Jun 27,2023 21:20

సాగుతున్న సహకారం


జిల్లాలో వ్యవసాయ రుణాల మంజూరు ప్రక్రియ మందకొడిగా సా..గుతోంది. జిల్లా కో-ఆపరేటివ్‌ సహకార బ్యాంకు ఆదేశాలతో ప్రాథమిక సహకార సంఘాలు పకడ్బందీగా రైతు రుణ పంపిణీకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఖరీఫ్‌ సీజన్‌ పంటల సాగుకు అవసరమైన రుణాలను జూన్‌, జులై మాసాల్లో మంజూరు చేయాల్సి ఉంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై సుమారు నెల రోజులు గడుస్తున్నప్పటికీ 20 శాతమే రుణాలను మంజూరు చేయడం ఆందోళన కలిగిస్తోంది. జులై నెలాఖరు నాటికి పంటల సాగు ముగియనున్న నేపథ్యంలో మిగిలిన 80 శాతం లక్ష్యాన్ని అధిగమించాల్సి ఉంది. నెల రోజుల వ్యవధిలో ఇంతటి భారీ లక్ష్యాన్ని అధిగమించడంపై సందేహాలు నెలకొన్నాయి.ప్రజాశక్తి - కడప ప్రతినిధి
2023-24 ఖరీఫ్‌ సీజన్‌లో రూ.500 కోట్ల వ్యవసాయ రుణాలను పంపిణీ చేయాలనే లక్ష్యాన్ని జిల్లా కో- ఆపరేటివ్‌ సహకార బ్యాంకు జిల్లా యంత్రాంగం నిర్దేశించుకుంది. ఉమ్మడి కడప జిల్లాలోని 72 ప్రాథమిక సహకార పరపతి సంఘాలకు ఆదేశాలు జారీ చేసింది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న నేపథ్య ంలో రూ.100 కోట్ల రుణాలను మాత్రమే పంపిణీ చేసింది. ఈలెక్కన 20 శాతం రుణాలను మాత్రమే మంజూరు చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 80 శాతం రుణా లను జులై నెలాఖరు నాటికి మంజూరు చేయాల్సి ఉంది. ఖరీఫ్‌ ఆలస్యమైన నేపథ్యంలో రైతాంగం వ్యవసాయ రుణాల సేకరణపై పూర్తిస్థాయి దృష్టి సారించింది. ఇటువంటి పరిస్థితుల్లో 20 శాతం మంజూరు చేయడంపై ఆందోళన నెలకొంది. వర్షాలు ఊపందుకున్న నేపథ్యంలో రైతాంగం పంటల సాగుపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించనుండడం తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో వ్యవసాయ రుణాల మంజూరు చేయడంపై సందేహం నెలకొంది.
బుక్‌అడ్జస్ట్‌మెంట్లే శరణ్యమా?
ఉమ్మడి జిల్లాలోని 72 ప్రాథమిక సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. కడప జిల్లాలోని 47 ప్రాథమిక సహకార సంఘాలు, అన్నమయ్య జిల్లాలోని 25 ప్రాథమిక సహకార సంఘాల పరిధిలోని 72 వేల మంది రైతులకు రుణాల పంపిణీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఆలస్యంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పంటల సాగుపైనే దృష్టి కేంద్రీకరించారు. ఫలితంగా డిసిసిబి అధికారులు సుమారు 40 వేల మంది రైతుల రుణాలు బుక్‌ అడ్జెస్ట్‌మెంట్‌ పరిధిలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే వాదన రైతు సంఘాల నాయకుల నుంచి వినిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో బుక్‌అడ్జస్ట్‌మెంట్‌ బారిన పడిన రైతాం గం ప్రయివేటు వడ్డీ వ్యాపారాలను ఆశ్రయించే అవకాశాలు పుష్కలముగా ఉన్నాయనడంలో సందేహం లేదు.
రైతులకు తప్పని తిప్పలు
ఖరీఫ్‌ సీజన్‌ ఆలస్యంగా సాగైన నేపథ్యంలో రైతాంగం పంటల సాగు చేయడంపైనే దృష్టి సారించడం తెలిసిందే. డిసిసిబి అధికార యంత్రాంగం నిబంధనల్ని కఠినతరం చేసిన నేపథ్యంలో రైతులు రుణాల మంజూరుకు సంబంధించిన అడంగల్‌, ఒన్‌బి, ఇసి మొదలగు పత్రాల సేకరణకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడానికి సమయం దొరకని పరిస్థితి. రైతు రుణాలను మంజూరు చేయడానికి రైతుల దగ్గర నుంచి సేకరించిన ఇసి, అడంగల్‌, ఒన్‌బి, మార్ట్‌గేజ్‌ మొదలగు అంశాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం రుణాలను మంజూరు చేస్తోంది. జిల్లా రుణ పరపతి కమిటీ ఆమోదించిన మేరకు పంటలను బట్టి రుణాలను మంజూరు చేస్తోంది. సాగుకు సరిపడా రుణాలు మంజూరు కావడం లేదనే వాదన రైతు సంఘాల నాయకుల నుంచి వినవస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో మిగిలిన 80 శాతం రుణ పంపిణీ చేయడం సవాలుగా మారే అవకాశం ఉందనడంలో సందేహం లేదు.
రుణ పంపిణీని వేగవంతం చేయాలి
సహకార రుణ పంపిణీని వేగవంతం చేయాలి. ఖరీప్‌ సీజన్‌ నెల రోజుల్లో 20 శాతమే పంపిణీ చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా రైతులు సంబంధిత పత్రాలను అందజేయని నేపథ్యంలో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే అవకాశం ఉంది. జిల్లా అధికార యంత్రాంగం బుక్‌అడ్జస్ట్‌మెంట్లకు పరిమితం గాకుండా వంద శాతం రుణాలను మంజూరు చేయాలి. లేనిపక్షంలో ఆందోళనలు తప్పవు
- దస్తగిరిరెడ్డి, జిల్లా కార్యదర్శి, ఎపి రైతు సంఘం, కడప.
లక్ష్యాన్ని అందుకుంటాం
ఖరీఫ్‌ సీజన్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. ఫలితంగా జులై, ఆగస్టు మాసాల్లోనూ రుణాలు మంజూరు చేయవడానికి అవకాశం లభించింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మిగిలిన 80 శాతం లక్ష్యాన్ని అందుకుంటాం.
- రాజేంద్రకుమార్‌, డిసిసిబి, సిఇఒ, కడప.