ప్రజాశక్తి-అనకాపల్లి
సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడటమే గుంటూరు బాపనయ్యకు అందించే నిజమైన నివాళి అని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె లోకనాథం అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం కామ్రేడ్ గుంటూరు బాపనయ్య 45వ వర్ధంతి సభ జరిగింది. ముందుగా ఆయన చిత్రపటానికి పార్టీ సీనియర్ నాయకులు ఏ బాలకృష్ణతో కలిసి లోకనాథం పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన బాపనయ్య చిన్ననాడే కుల వివక్షతకు గురయ్యారని గుర్తు చేశారు. విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితులై తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారన్నారు. పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించిన ఆయన ఐదేళ్లు జైలు జీవితం కూడా గడిపారని గుర్తు చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా, మూడుసార్లు శాసనసభ్యులుగా, ఒకసారి శాసనమండలి సభ్యునిగా పనిచేశారని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ కార్మిక ఉద్యమ నిర్మాణానికి శాయశక్తులా కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆర్. శంకర్రావు, గనిశెట్టి సత్యనారాయణ, గంట శ్రీరామ్, నాయకులు కే ఈశ్వరరావు, సిహెచ్ శివాజీ, చలపతి, రాజు తదితరులు పాల్గొన్నారు.a










