Oct 19,2023 21:13

అభివాదం తెలియజేస్తున్న నాయకులు

కడప అర్బన్‌ : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో సాగునీటి రంగంపై సీతకన్ను వేశారని, మేజర్‌, మీడియం, మైనర్‌ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా 9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉన్నప్పటికీ ప్రధాన కాలువలు, ఉపకాలువలు, పంట కాలువలు లేనందున 9వేల ఎకరాలకు కూడా నీరందించలేకపోవడం శోచనీయమని వక్తలు పేర్కొన్నారు. గురువారం జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో జిల్లా సమగ్రాభివద్దిపై ప్రెస్‌ క్లబ్‌లో చర్చా వేదిక నిర్వహించారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్‌ మోహన్‌ రెడ్డి శంకుస్థాపనల స్పెషలిస్ట్‌గా మారారని పేర్కొన్నారు. కడప ఉక్కు పరిశ్రమకు రెండుసార్లు శంఖుస్థాపన చేసి ఒక్క రూపాయీ వ్యయం చేయలేదన్నారు. కొప్పర్తి పారిశ్రామిక వాడ నిర్వీర్యం అయ్యిందని తెలిపారు. పులివెందుల అసాంఘిక శక్తుల అడ్డాగా మారిందని, జగన్‌ అభివద్ధి నిరోధకునిగా చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. కడప-పెండ్లిమర్రి-రాయచోటి-బెంగుళురు నూతన బ్రాడ్‌ గేజ్‌ రైలు మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి 21.3 కిలోమీటర్లు పూర్తి చేసిన తరువాత జగన్‌ ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వని కారణంగా రైల్వే శాఖ పనులు ఆపేసిందన్నారు. ఇంతటితో ఆగకుండా కడప - బెంగుళూరు రైల్వే ప్రాజెక్టు అవసరం లేదని ముఖ్యమంత్రి జగన్‌ రైల్వే బోర్డుకు, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన కారణంగా ఆ ప్రాజెక్టు రద్దయిందని చెప్పారు. తద్వారా జగన్‌ రాయలసీమ ద్రోహిగా రాయలసీమ ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నుండి విశాఖకు తరిలిస్తే కడప జిల్లాకు రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. కడప జిల్లాలో ఖనిజ సంపద, వక్ష సంపద సమద్దిగా ఉన్నా పారిశ్రామికీకరణ జరగనందున నిరుద్యోగ సమస్య తీవ్రమై వలసలు పెరుగుతున్నాయన్నారు. జిల్లాలో పాలెగాళ్లు, పెత్తందార్ల పెత్తనంతో పేదలు నలిగిపోతున్నారని, సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయని తెలిపారు. చట్టబద్ద పాలన కరువైందని, ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కుతున్నారని, వ్వవస్థలన్నీ నిర్వీర్యం అవుతున్నాయని అన్నారు. ప్రసంగిస్తూ ఇడుపులపాయలో ట్రిపుల్‌ ఐటీలో నిధుల కొరత కారణంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయన్నారు. తెలుగు సూర్యుడుగా ప్రసిద్ధి గాంచిన, యోగివేమనను తెలుగు ప్రజలకు పరిచయం చేసిన సి.పి. బ్రౌన్‌ గ్రంథాలయ అభివద్ధిని విస్మరించడం శోచనీయమన్నారు. రాజోలు జలాశయానికి 2019 నుంచి ఒక్కరూపాయి మంజూరు చేయలేదన్నారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థని నిర్వీర్యం చేశారని, విద్వేష రాజకీయాలు పోత్సహిస్తున్నారని వివరించారు. విభజన చట్టం అమలు కోసం కేంద్ర ప్రభుత్వంతోనూ, తెలంగాణ ప్రభుత్వం తోనూ పోరాడలేని నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. అభివద్ధి ప్రాధాన అజెంగా రాబోవు ఎన్నికలలో ఉండేటట్టు జనచైతన్య వేదిక కషిచేస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాలలో ఆయా జిల్లాల సమగ్రాభివద్దిపై చర్చాగోష్టులు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య ప్రసంగిస్తూ పాలకులు వ్యాపారులై ప్రజలు బిచ్చగాళ్ళుగా మారుతున్నారని కడప జిల్లాలో ఉన్న అపార ఖనిజ సంపద, ఎర్ర చందనం అధికార పార్టీ నేతల ధనార్జనకు బలైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌.తులసిరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌, టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యులు ఆర్‌. శ్రీనివాస రెడ్డి, జనసేన పార్టీ రాష్ట్ర నేత సుంకర శ్రీనివాస్‌, లోక్‌ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు దేవర శ్రీ కష్ణ, ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్‌ డాక్టర్‌ బేరిల్ల శ్రీనివాస్‌, బహుజన సమాజ్‌ వాదీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సగిల గుర్రప్ప, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నేత కె.లింగమూర్తి, జనవిజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షులు బి. విశ్వనాధ, జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి పి. శంకరయ్య, పి ఈ టి జిల్లా కార్యదర్శి పి. రమేష్‌ ప్రసంగించారు.