May 01,2023 01:22
శ్రీశ్రీ సాహిత్య నిధి పుస్తకావిష్కరణ దృశ్యం

ప్రజాశక్తి-బాపట్ల: తెలుగు సాహితీ లోకంలో విప్లవాగ్నిని రగిలించిన శ్రీశ్రీ సాహిత్యంలో ఒక నూతన ప్రభంజనాన్ని సృష్టించారని ప్రజాకవి, వైద్య విద్వాన్‌ డాక్టర్‌ ఎస్‌ శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం శ్రీశ్రీ 113వ జయంతి సందర్భంగా సాహితీ భారతి ఆధ్వర్యంలో శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఊహల్లో విహరిస్తున్న తెలుగు సాహిత్యాన్ని వాస్తవ పరిస్థితులకు అద్దంపట్టే విధంగా తమ రచనలతో సమాజా న్ని శ్రీశ్రీ చైతన్యపరిచారన్నారు. సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ మాట్లాడుతూ.. ఛాందస భావ సంకెళ్లను ఛేదించి సామాన్యులకు అర్థమయ్యే భాషలో తాడి త పీడిత ప్రజల కష్టాలకు శ్రీశ్రీ అక్షర రూపాన్ని ఇచ్చారన్నా రు. కార్యక్రమంలో మర్రి మాల్యాద్రి రావు, ఆదం షఫీ, ఎం జాకబ్‌, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్ర మూర్తి, ఎం కృష్ణ, పువ్వాడ వెంకటేశ్వర్లు, రెంటాల మురళి, రాధాకృష్ణమూర్తి, అవ్వారు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కష్టజీవుల కవి శ్రీశ్రీ
సాహిత్య మార్గాన్ని విప్లవీకరించి తాడిత పీడిత జనుల పక్షాన నిలిచిన గొప్ప కవి శ్రీశ్రీ అని ఫోరం ఫర్‌ బెటర్‌ బాపట్ల కార్యదర్శి పిసి సాయిబాబు అన్నారు. ఆదివారం శ్రీశ్రీ 113వ జయంతి సందర్భంగా బాపట్ల సరస్వతి మెమోరియల్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన శ్రీశ్రీ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సామాజిక విప్లవానికి పురోగామిగా సాహిత్య విప్లవం సాగాలని ఆయన విశ్వసించారన్నారు. విప్లవ సాహిత్య యుగకర్తగా ఖ్యాతి గడించారని, కష్టజీవుల హృదయాలకు తగిలిన గాయాలను గేయాలుగా మార్చారని అన్నారు. బాధలు, భయాలు లేని నూతన సమాజ నిర్మాణాన్ని శ్రీశ్రీ కాంక్షించారు. తెలుగు సాహిత్యంలో ఎర్రజెండాని, ప్రపంచ సాహిత్యంలో తెలుగు జెండాని ఎగురవేసిన ఘనుడని అన్నారు. మూఢనమ్మకాలు, విశ్వాసాలను ఆయన వ్యతిరేకించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ సాహిత్య నిధి నూతనంగా ప్రచురించిన 30 పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం జి శాంతకుమారి, ఉపాధ్యాయులు రమాదేవి, శివపార్వతి, విద్యార్థులు పాల్గొన్నారు.