Sep 16,2023 21:26

కమ్యూనిటీ హల్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బడ్డుకొండ

ప్రజాశక్తి - పూసపాటిరేగ : పరిశ్రమలన్నింటికీ సామాజిక బాధ్యత ఉండాలని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. శనివారం మండలంలోని చింతపల్లిలో అరబిందో పరిశ్రమ రూ. 80లక్షలతో నిర్మించిన బహుళ ప్రయోజన కమ్యూనిటీ హాల్‌ను అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ సంస్థ డైరెక్టర్‌ నిత్యానంద రెడ్డితో కలిసి ప్రారంభించారు. గ్రామంలో ఆర్‌ఒ ప్లాంట్‌, సోలార్‌ ప్లాంట్‌, ఎల్‌ఇడి వీధి దీపాలను మంజూరు చేయగా, ఆక్సిస్‌ క్లినికల్‌ లిమిటెడ్‌ రూ. 10లక్షలతో దీనిని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంస్థ డైరెక్టర్‌ నిత్యానంద రెడ్డి కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సుబులిటీలో భాగంగా మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. వీటి వల్ల మండలంలో ఉన్న గ్రామాలకు ఎంతో ఉపయోగం ఉందన్నారు. అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ చేస్తున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ ప్రతి గ్రామంలో ప్రజలు వినియోగించు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బర్రి ముసలి, మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షులు బర్రి చిన్నప్పన్న, నాయకులు మహంతి శ్రీనివాసరావు, మహంతి జనార్దన్‌ రావు, ఎంపిటిసి ఎం. తాత, అరబిందో ఫార్మా ప్రతినిధులు, శ్రేయాస్‌ ఫార్మా ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.