ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్ : ఎన్నికల ముందుగా మాయమాటలు చెప్పిన సిఎం జగన్.. అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులను నీరుగార్చారని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. సోమవారం స్థానిక టిడిపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వైసిపి అనుసరించిన రివర్స్ విధానం వల్ల ప్రాజెక్టులన్నీ పడకేశాయన్నారు. కాలువల్లో వ్యర్థాలు, పూడికలు తొలగించకుండా నీరు విడుదల చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. దీనివల్ల రైతులకు సాగునీరు అందే పరిస్థితి లేదన్నారు. ఈ నెల 9న టిడిపి అధినేత చంద్రబాబు తోటపల్లి ప్రాజెక్టును సందర్శిస్తారని తెలిపారు. అనంతరం పార్వతీపురం పట్టణంలో బహిరంగ సభను నిర్వహిస్తారని, ఈ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మాట్లాడారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ డి.జగదీష్, పార్వతీపురం, పాలకొండ, కురుపాం నియోజకవర్గ ఇన్‌ఛార్జులు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, తోయక జగదీశ్వరి, నాయకులు ఆర్‌పి భంజ్‌దేవ్, గులిపల్లి సుధాకర్, గొట్టాపు వెంకటనాయుడు, డొంకాడ రామకృష్ణ, మజ్జి కృష్ణమోహన్ పాల్గొన్నారు.
చిరంజీవులుకు పార్టీలో సముచిత గౌరవం
పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు చేసిన సేవలను పార్టీ ఎన్నటికీ మరిచిపోదని సంధ్యారాణి తెలిపారు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోలుకున్నాక సముచిత గౌరవం ఇచ్చి, కలుపుకుంటూ వెళ్తామని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.










