ప్రజాశక్తి - సాలూరురూరల్ : నాడు-నేడు కింద చేపడుతున్న పాఠశాలల పనులను వేసవి సెలవుల అనంతరం స్కూళ్ల పున: ప్రారంభానికి పనులు పూర్తి చేయాలని రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకూ గుత్తేదారులకు, కిందస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే జిల్లాలో ఎక్కడా ఒక్క పాఠశాలను కూడా పూర్తిచేసి అప్పగించిన పాపాన లేదు. ఈఏడాది విద్యా సంవత్సరం ప్రారంరంభమై నెలరోజులు పూర్తి అయినా పలుచోట్ల పనులను పునాదులకు పరిమితమయ్యాయి. మరో పక్క కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారు బడులో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు కల్పిస్తామంటున్న ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. పాఠశాలల పనులు పూర్తి చేయకపోవడంతో విద్యార్థులు అసౌకర్యాల నడుమ విద్యను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిపడా ఉపాధ్యాయులున్నా భవనాల కొరతతో సరైన వసుతుల్లేక విద్యార్థుల ఇబ్బందులు వర్ణణాతీతం.
మండలంలో సుమారు 86 పాఠశాలల్లో మొదటి విడతగా 45పాఠశాలలకు నాడు నేడు కింద నూతన భవన నిర్మాణాలు, మరమ్మతులు, మంచినీరు, విద్యుత్ సౌకర్యం, కుర్చీలు బల్లలు అన్ని రకాలుగా పనులను ప్రారంభించి పూర్తిచేశారు. అయితే రెండో దశలో మిగిలిన 41 పాఠశాలలకు నాడు-నేడు కింద నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ నిధులతో అన్ని పాఠశాలలకు అవసరమైన భవనాలు, మరమ్మతులు, మంచినీటి కోసం బోర్లు, బాతు రూమ్‌లు చేయించేయిందుకు విద్యాకమిటీ, ప్రధానోపాధ్యాయులు కలిసి పనులు మొదలు పెట్టారు. అంత వరకు బాగానే ఉంది. పనులు మొదలు పెట్టి నేటికీ ఐదు నెలలు కావస్తున్నా 41 పాఠశాలలో ఒక్కటి కూడా నేటికి పూర్తి కాలేదు. ఈ నిర్మాణాలకు ప్రభుత్వం కూడా అరకొరగా నిధులు మంజూరు చేస్తుండడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాలైన మర్రిపల్లి, గంగన్న దొరవలస, వెలగవలసలో పాడుబడిన తరగతి గదులను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో నూతన భవన నిర్మాణాలను ప్రారంభించారు. అయితే వాటి పనులు నేటికీ పునాదులకే పరిమితమవ్వడంతో ఈ పాఠశాలల్లో సుమారు వంద మంది విద్యార్థులు గ్రామస్తుల సహకారంతో గంగన్నదొరవలసలో మూడు ఇళ్ల గడపల్లోనూ, వెలగవలసలోని జీడిపిక్కల గౌడౌన్ల పాఠాలను బోధిస్తున్నామని ప్రధానోపాధ్యాయుడు జీవన్‌కుమార్ తెలిపారు. గతంలో ఈ పాఠశాలలో పనిచేసిన ప్రధానోపాధ్యాయుడి పేరున ఖాతా ఉండడం, తాను కూడా వచ్చి నెల రోజులు గడుస్తున్న ఆ ఖాతాను తనకు బదిలీ చేయకపోవడంతో నిధులు ఎంత మంజూరయ్యాయి, ఇంకా ఎంత మిగిలాయి అన్న విషయం తెలియలేదని, ఖాతాను మార్చిన వెంటనే పనులను మొదలు పెడతామని ఆయన తెలిపారు. ఇదే విషయం పై పాఠశాల కమిటి ఛైర్మన్ తొత్తడి పరసన్నదొరతో మాట్లాడగా పాత భవనంను తొలగించి సుమారు పది నెలలు కావస్తున్నా పనులు పునాదులు వరకే పరిమితమయ్యాయి. దీంతో తమ పిల్లలు ఎక్కడ కూర్చొని చదువుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. గ్రామంలో మూడు ఇళ్ల దగ్గర గడపల్లో తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పాఠశాల పనులు ఎందుకు నత్తనడకన జరుగుతున్నాయో తెలియన పరిస్థితి అని అన్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పనులు మొదలు పెట్టాలని కోరారు.










