Sep 06,2021 06:58

     చనకు ప్రమాణమే ప్రాణమని బలంగా భావించేవారాయన. అందుకే కావ్యం ప్రారంభించి... దానికి ప్రామాణికత లభించక పోవడంతో 40 ఏళ్ల పాటు విరామం ప్రకటించారు. చారిత్రక నేపథ్యం కలిగిన కావ్యానికి ఉపయుక్తమే జీవధాతు అంటారు. ఆయనే పల్నాట ప్రభవించిన ప్రౌఢ కవివరేణ్యులు - కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చిటిప్రోలు కృష్ణమూర్తి. ఆయన పండితుడు కానప్పటికీ అక్షరానికి పాండిత్యాన్ని పులిమాడు. పద్య కవిత్వంలో కవిరాజుగా వెలుగొందాడు. చిటిప్రోలు కృష్ణమూర్తి 1932 డిసెంబరు 25వ తేదీన కనకమ్మ, వెంకటరత్నం దంపతులకు జన్మించారు. ఈనెల 2వ తేదీ గురువారం తెల్లవారు జామున అస్తమించారు. చదువుకున్నది ఎస్‌ఎస్‌ఎల్‌సి వరకు మాత్రమే ఐనా, తెలుగు భాషపై అమితమైన పట్టు సాధించారు.
    చిటిప్రోలు స్వగ్రామం గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని గామాలపాడు. ఈ గ్రామానికి ఒక ఉత్కృష్టత ఉంది. పల్నాటి చరిత్రలో ప్రఖ్యాతస్థానం వహించింది. ఆ విశిష్టత ఏమంటే 12వ శతాబ్దిలో వీరనారిగా, దేశీయ తొలి మహామంత్రిగా ఖ్యాతిగడించిన నాయకురాలు నాగమ్మ కూడా అదే గ్రామ వాసి.
     కృష్ణమూర్తి 27 ఏళ్ళ వయసు నాటికే ప్రతిష్ఠాత్మకమైన రచన 'కైకేయి' కావ్యాన్ని ముద్రణలోకి తెచ్చారు. తొట్ట తొలి కావ్యమే ఆయనకు విశిష్టమైన ఖ్యాతిని తెచ్చిపెట్టింది. 'కైకేయి' కావ్యం ప్రతిష్ఠాత్మకం, విశిష్టాత్మకం అని ఎందుకు ప్రస్తుతిస్తున్నానంటే... ఈ కావ్యాన్ని 1964 నుంచి 1966 వరకూ ఉస్మానియా యూనివర్శిటీ పాలక మండలి బిఏ తెలుగుకు (స్పెషల్‌) పాఠ్యగ్రంథంగా స్వీకరించింది. 'కైకేయి' పశ్చాత్తాపం, 300 పద్యాల సమగ్ర కావ్యంగా రూపొందింది. శ్రీరాముడు బాల్యంలో ఎక్కువ కాలం కైక వద్దే పెరిగిన వైనం మొదలుకొని రాముడు అరణ్యవాసానికి వెళ్ళిన తదుపరి ఆమె అనుభవించిన వేదన, భరతునితో కలిసి శ్రీరాముని చెంతకు వెళ్ళి తిరిగి అయోధ్యకు ఆహ్వానించడం, మార్గమధ్యంలో భరద్వాజ ఆశ్రమానికి చేరిన కైకను ముని ఊరడించడం, ఒక మహత్కార్యం జరగవలసి ఉన్నందున ఈ విపత్కరం చోటు చేసుకుందని, చింతించవలదనీ, నిమిత్త మాత్రురాలవంటూ బుజ్జగించడం వంటి రామాయణ గాథలోని నిక్షిప్త విషయాలతో నడిచిందే - 'కైకేయి' కావ్యం. 'కైకేయి'ని భరద్వాజ ముని ఒక్కరే సరైన రీతిలో అవగాహన చేసుకున్నాడంటారు చిటిప్రోలు.
     ఆయన రచనల్లో మరో కలికితురాయి 'పురుషోత్తముడు' కావ్యం. ఈ కావ్యం ఆయనకు జాతీయ స్థాయిలో సమున్నత గౌరవాన్ని కట్టబెట్టింది. 'పురుషోత్తముడు' చిటిప్రోలుకు 2008 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును సాధించి పెట్టాడు. ఈ పురస్కారం ఆయన 2009 జనవరిలో అందుకున్నారు. 1964లో అంకురార్పణ జరిగిన ఈ కావ్యం 500 పద్యాల పూరణ అనంతరం, ప్రమాణం లభించకపోవడం మూలంగా, 40 ఏళ్ళపాటు అక్కడే నిలిపివేశారు. గ్రీకు, భారతీయ నాణేల సమాచారం నిండిన పుస్తకాలు సేకరించారు. దీర్ఘకాల పరిశోధనానంతరం గ్రీకు నాణేల పుస్తకంలోని 7వ నాణెం ఆయన చెప్పదలచుకున్న కథాంశానికి ప్రామాణికంగా నిలిచింది. ఈ ప్రామాణికత ఇచ్చిన భూమికతో ఆయన కలం మరో 600 పద్యాల వరకూ పరుగులు పెట్టి కావ్యానికి ముగింపు నిచ్చింది. మొత్తం 1100 పద్యాలతో సమగ్ర కావ్యంగా 2006లో ముద్రణలోకి వచ్చింది.
