ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల వేగం పెంచేందుకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో సమీక్షలు చేయాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు మంత్రి ధర్మాన ప్రసాదరావు బుధవారం సమీక్షలకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గాల వారీగా సంబంధిత ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, నియోజకవర్గానికి చెందిన అధికారులతో సమీక్షించాలనే ఆదేశాల మేరకు తొలి విడత మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాలపై కలెక్టరేట్‌లోని డిఆర్‌సి హాలులో బుధవారం సమీక్షించారు. సమావేశానికి జిల్లా స్థాయి అధికారులతో పాటు మండల స్థాయిలో అధికారులూ హాజరయ్యారు. మున్సిపల్, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, రెవెన్యూ, విద్యుత్, దేవాదాయ తదితర శాఖల వారీగా అభివృద్ది పనుల పురోగతిపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేేశారు.
మంత్రి మాట్లాడుతూ పనులు నిర్దేశిత సమయంలో పూర్తయ్యేలా సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులంతా క్షేత్రస్థాయి అధికారులను నిత్యం పర్యవేక్షించాలని చెప్పారు. అధికారులు చేయడం ఒకెత్తయితే సిబ్బందితో పని చేయించడం వారి పనితనానికి గీటురాయి అని అన్నారు. పని పూర్తికావడానికి ఉన్న అడ్డంకులను తొలగించుకోవాలేగాని తప్పించుకోవడానికి ప్రయత్నించొద్దన్నారు. జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన అంశాలను పరిగణలోకి పనులు వేగిరపర్చాలన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో అదనపు సిబ్బందిని నియమించడానికి అనుమతి, తాడేపల్లి వద్ద బకింహామ్ కెనాల్‌కు పరిపాలన అనుమతులు, పెదవడ్లపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు పెండింగ్‌లో వున్న నిధులు మంజూరు అంశాలను ప్రస్తావించారు. మంగళగిరి కొప్పురావు కాలనీ, ఆంజనేయ కాలనీ, లక్ష్మీనరసింహారావు కాలనీల్లో ఇళ్ల పట్టాలు మంజూరు చేశారని, వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్ ప్రాసెస్ కావడం లేదని, సాంకేతిక సమస్యను పరిష్కరించాలని కోరారు. తాడేపల్లిలోని శ్మశాన వాటికకు స్థలం మంజూరు చేయాలని, సర్వే పోస్టులు రెండు అదనంగా కేటాయించాలని కోరారు. దుగ్గిరాల మండలంలో 47 అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ. 50 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కోరారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారీ వెంకట రోశయ్య మాట్లాడుతూ పని చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాలేదన్నారు. సచివాలయం పరిధిలో జరిగే అభివృద్ధి పనులకు బిల్లులు సకాలంలో అప్లోడ్ చేయడం లేదన్నారు. ఆర్ అండ్ బి రోడ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించాలని కోరారు. చేబ్రోలు మండలంలోని శేకూరుపాలెంలోని శ్మశాన వాటిక విస్తరణకు, పొన్నూరులో ఆటో నగర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. తహశీల్దార్ కార్యాలయం మార్పుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డిఆర్‌ఒ కె.చంద్రశేఖరరావు, జెడ్‌పి సిఇఒ మోహన్‌రావు, డిఆర్‌డిఎ, డ్వామా, గృహ నిర్మాణ శాఖ పీడీలు హరిహరనాథ్, యుగంధర్ కుమార్, వేణుగోపాల్, డిపిఒ కేశవరెడ్డి, సిపిఒ శేషశ్రీ పాల్గొన్నారు.










