ప్రజాశక్తి-విజయనగరం : రైతులు, చిరు వ్యాపారులు, చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకులకు చేదోడుగా ఉంటూ సామాజిక భద్రత కల్పించేలా రుణ మంజూరు ప్రక్రియ ఉండాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. జిల్లా త్రైమాసిక బ్యాంకర్ల సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. రుణ మంజూరు ప్రక్రియ, సామాజిక భద్రత పథకాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, పరిశ్రమల స్థాపనకు బ్యాంకర్ల తోడ్పాటు, ముద్ర, పిఎంజివై, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో భాగంగా గత త్రైమాసికంలో తీసుకున్న నిర్ణయాలు, అమలు ప్రక్రియ గురించి ఎల్‌డిఎం శ్రీనివాసరావు వివరించారు. రుణ మంజూరు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావించారు.
కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ రుణ మంజూరు ప్రక్రియను సులభతర రీతిలో నిర్వహించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తుల తిరస్కరణకు గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలని, సంబంధిత నివేదికను అందజేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. సిసిఆర్ కార్డులున్న కౌలు రైతులకు ప్రోత్సాహకర రీతిలో రుణాలు మంజూరు చేయాలని సూచించారు. ఇటీవల రాజాంలో జరిగిన సంఘటనను పరి గణనలోకి తీసుకొని స్వయం సహాయక సంఘాల సభ్యులకు చెందిన నగదును వారి ఖాతాల్లో మాత్రమే జమ చేయాలని, టీం లీడర్ ఖాతాలో జమ చేయవద్దని ఆదేశించారు.
రూ.1.97 లక్షల చెక్కును అందించిన కెనరా బ్యాంకు
స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఎసిలు ఏర్పాటు చేసే నిమిత్తం సిఎస్‌ఆర్ కింద కెనరా బ్యాంకు యాజమాన్యం రూ.1,97,390 విలువైన చెక్కును జిల్లా కలెక్టర్‌కు అందజేసింది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఆ చెక్కును అందజేయాలని ఎల్‌డిఎంకు కలెక్టర్ సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ ఎల్‌డిఎం ప్రత్యూష, మెప్మా పీడీ సుధాకర్‌రావు, సెంట్రల్ బ్యాంకు సిఇఒ జనార్దనరావు, ఫిషరీస్ డిడి నిర్మలకుమారి, ఎపిడి సావిత్రి, వ్యవసాయ శాఖ ఎడి అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.










