Oct 29,2023 23:19

ప్రజాశక్తి - పెద్దాపురం వరి, అపరాల పంటల చివరి దశలో క్లిష్ట పరిస్థితులు నెలకొనడం వల్ల రైతులు నీటి కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్‌ వి.మునిరత్నం అన్నారు. స్థానిక వ్యవసాయ కేంద్రంలో వ్యవసాయ అధికారులు, రైతులతో నిర్వహించిన 'శిక్షణ-సందర్శన' కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్లో తక్కువ వర్షపాతం నమోదు కావటం వల్ల వరి, అపరాలు పంటల్లో ఈ పరిస్థితి నెలకొందన్నారు. పంట ఉత్పత్తులను రక్షించుకోవాలంటే నీటి కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరిలో అక్కడక్కడ ఎండాకు తెగులు,సుడిదోమ కనిపిస్తు న్నాయన్నారు. వీటి నివారణకు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలన్నారు. దాళ్లాలో విత్తనం ఎంపిక ప్రధానమన్నారు. దాళ్లాలో వరి పండించలేని ప్రాంతాలలోని వరి మాగాణుల్లో డిసెంబర్‌లో మినుము, పెసర విత్తనాలు చల్లుకోవాలన్నారు. మినుములో ఎల్‌బిజి 884 రకం విత్తనం పల్లాకు తెగులు తట్టుకుంటుందన్నారు. ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్‌ సిహెచ్‌.వెంకట నరసింహారావు మాట్లాడుతూ సార్వా చివరి దశలో వేడికి సుడి దోమ ఆశించే అవకాశం ఉన్నందున రైతులు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.నందకిషోర్‌, వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్‌ ఎఎస్‌ఆర్‌.శర్మ, డాక్టర్‌ ఐ.సుధీర్‌ కుమార్‌, డాక్టర్‌ భరత్‌ చంద్ర, డాక్టర్‌ వి.సుజాత, డాక్టర్‌ బివిఎస్‌సి.హరి, డాక్టర్‌ మల్లికార్జునరావు, డాక్టర్‌ వై.జ్యోతిర్మయి పాల్గొన్నారు.