఖ రచయిత నూతలపాటి సాంబయ్య
ప్రజాశక్తి - ఏలూరు

            సామాజిక ప్రయోజనం లేని సాహిత్యం వ్యర్థమని ప్రముఖ రచయిత నూతలపాటి సాంబయ్య అన్నారు. అక్షరం ఆర్ట్స్‌ రజతోత్సవ వేడుకలు స్థానిక సాహిత్య మండలిలో ఆదివారం ఘనంగా జరిగాయి. దీనికి అధ్యక్షత వహించిన సాంబయ్య మాట్లాడుతూ సమాజంలోని రుగ్మతలను ప్రశ్నించేవిధంగా, రూపుమాపేవిధంగా ఉండాలని, ఆ సాహిత్యమే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుందని అన్నారు. సాహితీవల్లరి డి.రాములు రచించిన రత్నరాశులు ఆటవెలదుల ద్విశతి గ్రంథాన్ని ముఖ్యఅతిధి, రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షురాలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ సాంకేతిక విజ్ఞానం, సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగినా పుస్తక పఠనానికి ఆదరణ తగ్గదన్నారు. కవులకు, కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తెలుగు సాహిత్య అకాడమీ ద్వారా సాహిత్య, కళారంగాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ లంకా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అలతి అలతి పదాల్లో విస్తృత అర్థం వచ్చేలా వేమన వేసిన బాటలో డి.రాములు ఆటవెలది ఛందస్సులో పద్యాలు రాస్తూ శతక పద్య రచన వారసత్వాన్ని కొనసాగించడం అభినందనీయమన్నారు. కళాదిత్య డి.రాములు మాట్లాడుతూ 25 వసంతాలుగా సాహిత్య, కళా రంగాల్లో అక్షరం ఆర్ట్స్‌ కృషి చేస్తుందని, చివరి శ్వాస వరకు రచనను కొనసాగిస్తానని, తన రచనలు చదివి ఒక్కరు మారినా తన జీవితం ధన్యమైనట్లేనని అన్నారు. నాట్య గురు మేదరమెట్ల శిరీష మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతోపాటు కళల వైపు ప్రోత్సహించాలని అన్నారు. ఈ సభలో ఆలపాటి నాగేశ్వరావు, పెదపాటి రామకృష్ణ, మోతే శ్రీనివాస నారాయణరావు, విజిఎంఆర్‌.కృష్ణారావు, మజ్జి కాంతారావు ప్రసంగించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు పి.మంగరాజు ఆలపించిన అభ్యుదయ గీతాలు, శ్రీపాద శ్రీవల్లభ కూచిపూడి నాట్య నిలయం విద్యార్థినుల పుష్ప విలాపం కూచిపూడి నాట్యం అందరి హృదయాలను కదిలించింది. నాట్య గురు మేదరమెట్ల శిరీషకు అక్షరం ఆర్ట్స్‌ సంస్థ తరుపున నాట్య మయూరి బిరుదును ఇచ్చి సత్కరించారు. నాట్య బాలలు శ్రీ అక్షర, ద్యుతిశ్రీ, చిన్మయి, సుహాని, మానస మాతృమూర్తులకు అక్షరం ఆత్మీయ పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగాస్త్ర్‌, పుల్లాభొట్ల పురుషోత్తమరావు, దువ్వి హేమసుందర్‌, కస్తూరీరావు, బి.రాంబాబు, జ్యోతి, శ్రీదేవి, ఇందిర, లావణ్య పాల్గొన్నారు.