* జెడ్‌పి చైర్‌పర్సన్ విజయ
ప్రజాశక్తి- ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురంలో సాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని జెడ్‌పి చైర్‌పర్సన్ పిరియా విజయ అన్నారు. బాహుదా నదిపై ఉన్న సాగునీటి ఛానల్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితులపై గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి దృష్టికి ఇచ్ఛాపురం నియోజకవర్గ సాగునీటి సమస్యలపై, బాహుదా నదిపై 11 గ్రోయిన్ల గురించి, లిఫ్ట్ ఇరిగేషన్ ఈదుపురం, లొద్దపుట్టి గురించి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ తీసుకెళ్లారని అన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన సిఎం ఆ లేఖలను ఇరిగేషన్ ఎస్‌ఇకి పంపించి గ్రోయిన్లు, లిఫ్ట్ ఇరిగేషన్లపై సమగ్ర నివేదిక కోరారని అన్నారు. దీంతో ఇరిగేషన్ ఎస్‌సి సుధాకర్, డిఇ జి.వి.రమణ, ఎఇ ఎం.ఎస్.పాణిగ్రహి బృందంతో పరిశీలించామని అన్నారు. బాహుదా నదిపై ఉన్న హరిపురం, రత్తకన్న, బెల్లుపడ, బిర్లంగి, శాసనం, కేసుపురం, డొంకురు, బుర్జపాడు, ఈదుపురం, లోద్దపుట్టి తదితర గ్రామాల లిఫ్ట్ ఇరిగేషన్లు, గ్రోయిన్లు పరిశీలించి నివేదిక తయారు చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపిపి బోర పుష్ప, కారంగి మోహనరావు, దక్కత నూకయ్యరెడ్డి, బాకి లక్ష్మీనారాయణ, సంతోష్ కుమార్, వర్క్‌ఇన్‌స్పెక్టర్ రాజు, రైతులు పాల్గొన్నారు.










