Dec 29,2022 00:00

న తొలగింపే లక్ష్యంగా రేషన్‌ కార్డుల్లోని ఐదారేళ్ల క్రితం వివరాల ఆధారంగా నోటీసులు
న లేని భూమిని చూపిస్తూ తొలగింపునకు చర్యలు
న ఆందోళన చెందుతున్న లబ్ధిదారులు
ప్రజాశక్తి- బుచ్చయ్యపేట

వెరిఫికేషన్‌ పేరుతో ప్రభుత్వం సామాజిక పింఛన్లు తొలగింపునకు సిద్ధమైంది. ఇందులో భాగంగా 40-50 సంవత్సరాల నుండి పింఛన్లు పొందుతున్న వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లు కూడా తొలగిస్తోంది. ఇందు కోసం వివిధ కారణాలతో పింఛనుదారులకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం రేషన్‌ కార్డుల్లో ఉన్న వివరాలు ఆధారంగా కాకుండా ఐదారేళ్ల క్రితం రేషన్‌ కార్డుల్లో ఉన్న వివరాలను ఆధారంగా ప్రస్తుతం పింఛన్లను తొలగిస్తున్నారు. బుచ్చయ్యపేట మండలంలోని 22 గ్రామ సచివాలయాల పరిధిలో సుమారు 200 పింఛన్లను తొలగించడానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. తమకు జీవనాధారంగా ఉన్న పింఛన్లు నిలిపివేయడంతో వీరంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కూతురు కుమారుడికి కారు ఉందని..
ఈ ఫొటోలో ఉన్న మహిళ పేరు ముచ్చకర్ల గంగమ్మ. మండలంలోని పి.భీమవరం శివారు గొన్నవానిపాలెం గ్రామానికి చెందిన గంగమ్మ భర్త 50 సంవత్సరాల క్రితం చనిపోయారు. నాటి నుండి ఆమె తన కుమార్తె ఇంటి దగ్గర ఉంటుంది. ఎన్నోఏళ్లుగా పింఛను పొందుతోంది. గంగమ్మ కుమార్తె కుమారుడైన (గంగమ్మ మనవడు) సెలపురెడ్డి భాస్కర్‌ శివకుమార్‌ గతంలో వీరితో కలిసి రేషన్‌ కార్డులో ఉండేవాడు. శివకుమార్‌కు వివాహం కావడంతో ఉమ్మడి రేషన్‌ కార్డు నుండి వేరుపడి, భార్య పిల్లలతో ఐదేళ్ల క్రితం వేరే రేషన్‌ కార్డును పొందాడు. ప్రస్తుతం గంగమ్మ, ఆమె కుమార్తెకు కలిపి రేషన్‌ కార్డు ఉంది. గంగమ్మ మనవడు విశాఖపట్నం వెళ్లి కారు కొనుక్కున్నాడు. ప్రస్తుతం వెరిఫికేషన్‌లో భాగంగా గంగమ్మకు కారు ఉందంటూ మూడు నెలలుగా పింఛను నిలిపివేశారు. దీంతో ఆమె నాటి నుండి పి.భీమవరం సచివాలయం, మండల కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. తనకు కారు లేదని మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోలేదని గంగమ్మ వాపోయింది.
లేని భూమి చూపించి...
ఈ ఫొటోలో ఉన్న మహిళ పేరు గోగుల సత్యవతి. రాజాం గ్రామానికి చెందిన సత్యవతి భర్త సత్యారావు మూడు సంవత్సరాల క్రితం చనిపోవడంతో ఆమెకు వితంతు పింఛను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పుడు వెరిఫికేషన్‌లో సత్యవతికి 10 ఎకరాల భూమి ఉందని చూపించి పింఛను నిలిపివేస్తూ నోటీసు జారీ చేశారు. రాజాం రెవెన్యూ పరిధిలో సత్యవతి భర్త పేరుతో మూడు ఎకరాల భూమి ఉంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త పేరుతో ఉన్న భూమి కుమారుల పేరున ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి ప్రయత్నాలు చేస్తుండగా, ఇంతలోనే పింఛన్‌ నిలిపి వేశారు. రికార్డుల్లో ఉన్న ప్రకారం 10 ఎకరాల భూమి ఉంటే తనకు అప్పగించాలని సత్యవతి కోరుతోంది.
దిబ్బిడి గ్రామంలో 85 సంవత్సరాల వృద్ధురాలకు పింఛను నిలిచిపోవడంతో సచివాలయానికి వెళ్లి ఆరా తీయగా, ఆమెకు భూమి ఉందని చెప్పడంతో ఆశ్చర్యపోయింది. గతంలో ఈమెతో పాటు కొడుకు, కోడలు, మనుమడు ఒకే రేషన్‌ కార్డులో ఉండేవారు. మనవడికి వివాహం కావడంతో ఈ కార్డు నుండి వేరుపడి నాలుగేళ్ల క్రితం వేరే రేషన్‌ కార్డు పొందాడు. మనవడు భార్యకు పుట్టింటి వారు రెండు ఎకరాల భూమి రాశారు. ఆ భూమితో కలిపి నాలుగు ఎకరాలకు పైగా భూమి ఉందంటూ పింఛను నిలిపివేస్తూ నోటీసులు జారీ చేశారు. మండలంలోని రాజాం గ్రామంలో-6, కందిపూడిలో సచివాలయ పరిధిలో 6 నిలిపివేశారు. ఇలా ప్రతి సచివాలయ పరిధిలోనూ పింఛన్లను నిలిపివేస్తూ నోటీసులను జారీ చేశారు. పింఛన్ల సంఖ్య తగ్గించుకునే లక్ష్యంతోనే పాత కార్డుల్లో ఉన్న వివరాల ఆధారంగా పింఛనుదారులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమకు జీవనాధారంగా ఉన్న పింఛన్లు నిలిపివేయడంతో వీరంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పింఛన్లు తొలగిస్తే తాము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. నోటీసులో వివరాలకు, వాస్తవ వివరాలకు సంబంధం లేకుండా పింఛన్లు నిలిపివేయడం పట్ల పింఛనుదారులు మండిపడుతున్నారు.