1966లో ఆయన 'తరంగిణి' మకుటం కలిగిన ఖండకావ్యాన్ని రచించారు. వివిధ అంశాల సమాహారమే ఈ కావ్యం. 300 పద్యాలకు తక్కువ కాకుండా ఇందులో ఇమిడాయి. అనంతరం 'మాఘమేఘాలు' శీర్షిక గల కావ్యాన్ని పూరించారు. మాఘ మహాకవి మాఘుడి 'శిశుపాల వధ' ఆధారం. మేఘం మహాకవి 'కాళిదాసు విరచిత మేఘసందేశం' వేదిక. ఈ రెండు సంస్కృత కావ్యాల తెలుగు అనువాదాన్ని ఆయన పూర్తి చేశారు. ఐతే 20 సర్గలున్న శిశుపాలవధలోని 3 సర్గలూ, మేఘసందేశం పూర్తి కావ్యాన్నీ సంయుక్తంగా ఆంధ్రీకరించారు. తరువాత 2017లో మాఘహాకవి శిశుపాలవధ మకుటంతో మొత్తం 20 సర్గలతో 1650 పద్యాలు గల సంపూర్ణ కావ్యాన్ని రచించారు.
      తమిళ కవి వాంఛేశ్వర విరచిత కావ్యం మహిష శతకాన్ని అదే మకుటంతో తెనుగులో తర్జుమా చేశారు. ఈ కావ్యాన్ని తెనుుగులెంక తుమ్మల సీతారామమూర్తికి అంకితమిచ్చారు. చిటిప్రోలు పట్ల తుమ్మలకు వల్లమాలిన వాత్సల్యం. ఆయన మరో కావ్యం 'అక్షర దేవాలయం' ఇది కూడా ఖండకావ్యమే. సుమారు 4000 పద్యాలతో పూరించారు. వివేకానందుని బోధనలు అంశంగా 'వివేకవాణి' శీర్షికతో 100 పద్యాలతో ఒక శతకాన్ని తీసుకొచ్చారు. ఆంగ్లంలో వివేకానందస్వామి రచించిన ప్రబోధ సూక్తులనేకం ఈ శతకంలో ఇమిడిపోయాయి. చివరగా మైధిలీ శరణ్‌గుప్త హిందీ రచన 'సాకేత్‌' మూలాన్ని చిటిప్రోలు 'సాకేతము' మకుటంతో తెలుగులో అనువదించారు. రామాయణ కథాంశ ప్రాధాన్యంగా ఉపేక్షిత పాత్రలకు ఈ కావ్యంలో స్థానం కల్పించారు. లకëణుని పత్ని ఊర్మిళ పాత్రను చుట్టుకుంటూ సాగే ఈ కావ్య నిడివి 2000 పద్యాలు. నాలుగేళ్ల అవిరళ కృషి ఫలితం ఈ రచన. సంప్రదాయబద్ధంగా నడిచిన చిటిప్రోలు కవిత్వంలో సార్వకాల, సమకాలీన అంశాలూ, ఇతిహాసాధారిత భూమికలూ ఉన్నాయి.
తెలుగు, సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషల్లో సమగ్రత గల చిటిప్రోలు మొత్తం 9 కృతులతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. వ్యవసాయం వృత్తిగా, కవిత్వం ప్రవృత్తిగా కొనసాగిన దార్శనికులు చిటిప్రోలు. ఒంగోలు పట్టణంలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం వారు జనవరి 2007లో నిర్వహించిన రాష్ట్ర రచయితల మహాసభలో ఈ దశాబ్ది పద్య సాహిత్యంపై బేతవోలు రామబ్రహ్మం చిటిప్రోలు విరచిత 'పురుషోత్తముడు' కావ్యం ఔచిత్యాలను 30 నిమిషాల పాటు అనర్గళంగా ఉపన్యసించారు. గొప్ప కావ్యంగా, ప్రౌఢ కవిత్వంగా కొనియాడారు. చిటిప్రోలు సాహిత్యంపై ఇద్దరు విశ్వవిద్యాలయ విద్యార్థులు పరిశోధన జరిపారు.
మొత్తం సాహిత్యం ప్రయాణంలో చిటిప్రోలు అనేక మైలురాళ్ళు దాటుకుంటూ వచ్చారు. పలు ప్రతిష్ఠాత్మక అవార్డులూ, రివార్డులూ అందుకున్నారు. వాటిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మహామేధావి, దోమా వెంకటస్వామిగుప్త పీఠ పురస్కారం, సృజన సాహిత్య పురస్కారం, గడియారం పురస్కారం, కవిసామ్రాట్‌ విశ్వనాథ పురస్కారం, ఆచార్య గంగప్ప సాహితీ పురస్కారం, నాళం కృష్ణారావు అవార్డు (మొట్టమొదటగా వీరినే వరించింది), నమ్మాళ్‌వార్‌ అవార్డు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పద్యకవితా పురస్కారం వంటివి అందులో కొన్ని. చిటిప్రోలుని కవిసామ్రాట్‌ బిరుదు కూడా ఆశ్రయించింది. అయితే ఈ బిరుదును అలంకరించుకోవటానికి ఆయన విముఖత ప్రదర్శించారు. ఆ బిరుదము ఒక విశ్వనాథ సత్యనారాయణకు మాత్రమే పరిమితమని చెప్పడం ఆయన విశాలతత్వానికీ, పెద్దలయెడల ఆయనకుగల గౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది. కవిరాజశేఖర, కవితాసుధాకర బిరుదములు కూడా ఆయనకు లభించాయి. బిరుదులు చెప్పుకోవడానికి ఆయన ఆసక్తి చూపేవారు కాదు. కవి నీతిమంతుడుగా ఉన్నప్పుడే, తన రచనలు విలువలు సంతరించుకుంటాయనీ ఆయన స్పష్టం చేసేవారు. కవికైనా, మరొకరికైనా ప్రవర్తనే ప్రధానమని పేర్కొనేవారు.

- వై.హెచ్‌.కె. మోహనరావు
94401 54114