Jul 24,2023 21:18

టమోటా ప్రాసెసింగ్‌ సెంటర్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ గిరీష

బి.కొత్తకోట : తంబళ్లపల్లె నియోజకవర్గంలోని రైతుల కల సాకారం కానుంది. మండలంలోని తుమ్మనగుట్ట గ్రామంలో మొట్టమొదటిసారిగా రూ.5.50 కోట్లతో ఏర్పాటు చేసిన టమోటా ప్రైమరీ ప్రాసెసింగ్‌ సెంటర్‌ను మంగళవారం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో ప్రారంభిం చనున్నట్లు కలెక్టర్‌ గిరీష పేర్కోన్నారు. సోమవారం ఎంపిడిఒ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్చువల్‌ విధానంలో ప్రారంభించే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ఎపి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ గ్రీన్‌లీఫ్‌ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని 1002 మంది రైతులతో పిపిసి ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ పిపిసిలో అన్ని రకాల వెజిటేబుల్స్‌ను ఇక్కడే ప్రాసెసింగ్‌ చేస్తారన్నారు. 25 మందికి నేరుగా ఉపాధి అవకాశం కలుగుతుందన్నారు. ఈ పిపిసి ఎఫ్‌పిఒ ద్వారా రైతులకు నేరుగా ఇన్‌ఫుట్‌, మార్కెటింగ్‌ ఇంటర్వెన్షన్స్‌ చేయడం తోపాటు మంచిగా ప్రాసెసింగ్‌ చేసిన వెజిటబుల్స్‌ను రవాణా చేసేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ప్రతి రైతుకు ప్రాసెసింగ్‌ విధానం, యంత్రాల గురించి శిక్షణ ఇస్తామని తెలిపారు. యూనిట్‌ ప్రెసిడెంట్‌, సిఇఒ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. జిల్లాలో ఇంకా అదనంగా మొలకలచెరువు, రామసముద్రంలలో రెండు చోట్ల ప్రైమరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు మంజూరయ్యాయన్నారు. అవి కూడా పనులు పురోగతిలో ఉన్నాయని, రెండు. మూడు నెలల్లో వాటిని ప్రారంభించడానికి వేగవంతంగా పనులు జరుగుతున్నాయని వివరించారు. అనంతరం అధికారులలో కలిసి మండలంలోని తుమ్మనగుట్టలో ఏర్పాటు చేసిన టమోటా ప్రైమరీ ప్రాసెసింగ్‌ సెంటర్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. 7000 చదరపు గజాల విస్తీర్ణంలో రూ.5.50కోట్లు ఖర్చుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి రాయితీతో ప్రాసెసిగ్‌ యూనిట్‌ మంజూరైందన్నారు. ఎపి ఫుడ్‌ ప్రాససింగ్‌ సొసైటీ సహకారంతో గోదావరి రైతు ఉత్పత్తి దారుల సంస్థ ద్వారా 1002 మంది ఎఫ్‌పిఒ సభ్యులు ఇందులో ఉన్నట్లు అధికారులు, రైతులు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం ప్రాసెసింగ్‌ యూనిట్‌ పనితీరును, గ్రేడింగ్‌, ప్యాకింగ్‌, కోల్డ్‌ స్టోరేజ్‌ విభాగాలను కలెక్టర్‌ పరిశీలించారు. ప్రాసెసింగ్‌ యూనిట్‌ ట్రైనింగ్‌ ఎక్కడ తీసుకున్నారని కలెక్టర్‌ రైతులను ప్రశ్నించగా కోయంబత్తూర్‌, ఊటీ ట్రైనింగ్‌ వెళ్లి వచ్చినట్లు వారు వివరించారు. కార్యక్రమంలో మదనపల్లె ఆర్‌డిఒ మురళి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవిచంద్ర బాబు, తహశీల్దారు రఫిక్‌ అహ్మద్‌, ఎంపిడిఒ శంకరయ్య, రైతులు పాల్గొన్నారు.