Sep 10,2023 20:12

పాదయాత్ర చేపడుతున్న నాయకులు

ప్రజాశక్తి - దేవనకొండ
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందని నాయకులు విమర్శించారు. పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధులు కేటాయించకపోవడంతో రైతులకు సాగు, తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. హంద్రీనీవా ద్వారా గుండ్లకొండ వద్ద స్లూయిజ్‌ ఏర్పాటు చేసి కోటకొండ, మాచాపురం వరకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం రైతు సంఘం ఆధ్వర్యంలో పి.కోటకొండ గ్రామంలో పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర బేతపల్లి, చెల్లెల చెలిమల, బంటుపల్లి, గుడిమిరాళ్ల మీదుగా గుండ్లకొండకు చేరింది. రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశులు, వ్యకాస జిల్లా అధ్యక్షులు వీరశేఖర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రైతు సంఘం మండల కార్యదర్శి సూరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పాలకులు, ప్రజా ప్రతినిధుల చిత్తశుద్ధి లోపం వల్ల ప్రతేడాది వర్షభావ పరిస్థితులతో కరువు ఏర్పడి రైతులు పెట్టిన పెట్టుబడులు రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో ఆగస్టు నెలలో వర్షాలు కురవక రైతుల పంటలు దెబ్బతిన్నాయన్నారు. మండలంలో హంద్రీనీవా పెద్ద కాలువ ద్వారా నీరు పోతున్నాయని, ఒడిసిపట్టి మండలంలోని ప్రతి ఎకరాకూ నీరిచ్చే అవకాశం ఉందని తెలిపారు. పాలకుల చిత్తశుద్ధి లోపం, బాధ్యతరాహిత్యం మండల రైతులకు శాపంగా మారిందని మండిపడ్డారు. గుండ్లకొండ దగ్గర హంద్రీ నీవా కాలువకు స్లూయిజ్‌ ఏర్పాటు చేయడం ద్వారా మండలంలోని గుండ్లకొండ, గుడిమిరాళ్ల, బంటుపల్లి, చెల్లెల చెలిమిల, బేతపల్లి, బండపల్లి, కోటకొండ, వెంకటాపురం, పల్లెదొడ్డి, మాచాపురం వరకు సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉందని తెలిపారు. వెంటనే ప్రభుత్వం గుండ్లకొండ దగ్గర స్లూయిజ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. నేలతలమరి చెరువు, గుండ్లకొండ బానకుంట, గుడిమరాళ్ల నిమ్మలబండ చెరువు, తుమ్మలచెరువు, బంటుపల్లి కుంట, చెల్లెల చెలిమిల చెరువు, బండపల్లి చెరువు, కోటకొండ చిన్నోని చెరువు, మాచాపురం పెద్ద చెరువు, బురకుంట చెరువుకు హంద్రీనీవా ద్వారా నీళ్లు మళ్లించడం ద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. హంద్రీనీవా ద్వారా మండలంలో 46 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని అధికారికంగా ఉన్నప్పటికీ పిల్ల కాలువల నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నందున రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయినప్పటికీ నిధుల కేటాయింపు జరగకపోవడంతో పిల్ల కాలువ నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. ఈ పాదయాత్రకు జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి మహేంద్ర నాయుడు మద్దతు తెలిపారు. జిల్లా సమగ్రాభివృద్ధి కమిటీ నాయకులు గౌస్‌దేశాయి, రైతుసంఘం, ప్రజా సంఘాల నాయకులు అశోక్‌, శ్రీరాములు, యూసుఫ్‌ బాష, బడే సాబ్‌, బజారి, ఓంకార్‌, సుధాకర్‌, శ్రీనివాసులు, మహేంద్ర, సుంకన్న పాల్గొన్నారు.