
ప్రజాశక్తి-చీడికాడ:మాడుగుల నియోజకవర్గంలో దేవరాపల్లి, రైవాడ, కోణం, పాలవెల్లి జలాశయం, తాచేయరు జలాశయాల ప్రాజెక్టుల అభివృద్ధికి నిధులు ఎందుకు కేటాయించలేదని, రైతులు నష్టపోతున్నా ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఎందుకు పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ప్రశ్నించారు. మండలంలోని అప్పలరాజుపురం గ్రామంలో ఆయన స్వగృహం వద్ద కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టులకు అధిక మొత్తంలో నిధులు వెచ్చించి అభివృద్ధి చేశామని తెలిపారు. రైతులకు సకాలంలో సాగు నీరు అందేలా చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను, వ్యవసాయ అభివృద్ధిని పక్కనపెట్టి రైతుల నడ్డి విరుస్తుందని గవిరెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కపట మాటలు చెప్పి రాష్ట్ర సుస్థిర అబివృద్ధిని తుంగలో తొక్కి రాజ్యమేలుతున్నారని, ఇదేనా రాష్ట్ర అభివక్ష్మిద్ధి అని రామానాయుడు ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 8న మాడుగుల నియోజకవర్గంలో పర్యటిస్తారని, ప్రజలందరూ తప్పక ఆదరించాలని రామా నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు పోతల చిన్నం నాయుడు, మాజీ ఎంపీపీ కుచ్చు కళావతి, ఎంపీటీసీలు పెద్ది నాయుడు, ముత్యాలనాయుడు, మాజీ సర్పంచ్ దాలినాయుడు, సూర్యనారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.