Oct 31,2021 07:04

    భూమితో చెలిమి చేస్తూ.. నాగలిని శిలువలా మోసే రైతన్నకు భయం... పంట కోసం చేసిన అప్పులెలా తీర్చాలో తెలియక. డిగ్రీ చేతపట్టుకొని ఉద్యోగ ప్రయత్నం చేస్తోన్న యువకుడికి భయం... తనకు ఉద్యోగం వస్తుందో... రాదో తెలియక. పంట పొలాల్లో మొలుచుకొస్తున్న భవంతులను చూసి వ్యవసాయ కార్మికునికి భయం... రేపు తన పరిస్థితి ఏమిటా అని. పనికోసం రోజూ నాలుగురోడ్ల కూడలిలో నిల్చునే కార్మికుడికి భయం... ఇవాళ పని దొరుకుతుందో లేదోనని. అర్ధంకాని ఆన్‌లైన్‌ చదువులతో సతమతమౌతున్న విద్యార్థులకు భయం... రేపటి తన భవిష్యత్‌ను తలచుకొని. గర్భం దాల్చిన మహిళకు భయం... కడుపులో వున్నది ఆడబిడ్డని తెలిస్తే ఎక్కడ హతమార్చుతారోనని. పట్టపగలైనా రోడ్డుపై నడవాలంటే యువతికి భయం... ఎటు నుంచి ఏ అఘాయిత్యం జరుగుతుందోనని. ఈ భయాల బరువు మోయలేక... భవితపై భరోసా పొందలేక... జీవితాలను అర్థాంతరంగా ముగించేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. భయంతోనో, ఒత్తిడితోనో, ఆందోళనతోనో, పీడితుడిగానో చేసుకునే ఆత్మహత్యలన్నీ 'సామాజిక హత్య'లే అంటాడు ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌. 'సామాజిక హత్యల'నే పదాన్ని 1845లో 'ది కండిషన్‌ ఆఫ్‌ ది వర్కింగ్‌-క్లాస్‌ ఇన్‌ ఇంగ్లాండ్‌' గ్రంథంలో ఆయన ఉపయోగించాడు. 'ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో/ ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో/ ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో/ సంసారపు గోడల మధ్య / ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదో/ ...ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ,/ కార్యాలలోకీ నీచే నడపబడుతుందో/ ఆ స్వేచ్ఛా స్వర్గానికి,/ తండ్రీ... నా దేశాన్ని మేల్కొలుపు'- అన్న విశ్వకవి వ్యాఖ్యలు ఈ భయానక పరిస్థితులకు అద్దం పడతాయి.
      సామాజికంగా, రాజకీయంగా ఆధిపత్యం వహించే దోపిడీ వర్గం వందలాది శ్రామికులను తన ఉక్కు పిడికిలిలో బిగించి నుజ్జునుజ్జు చేస్తోంది. పెరుగుతున్న అణచివేత, వేధింపులు, ఒత్తిళ్ల నడుమ జరుగుతున్న ఆత్మహత్యలన్నీ సామాజిక హత్యలే. సరళీకరణ ఆర్థిక విధానాల పేరుతో కార్పొరేట్లకు వనరులన్నీ కట్టబెడుతున్న తరుణంలో 2017 నుంచీ అన్ని రంగాల్లోనూ ఆత్మహత్యలు పెరుగుతుండటం ఆందోళనకరం. ఈ ప్రభుత్వాలు కార్పొరేట్ల చేతిలో కీలుబొమ్మగా మారాయి. దానికి నిదర్శనమే ఎన్‌సీఆర్‌బీ తాజా వార్షిక నివేదిక. దేశంలో 2017లో మొత్తం 1,29,887 మంది ఆత్మహత్యలు చేసుకుంటే... 2020 నాటికి ఆ సంఖ్య 1,53,052 కి పెరిగింది. ఇందులో ఒక్క వ్యవసాయ రంగానికి చెందిన వారే 10,677 మంది వున్నారు. వీరేకాకుండా రోజు వారీ కూలీలు, గృహిణులు, స్వయం ఉపాధిపై ఆధారపడిన వారు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు... ఆత్మహత్య చేసుకున్న వారిలో ఉన్నారు. దుర్భర పరిస్థితిని పదేపదే తలచుకొని, నిస్సహాయస్థితిలో ఆత్మహత్యలకు పాల్పడు తుంటారు. అప్పులబాధ, నిరుద్యోగం, తీవ్ర సామాజిక వివక్ష వంటి కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారే అత్యధి కులు. ఇవి వ్యవస్థకు, పరిపాలనకు సంబంధించిన పర్యవసా నాలు కనుక ఆత్మహత్య అనేది కేవలం వ్యక్తిగతమైన వ్యవహారం కాదు. వేళ్లూనుకుపోయిన సామాజిక సమస్యగా చూడాలి.
     'ఏ అకాల మరణానికైనా రాజుదే బాధ్యత' అని పురాణాలు చెబుతాయి. దీన్ని ప్రస్తుతానికి అన్వయించి చూస్తే బోనులో నిలబడవలసింది ప్రభుత్వాలే. ఆత్మహత్యలన్నీ నిస్సహాయ చర్యలు కావు. వ్యక్తిగత బలహీనతలకు అద్దం పట్టేవీ కావు. నిజానికివి ఆత్మహత్యలు కావు... సామాజిక హత్యలు. వాటికి ప్రధాన బాధ్యత ప్రభుత్వాలదే. అందుకే ప్రతి బలవన్మరణమూ సమాజంవైపే వేలెత్తి చూపిస్తున్నది. 'మనసు కాస్త కలతపడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు/ కనుల నీరు తుడుచువారు ఎవరూ లేరని చితి ఒడికి చేరకు/ ప్రాణమన్నది బంగారు పెన్నిధి నూరేళ్లు నిండుగా జీవించమన్నది/ వేటాడువేళలో పోరాడమన్నది' అంటాడు సినీ కవి సీతారామశాస్త్రి. కాలమెంత కాటేస్తున్నా... కూలిపోదు వేరు వున్న చెట్టేదీన్నూ. తనువే మోడైనా చెట్టు కంటే... మనిషి జన్మ ఉత్తమం. అందుకే... నిస్సహాయతతో కూలిపోకు... ఎదిరించి పోరాడు..!