ప్రజాశక్తి - గుంటూరు లీగల్ : గుంటూరు బార్ అసోసియేషన్‌లో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. సామాజిక పరిస్థితులను ఆకళింపు చేసుకున్న అంబేద్కర్ సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేలా రాజ్యాంగాన్ని రాశారని చెప్పారు. న్యాయ రంగంలో ఉన్న మనం అంబేద్కర్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడానికి మంచి అవకాశం ఉందని అన్నారు. అంబేద్కర్ ప్రసాదించిన ఓటు హక్కును మనం ఎలా వినియోగించుకుంటున్నామో ఎవరికి వారే ప్రశ్నించుకోవాలని సూచించారు. న్యాయం కోసం వచ్చిన వారికి సత్వర న్యాయం అందించాలని కోరారు. అనంతరం జిల్లా ఇన్‌ఛార్జి న్యాయమూర్తి విఎఎల్ సత్యవతి, ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి జి.రామ్‌గోపాల్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు జి.శాంతకుమార్ మాట్లాడారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కెవికె సురేష్‌కుమార్, ఉపాధ్యక్షులు దాసరి ఉమామహేశ్వరరావు, కార్యదర్శి వంశీకృష్ణ, కోశాధికారి విజయరాజకుమార్, కార్యవర్గ సభ్యులు పారి బాబు, ఇతర సభ్యులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.










