Jun 25,2023 01:01
గోలి లక్ష్మయ్య దంపతులను సన్మానిస్తున్న నిర్వాహకులు

ప్రజాశక్తి-బాపట్ల: సాహితీ క్షేత్రంలో అక్షరాల పంటలు పండించే హాలికుడిగా బాపట్ల జిల్లా డిసిఆర్‌బి డిఎస్‌పి గోలి లక్ష్మయ్య అక్షర సేవలు అనిర్వచనీయమని బివిఎస్‌కే ట్రస్ట్‌ అధినేత డాక్టర్‌ శరత్‌ బోస్‌ అన్నారు. శుక్రవారం రాత్రి బాపట్లలో డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్న గోలి లక్ష్మయ్య పదోన్నతిపై గుంటూరుకు బదిలీ అయిన సందర్భంగా ఫోరం ఫర్‌ బెటర్‌ ఆధ్వర్యంలో బాపట్ల రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ హాలులో లక్ష్మయ్యకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శరత్‌బోస్‌ మాట్లాడుతూ ప్రచార ప్రసార మాధ్యమాల తాకిడికి పుస్తక పఠనానికి దూరమవుతున్న విద్యార్థులు, ప్రజలకు పుస్తక ఉద్యమం ద్వారా పుస్తకాలకు చేరువ చేయాలనే లక్ష్యానికి శ్రీకారం చుట్టి సాహితీ కళా రంగాలకు గోలి లక్ష్మయ్య అందిస్తున్న సేవలు అపారమైనవ న్నారు. కళామతల్లి ముద్దుబిడ్డగా, సాహితీ సౌజన్య మూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో విశేష ఖ్యాతి గడించారన్నారు. వృత్తి రీత్యా పోలీసుశాఖలో ఉద్యోగమైనప్పటికీ ప్రవృత్తి సాహిత్య రంగానికి ఆయన వెలకట్టలేని సేవలు అందించారు. విద్యార్థుల చేత పుస్తకాలు చదివించాలనే లక్ష్యంతో పుస్తకోద్యమానికి శ్రీకారం చుట్టి భావపురి పుస్తకోద్యమ సమితిని స్థాపించారు. బదిలీపై వెళ్తున్న డిఎస్‌పి గోలి లక్షయ్య దంపతులను పలు సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కవులు కలిమిశ్రీ, అయినాల మల్లేశ్వరరావు, పావులూరి శ్రీనివాసరావు, వెంపటి సత్యన్నారాయణ, మన్నే శ్రీనివాసరావు, ఫోరం ఫర్‌ బెటర్‌ బాపట్ల కార్యదర్శి, పుస్తక ఉద్యమ సమితి అధ్యక్షులు పిసి సాయిబాబు, చిత్రకారుడు జీవి, గ్రంథాలయాధికారి శివాజీ గణేశన్‌, మల్లికార్జున, మానం అప్పారావు, వంకాయలపాటి హరిబాబు, ప్రజా వైద్యులు డాక్టర్‌ శ్రీనివాస్‌, ఎఎం వరప్రసాద్‌ పాల్గొన్నారు.