Oct 16,2023 23:18

ఎల్‌.గార్లపాడులో జెండావిష్కరణలో సిపిఎం శ్రేణులు

ప్రజాశక్తి - సత్తెనపల్లి : సాగునీటి విధానంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.లకీëశ్వరరెడ్డి డిమాండ్‌ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో పోరుయాత్ర చేపట్టిన పాదయాత్రను మండలంలోని లక్కరాజు గార్లపాడులో సోమవారం ప్రారంభించారు. తొలుత ఎర్రజెండాను ఎగురువేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో లకీëశ్వరరెడ్డి మాట్లాడుతూ రైతులు ఆకాశం వైపు, సాగర్‌ కాల్వ వైపు చూస్తున్నారని, ఇప్పటికే వరి పూర్తిగా ఎండిపోగా పత్తి, మిర్చి పైర్లు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సాగునీటి విధానాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేస్తామనే కేంద్రంలోని బిజెపి హామీనిచ్చి అధికారంలోకి వచ్చాక రైతులను మోసం చేసిందని అన్నారు. అన్ని పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని, రైతులకు రుణవిముక్తి చట్టం చేయాలని కోరారు. విద్యుత్‌ సవరణ బిల్లును రద్దు చేయాలని, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగింపును ఆపాలని, నాలుగు లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని, కార్మికులకు స్కీమ్‌ వర్కర్స్‌కు కనీస వేతనం చట్టం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం మండల కార్యదర్శి పి.మహేష్‌ మాట్లాడుతూ అనేక గ్రామాల్లో తాగునీరు సమస్య అధికంగా ఉన్నట్లు ప్రజలు పాదయాత్ర దృష్టికి తెచ్చారన్నారు. పంటలను కాపాడుకోవడానికి రైతులు కాల్వల్లోని నీటిని పొలాలకు పెట్టుకుంటుంటే కేసులు పెడతామంటూ అధికారులు బెదిరించడం దుర్మార్గమని అన్నారు. కంటెపూడి ఎస్టీ కాలనీలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని, లక్కరాజు గార్లపాడు, కొమెరపూడి, గ్రామాల్లో జగనన్న ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని డిమాండ్‌ చేశారు. కట్టవారిపాలెంలో డొంక రోడ్లను వెయ్యకపోవడం వల్ల గ్రామ ప్రజలు త్రీవ ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు వి.తులసీరామ్‌, ఆర్‌.పూర్ణచంద్రరావు, శివయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి పెద్దిరాజు గేయాలు ఆలపించారు.
సత్తెనపల్లి పట్టణంలో పారిశుధ్యం, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని, అధికంగా వస్తున్న విద్యుత్తు బిల్లులను సవరించాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.రవిబాబు డిమాండ్‌ చేశారు. పట్టణంలో సిపిఎం చేపట్టిన ప్రజారక్షణ భేరి పాదయాత్ర నాలుగో రోజైన సోమవారం మాస్టియన్‌పేట, సుగాలి కాలనీ, రంగా కాలనీ, సొసైటీ ఏరియ, అంబేద్కర్‌ నగర్‌లో కొనసాగింది. నెలల తరబడి మురుగు కాల్వలను శుభ్రం చేయడం లేదని, దుర్వాసన, దోమలతో అల్లాడుతున్నామని మాష్టియన్‌పేట ప్రజలు పాదయాత్ర ఎదుట వాపోయారు. రెండ్రోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నా అవి కూడా సరిగా రావడం లేదన్నారు. విద్యుత్‌ బిల్లులు రెట్టింపు వస్తున్నాయని, చెల్లించలేకపోతున్నామని చెప్పారు. పాదయాత్రలో సిపిఎం పట్టణ కార్యదర్శి డి.విమల, నాయకులు జి.మల్లీశ్వరి, కె.శివదుర్గారావు, డి.ఉమామహేశ్వరరావు, నాణిక్య నాయక్‌ ఎ.వెంకటనారాయణ, రాజ్‌కుమార్‌, జ్యోతి, రమాదేవి పాల్గొన్నారు.
ప్రజాశక్తి-ముప్పాళ : మండలంలోని మాదలలో సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలను నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు, మండల కార్యదర్శి జి.బాలకృష్ణ మాట్లాడుతూ డ్రెయినేజీలు నిర్మించినా మురుగును తొలగించడం లేదని, దీంతో ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో జి.జాలయ్య, కె.సాంబశివరావు, ఎం.వెంకటరెడ్డి, కె.నాగేశ్వరరావు, సైదాఖాన్‌, నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు
.