Sep 23,2023 21:21

వాల్‌ పోస్టర్లు ఆవిష్కరిస్తున్న కెవిపిఎస్‌, వ్య.కా.స నాయకులు

కడప అర్బన్‌ : ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని పటిష్టంగా అమలు, జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫార్సులు అమలు, అసైన్డ్‌ చట్ట సవరణ ఉపసంహరించు కోవాలని ఈ నెల 29న విజయవాడలో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం అంబేద్కర్‌ భవన్‌లో వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయ కులు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో పరిపాలన అధ్వాన్నంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల హక్కులు ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని విమ ర్శించారు. అనేక సంవత్సరాలుగా దళితులు సామాజికన్యాయం కోసం రోడ్డెక్కు తున్న వారికి న్యాయం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక అసమా నతలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో దాదాపు 45 సంఘాలు కలిసికట్టుగా ఏర్పడి దళితుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నాయని తెలి పారు. దళిత గిరిజనులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ను 300 యూనిట్లకు పెంచాలని పేర్కొన్నారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. డప్పుచర్మకారుల పెన్షన్‌ రూ.5 వేలకు పెంచాలని పేర్కొన్నారు. శ్మశానంలో పనిచేస్తున్న కార్మికులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని తెలిపారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సామాజిక న్యాయం చేశామంటూ వైసిపి, టిడిపి చెప్పుకుంటున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయానికి పాత్ర వేసింది అనడానికి మణిపూర్‌ ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. బయటి ప్రపంచానికి తెలియకుండా అనిచి పెట్టిందని తెలిపారు. మణిపూర్‌ ఘటనపై స్పందించని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలకు వెంటనే స్పందించారని పేర్కొన్నారు. మణిపూర్‌ ఘటనపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. దళిత చట్టాలను నీరు కారుస్తున్నారని విమ ర్శించారు. రాష్ట్రంలో బిజెపికి సంపూర్ణ బలం చేకూరుతుందని పేర్కొన్నారు. దీనికి కారణం వైసిపి, టిడిపి, జనసేన కేంద్రంలోని బిజెపిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడమేనన్నారు. బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే సావర్కర్‌ జయంతి రోజున మను సిద్ధాంతాన్ని అమలు చేయడానికి సన్నద్ధమవుతుందని హెచ్చరిం చారు. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభానికి రాష్ట్రపతిని పిలవకపోవడం వివక్షతన్నారు. జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. దళితుల చేతిలో భూమిలేదని, పెత్తందార్లు ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అసైన్డ్‌ చట్టాన్ని సవరించి భూస్వాములకు మేలు చేస్తుందని విమర్శించారు. హక్కుల సాధన కోసం నిర్వహించే పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కెవిపిఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డి.సి.వెంకటయ్య, రామయ్య, చిన్నబి, నారాయణ, శ్రీకాంత్‌, చంద్ర, నక్క నారాయణ పాల్గొన్నారు.