Sep 28,2023 23:25

ప్రజాశక్తి-విజయవాడ: విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం ప్రాంగణంలో అధికార భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.విజయబాబు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్‌, ఇతర సాహితీ ప్రముఖులు హాజరై గుఱ్ఱం జాషువా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ జాషువా సాహిత్యం అజరామరం అని అన్నారు. జాషువా ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందారన్నారు. జాషువాలోని గొప్పతనం ఏమిటంటే తను ఎన్ని అవమానాలకు గురియైనా ఏనాడు దురాగ్రహం ప్రదర్శించలేదని అన్నారు. అక్షరాస్త్రాలతో ధర్మాగ్రహాన్ని ప్రదర్శించి జాషువాకు సాటి వేరెవరూ లేరని నిరూపించుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం గుఱ్ఱం జాషువా స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగానే పనిచేస్తుందని తెలిపారు. విద్యార్ధులంతా ఆయన్ని స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, అధికార భాషా సంఘం సభ్యులు ఆచార్య గాజుల రామచంద్రా రెడ్డి , యస్‌.సి. కమీషన్‌ అధ్యక్షులు విక్టర్‌ ప్రసాద్‌ , రాష్ట్ర యస్‌.సి. సెల్‌ ప్రెసిడెంట్‌ బూదాల శ్రీను, పలువురు సాహితీవేత్తలు ,ఇతర దళిత నాయకులు పాల్గొన్నారు. నందిగామ: అణగారిన వర్గాల చైతన్యం కోసం జాషువా రచనలు అని నందిగామ ఎంఎల్‌ఎ మొండితోక జగన్‌ మోహన్‌ రావు, ఎంఎల్సి మొండితోక అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. గాంధీ సెంటర్‌లో గుర్రం జాషువా 128వ జయంతి మహోత్సవాలను స్నేహ క్లబ్‌ - గుర్రం జాషువా కళావేదిక - దళిత చైతన్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ నవ సమాజంలో అణగారిన వర్గాలు ఏ విధంగా చైతన్యం కావాలో తెలిపిన వ్యక్తి గుర్రం జాషువా అన్నారు. జాషువా తెలుగు పద్యాన్ని ఆయుధంగా మలుచుకుని శాస్త్రీయ, హేతుబద్ధమైన ఆలోచనలతో కులవివక్ష, అస్పశ్యతపై యుద్ధం చేశారని తెలిపారు. సాంఘిక దురాచారాలపై గుర్రం జాషువా అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. సమాజంలోని అంతరాలను దూరం చేసేందుకు ఆయన కషి చేశారని కొనియాడారు. అనంతరం పలువురు కవులు, కళాకారులను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు. కాకాని నగర్‌లో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో గుర్రం జాషువా జయంతి వేడుకలు నిర్వహించారు. కంచికచర్ల: మండల పరిషత్‌ కార్యాలయంలో బహుజన రచయితల వేదిక కవి, రచయిత తంగిరాల సోని ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ప్రముఖ రంగస్థల కళాకారుల కట్టా అంథోని, కర్ల రవికుమార్‌, తంగిరాల ప్రసాద్‌, నండ్రు వీరయ్య, కొలుకులపల్లి లక్ష్మీనారాయణ, వెల్లంకి భవాని శంకర్‌ ప్రసాద్‌, మెండు రఫాయాలు, అప్పిలి మురళీకృష్ణ శాస్త్రి, కడియం శివాజీరావు, చక్రాల నరసింహారావులకు జాతీయ కళాకారులు పురస్కారంతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పిల్లి స్వామిదాసు, వర్మ, బెజ్జం భూషణం, పుల్లారావు, తదితరులు పాల్గొన్నారు.