
ప్రజాశక్తి-అనకాపల్లి
అచ్యుతాపురం సాహితీ ఫార్మా కంపెనీలో చోటుచేసుకున్న ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు బుధవారం స్థానిక కలెక్టట్ కార్యాలయంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, శాసనసభ్యులు కన్నబాబు రాజు, కలెక్టర్ రవి పఠాన్ శెట్టి చేతుల మీదుగా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కంపెనీలో ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం ప్రభుత్వం ప్రకటించి సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ సాహితీ ఫార్మా ఘటన గురించి తెలిసిన వెంటనే తాను విజయవాడ నుంచి హుటాహుటిన విశాఖ చేరుకున్నారని, క్షతగాత్రులను చూసిన తర్వాత ఇక్కడ పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వివరించగా ఆయన కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని చెప్పారు. ప్రమాదంలో గాయపడిన వారు కోలుకుంటారని భావించినా, ప్రమాద తీవ్రత ఎక్కువ ఉన్నందువలన వారు మరణించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కన్నబాబు రాజు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతోపాటు, వారి కుటుంబాలలో ఒకరికి ఆ కంపెనీలోనే ఉద్యోగం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో బాధిత కుటుంబాలతో పాటు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము పాల్గొన్నారు.
పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా భద్రత చర్యలు చేపట్టాలి
అనకాపల్లి : పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని, అచ్చుతాపురం కేంద్రంగా ఈఎస్‌ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము డిమాండ్ చేశారు. ఈ మేరకు సాహితీ ఫార్మా మృతి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత కార్యక్రమంలో పాల్గొన్న రాము మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు వినతిపత్రం అందజేశారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో పని చేస్తున్న వేలాది మంది కార్మికులు వద్ద ఈఎస్‌ఐ పేరుతో సంవత్సరానికి సుమారు రూ.50 కోట్లు వసూలు చేస్తున్నారని, కానీ కార్మికులకు వైద్య సౌకర్యం సక్రమంగా అందడం లేదని తెలిపారు. ప్రమాదాలు బారిన పడిన కార్మికులు వైజాగ్, అనకాపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మరణిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అచ్చుతాపురం కేంద్రంగా 100 పడకల ఈఎస్‌ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు.