ప్రజాశక్తి -ములగాడ : సమాజంలోని సమస్యలు, వాటి పరిష్కారాల పట్ల నర్సులు అవగాహనను కలిగి ఉండాలని జాతీయ సేవా పథకం జిల్లా ప్రోగ్రాం అధికారి ఇపిఎస్.భాగ్యలక్ష్మి అన్నారు. మల్కాపురంలోని సెయింట్ ఆన్స్ నర్సింగ్ కళాశాలలో బిఎస్‌సి ద్వితీయ సంవత్సరం నర్సింగ్ విద్యార్థినులు ''సామాజిక సమస్యలు- పరిష్కారాలు'' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. సమాజం పట్ల అవగాహన లేనిదే నర్సులు వ్యాధిగ్రస్తుల జీవితాల్లో వెలుగులు నింపలేరని అభిప్రాయపడ్డారు. సమాజంలోని ఆచార సంప్రదాయాలను, మూఢనమ్మకాలను, ఆహారపు అలవాట్లను, అక్షరాస్యత శాతాన్ని, జనాభాను, కులమత భావాలను బట్టే ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని తెలిపారు. అనంతరం నర్సింగ్ విద్యార్థినులు వరకట్నం, జనాభా సమస్య, కుటుంబపు హింస, మద్యపానం, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, వృద్ధులు వికలాంగులు, కౌమార బాలలు సమస్యలు, లైంగిక వివక్ష తదితర అంశాలపై అధ్యయన పత్రాలను సమర్పించి, తమ భావాలను తెలియజేశారు. సదస్సులో పాల్గొన్న విద్యార్థినులను నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ జాయిస్ మేరీ అభినందించారు.










