Sep 24,2023 21:45

సామాజిక అడవులకు కాసుల కష్టం

సామాజిక అడవుల పెంపకం ప్రశ్నార్థకంగా మారింది. రెండేళ్లుగా సోషల్‌ ఫారెస్ట్‌ నిధుల కేటాయింపులకు కత్తెర పడింది. ఫలితంగా నర్సరీల నిర్వహణ మొదలుకుని మొక్కల పెంపకం, పంపిణీ ప్రక్రియ భారంగా మారింది. మొక్కల పెంపకం ద్వారా జిల్లాను సస్యశ్యామలంగా మార్చాలనే ఆశయం ప్రభుత్వ ప్రాధామ్యాల్లో కొట్టుకుపోతోంది. ప్రభుత్వం సోషల్‌ ఫారెస్టు నిర్వహణపై దృష్టి సారించకపోవడంతో సామాజిక అడవుల పెంపకం సుడిగుండాలను ఎదుర్కొంటోంది.ప్రజాశక్తి - కడప ప్రతినిధి
జిల్లాలో సామాజిక అడవుల పురోగతికి గ్రహణం పట్టింది. కడప సోషల్‌ ఫారెస్ట్‌ డివిజన్‌ పరిధిలో తొమ్మిది నర్సరీలు ఉన్నాయి. ప్రతి ఏటా సుమారు ఎనిమిది లక్షల మొక్కలను పెంచి, ప్రభుత్వ కార్యాలయాలు, ఆయా పంచాయతీల్లోని బంజరు, పడావు, ఇతర అనుబంధ భూముల్లో పెద్దఎత్తున మొక్కలను నాటడం పరిపాటి. ప్రభుత్వం ఏటా రూ.30 లక్షల చొప్పున నిధులు కేటాయించేది. రెండేళ్లుగా సోషల్‌ ఫారెస్ట్‌కు కేటాయింపులను నిలిపేసింది. నిధుల విడుదలకు సంబంధించిన బిల్లులను ఆన్‌ లైన్‌ చేయాల్సి రావడం, చెల్లింపులకు నెలల తరబడి సమయం తీసుకుంటున్న వైనం భారంగా మారింది. క్వార్టర్లీ నిధులను విడుదల చేసేది. ఫలితంగా నర్సరీల నిర్వహణకు అవకాశం లభించేది. ప్రభుత్వ ప్రాధామ్యాల నేపథ్యంలో నర్సరీ బిల్లుల చెల్లింపులు ఆలస్యం కావడంతో నర్సరీల నిర్వహణలో రోజువారీ కూలీలకు నిధుల చెల్లింపుల సమస్య ఎదురవుతోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో సోషల్‌ఫారెస్ట్‌ ఉపాధి హామీ నిధులపై దృష్టి సారించింది. ఉపాధి హామీ నిధులు వారం రోజుల వ్యవధిలో కూలీల ఖాతాల్లో జమ పడుతున్న నేపథ్యంలో నర్సరీల నిర్వహణ మొక్కుబడిగా సాగుతోంది.
5.45 లక్షల మొక్కలే!
నర్సరీల నిర్వహణకు నిధుల సమస్యం వెంటాడుతోంది. ప్రభుత్వం రెండేళ్ల కిందటి వరకు ఏటా సుమారు రూ.30 లక్షలు కేటాయింపులు చేయడం తెలిసిందే. రెండేళ్ల నుంచి ఒక్క పైసా నిధులు కేటాయింపులు చేయకపోవడంతో నర్సరీల నిర్వహణకు భారంగా మారింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో సోషల్‌ ఫారెస్ట్‌ మొక్కల పెంపకాన్ని కత్తిరించింది. ఏటా సుమారు ఎనిమిది లక్షల మొక్కలను పెంపకం నుంచి 5.45 లక్షల మొక్కల పెంపకానికి పరిమితం చేసింది. ఫలితంగా జిల్లా పచ్చదనం పెంపకం తగ్గడంతో వాతావరణ కాలుష్యంపై తీవ్ర ప్రభావంపడే అవకాశం కనిపించే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.
ఎర్రచందనం పెంపకం హుళక్కే!
ప్రతి ఏటా సోషల్‌ ఫారెస్ట్‌ పరిమితంగా ఎర్రచందనం మొక్కల పెంపకాన్ని చేపట్టేది. మార్చి, ఏప్రిల్‌ మాసాల నుంచి ఎర్రచందనం మొక్కల పెంపకంపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంది. ఎర్రచందనం మొక్కల నర్సరీల నిర్వహణకు ప్రత్యేకంగా బెడ్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రత్యేక బెడ్ల నిర్వహణకు మోస్తరుగా వ్యయం చేయాల్సి ఉంటుంది. మార్చి నుంచి ఆగస్టు నాటికి ఎర్ర చందనం మొక్కల పెంపకం కొలిక్కి వచ్చేది. ప్రభుత్వం రెండేళ్లుగా నిధులు విడుదల చేయని నేపథ్యంలో ఎర్రచందనం మొక్కల పెంపకానికి నిధుల సమస్య తలెత్తడంతో గాలికి వదిలేయడం ఆందోళన కలిగిస్తోంది.