
ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి, గరుగుబిల్లి, పార్వతీపురం రూరల్ : టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తోటపల్లి, జంఝావతి సహా చిన్న చిన్న గెడ్డలైన అడారిగెడ్డ, గుమ్మడిగెడ్డ వంటి మినీ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. జంఝావతి నదిని తోటపల్లి ప్రాజెక్టుతోను, వంశధార, నాగావళి నదులకు చిన్న చిన్న నదులను అనుసంధానం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రోజెక్టుల విద్వంసంపై యుధ్ధభేరి కార్యక్రమంలో భాగంగా బుధవారం గురుగుబిల్లి మండలంలోని తోటపల్లి ప్రోజెక్టును మాజీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. కుడి,ఎడమ కాలువల పరిస్ధితిని పరిశీలించిన అనంతరం ఉల్లిభధ్ర ఎర్రన్న గుడి ప్రాంతంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ముందుగా ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అడవితల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. అనంతరం రైతులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ రాష్టప్రభుత్వం వైఖరి వలన రాష్ట్రంలో అన్ని రంగాలు భ్రష్టుపట్టాయన్నారు. ఉత్తరాంధ్రలో 5 ప్రధాన నదులు, 69 పైగా ఉపనదులు ఉన్నాయని, వాటన్నింటినీ ప్రత్యేక ప్రణాళికతో అనుసంధానం చేసి ఉత్తరాంధ్ర కరువునివారణకు కృషి చేస్తామని తెలిపారు. ఇక్కడ మాజీ గిరిజన ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి.. టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో తమ జాతికి చెందిన గిరిజనులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అధికారంలోకి వచ్చిన వెంటనే వారిపై చర్యలుంటాయని అన్నారు. రైతులకు ఏడాదికి రూ.20వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. అమ్మకు వందనం పథకాన్ని ఆడపిల్లలందరికీ వర్తింపజేస్తామని, ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. అన్న క్యాంటీన్లను పునుద్దరించి, ఎన్ని కావాలంటే అన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రేపు జరగబోయేది కురుక్షేత్ర పోరాటమని, కౌరవ సభను గౌరవ సభ చేస్తానని అన్నారు. రాష్ట్రంలో వెనుక బాటు నశించిపోవాలంటే జగన్ వంటివారిని మరి జీవితంలో అధికారంలోకి రాకుండా బుధ్దిచెప్పాలని, రానున్న ఎన్నికలలో వారిని చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు.
పార్వతీపురంపై హామీల వర్షం
పార్వతీపురంలో రోడ్డు షో సందర్భంగా చంద్రబాబుకు ప్రజలు స్వాగతంపలికారు. అనంతరం పాతబస్టాండ్ వద్ద జరిగిన సభలో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఈ ప్రాంత సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీల వర్షం కురిపించారు. తోటపల్లి ప్రాజెక్టును పూర్తిచేసి పార్వతీపురానికి సాగు, తాగునీరు అందిస్తానని హామీఇచ్చారు. పార్వతీపురానికి బైపాస్‌రోడ్డు తీసుకొస్తానని, ఏరియా ఆస్పత్రిని 200 పడకలుగా అభివృద్ధి చేస్తానని, డంపింగ్‌యార్డును పూర్తి చేస్తామని తెలిపారు. గిరిజనప్రాంత ప్రధాన సమస్యగా ఉన్న పుర్ణపాడు-లాబేసు వంతెన పూర్తి చేస్తామని, ఏనుగుల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రహదారులకు మోక్షం కల్పిస్తామన్నారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల విజరుకమార్‌కు పూర్తిగా సహకరించాలని కోరారు.
స్థానిక ఎమ్మెలే భూ కబ్జాలకు అడ్డుకట్ట వేయండి
స్థానిక ఎమ్మెల్యే తెల్లవారితే చాలు భూకబ్జాలు, సెటిల్‌మెంట్‌లు, బెదిరింపులకు పాల్పడుతున్నాడని, ప్రజలంతా అడ్డుకట్ట వేసి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని చంద్రబాబు అన్నారు. చెరువులను, ప్రభుత్వ భూములను ఆక్రమించేయడంతో పాటు అందరినీ బెదిరించి స్థలాలు లాక్కుంటున్నాడని అన్నారు. చెరువులు, ప్రభుత్వ భూములు ఆయన అబ్బసొమ్మా అని ప్రశ్నించారు. టిడ్కో ఇళ్లు పూర్తి చేసి ఐదేళ్లయినా లబ్థిదారులకు అందజేయలేదన్నారు. పేదల ఇళ్ల పట్టాలపై సంతకాలు చేసి ఆయనే తహశీల్దార్‌గా, సబ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యులు పి.అశోక్‌గజపతిరాజు, గుమ్మడి సంధ్యారాణి, కిమిడి కళావెంకటరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, శత్రుచర్ల విజయరామరాజు, వైరిచర్ల కిషోర్‌చంద్రదేవ్, మాజీ ఎమ్మెల్యేలు భంజ్‌దేవ్, తోయక జగదీశ్వరి, వీరేష్‌దేవ్, ద్వారపురెడ్గి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.










