Apr 28,2023 19:45

నారా లోకేష్‌కు వినతిపత్రం ఇస్తున్న సాయిబాబు

ప్రజాశక్తి - ఆదోని
పశ్చిమ ప్రాంత నియోజకవర్గాల్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జిల్లా తెలుగు రైతు అధికార ప్రతినిధి సాయిబాబు కోరారు. మంత్రాలయంలో జరుగుతున్న యువగళం పాదయాత్రలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు వర్షాధారం కింద ఆధారపడి జీవిస్తున్నారని, పంటలు పండక వలసలు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తుంగభద్ర డ్యామ్‌ నుంచి ఆంధ్రా వాటా కింద 734 క్యూసెక్కుల నీరు రావాల్సి ఉండగా 250 క్యూసెక్కులకు మించి ఉండడం లేదన్నారు. డ్యామ్‌ నుంచి పూర్తిగా నీరందేలా చూడాలని కోరారు. హగరి వద్ద సాగునీటి ప్రాజెక్టు నిర్మించి 60 టిఎంసిల ద్వారా జిల్లాలోని 6 లక్షల ఎకరాలకు నీరందించవచ్చని తెలిపారు. కౌతాళం మండలం మేళిగనూరు వద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మించి రైతులను ఆదుకోవాలని కోరారు. అధికారంలోకి వస్తే సాగు, తాగునీరు అందేలా చూస్తారని లోకేష్‌ హామీ ఇచ్చారు.