Sep 23,2023 21:45

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న నాయకులు

సామాజిక న్యాయంపై మహాపోరు : కేవీపీఎస్‌
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
సామాజిక న్యాయం కోసం కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి తలపెడుతున్న మహాపోరులో ప్రజలు స్వచ్చందంగా పాలు పంచుకోవాలని కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణాచలం పిలుపునిచ్చారు. ఈ నెల 29న కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌ లో తలపెట్టనున్న మహా ధర్నా కార్యమాన్ని జయప్రదం చేయాలంటూ స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌ లో శనివారం కరపత్రాలను, గోడపత్రికలను ఆవిష్కరించారు. ముఖ్య అతిధిగా హాజరైన అరుణాచలం మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు పూర్తయినా నిమ్న కులాల వారు అర్థ స్వాతంత్ర జీవితాలే గడుపుతున్నారని వాపోయారు. ఎస్సీ, ఎస్టీల ఎదుగుదలకు కేటాయిస్తున్న సబ్‌ ప్లాన్‌ నిధులు పక్కదారి పడుతున్నాయని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీల అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చే 41 సిఆర్పిసిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. జస్టిస్‌ పున్నయ్య కమీషన్‌ సిఫార్సులు అమలు చేయాలని సూచించారు. మిగులు భూములు పేదలకు పంచాలన్నారు. డప్పు, చర్మ కారుల పెన్షన్‌ రూ.5 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. కాటికాపరులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వందవాసి నాగరాజు, కేవీపీఎస్‌ గౌరవాధ్యక్షుడు అంగేరి పుల్లయ్య, జిల్లా అధ్యక్షుడు మునిరామయ్య, శీను, సెల్వరాజు, రెడ్డిపల్లి సురేష్‌, గంధం మణి, పెనగడం గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న నాయకులు